పసిడి గిరాకీ డీలా

ABN , First Publish Date - 2021-07-30T05:56:05+05:30 IST

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికాని(క్యూ2)కి భారత్‌లో బంగారం గిరాకీ 76.1 టన్నులుగా నమోదైందని

పసిడి గిరాకీ డీలా

  • క్యూ1తో పోలిస్తే క్యూ2లో 46% క్షీణత 
  • 76 టన్నులకు పరిమితం: డబ్ల్యూజీసీ 
  • కొవిడ్‌ రెండో దశ విజృంభణే కారణం


ముంబై: ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికాని(క్యూ2)కి భారత్‌లో బంగారం గిరాకీ 76.1 టన్నులుగా నమోదైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ మార్చితో ముగిసిన మూడు నెలల్లో (క్యూ1) నమోదైన 140 టన్నుల డిమాండ్‌తో పోలిస్తే 46 శాతం క్షీణించింది. కరోనా రెండో దశ విజృంభణ ప్రభావంతో ఏప్రిల్‌, మే నెలల్లో పలు రాష్ట్రాలు స్థానిక లాక్‌డౌన్‌లు విధించడం బులియన్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వర్తక విలువ పరంగా చూసినా, త్రైమాసిక ప్రాతిపదికన గిరాకీ రూ.58,800 కోట్ల నుంచి రూ.32,810 కోట్ల స్థాయికి పడిపోయింది. మరిన్ని వివరాలు.. 


2020 క్యూ2లో నమోదైన 63.8 టన్నులతో పోలిస్తే, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గోల్డ్‌ డిమాండ్‌ 19.2 శాతం వృద్ధి కనబర్చింది. గత క్యూ2లో నమోదైన రూ.26,600 కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది క్యూ2లో బంగారం గిరాకీ విలువ 23 శాతం పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో దేశం మొత్తం లాక్‌డౌన్‌ కావడంతో బంగారం డిమాండ్‌ భారీగా పతనమైంది. 


ఈ ఏడాది ప్రఽథమార్ధంలో పసిడి డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధి చెంది 216.1 టన్నులకు పెరిగింది. 2020లో ఇదే కాలానికి గిరాకీ 165.8 టన్నులుగా ఉంది. గడిచిన ఆరు నెలల్లో బంగారం గిరాకీ విలు వ వార్షిక ప్రాతిపదికన 43 శాతం వృద్ధితో రూ.91,690 కోట్లకు చేరుకుంది. 




ద్వితీయార్ధంలో జోరు


ఈ ఏడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబరు)లో పసిడి గిరాకీ పెద్ద ఎత్తున పుంజుకోవచ్చు. అయితే, మూడో దశ కరోనా వ్యాప్తి ముప్పు ప్రభావం, ఆర్థిక పునరుద్ధరణ వంటి అంశాలపైనే వినియోగదారుల విశ్వాసం, బులియన్‌ వర్తకం ఆధారపడి ఉన్నాయి. టీకా పంపిణీ కార్యక్రమం, దేశ జనాభాలో 67 శాతం మందిలో యాండీబాడీలు అభివృద్ధి చెందాయంటూ ఈ మధ్యనే విడుదలైన సీరో సర్వే మాత్రం సానుకూల అంశాలు. కరోనా, దాని వేరియంట్లతో సహజీవనానికి సమాజం క్రమంగా అలవాటుపడుతోంది. ఈ పరిణామం వ్యాపారాలు, వాటి విక్రయాలకు దన్నుగా నిలవనుంది. ధనత్రయోదశి సహా ఇతర పండగలు, పెళ్లిళ్ల సీజన్లతో నాలుగో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో గోల్డ్‌ డిమాండ్‌ గణనీయంగా పెరగనుంది.     

   - సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈఓ, ఇండియా 




పెరిగిన బంగారం ధర 

విలువైన  లోహాల ధరలు పుంజుకున్నాయి. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం రూ.382 పెరిగి రూ.46,992కు చేరుకుంది. కిలో వెండి రూ.1,280 పెరుగుదలతో రూ.66,274 రేటు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఎగబాకడం ఇందుకు కారణమైంది. 


Updated Date - 2021-07-30T05:56:05+05:30 IST