రూ.80వేలకు బంగారం!?

ABN , First Publish Date - 2021-10-24T08:50:43+05:30 IST

కరోనా ప్రభావిత సరఫరా అవాంతరాలతో అల్యూమినియం నుంచి సహజవాయువు వరకు అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు ఒకదాని తర్వాత ఒకటి అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. ఇక బంగారానిదే తరువాయి అని కెనడా గోల్డ్‌ మైనింగ్‌

రూ.80వేలకు బంగారం!?

  • గోల్డ్‌కార్ప్‌ ఇంక్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ల అంచనా 

కరోనా ప్రభావిత సరఫరా అవాంతరాలతో అల్యూమినియం నుంచి సహజవాయువు వరకు అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు ఒకదాని తర్వాత ఒకటి అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. ఇక బంగారానిదే తరువాయి అని కెనడా గోల్డ్‌  మైనింగ్‌ పరిశ్రమ ప్రముఖులు, గోల్డ్‌కార్ప్‌ ఇంక్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ డేవిడ్‌ గారోఫాలో, రాబ్‌ మెక్‌వెన్‌ అభిప్రాయపడ్డారు. మరికొన్ని నెలల్లో ఔన్స్‌ (31.1 గ్రాములు) గోల్డ్‌ రేటు 3,000 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వారన్నారు. ఈ లెక్కన మన దేశంలో తులం బంగారం (దిగుమతి సుంకంతో కలుపుకొని) రూ.80,000 స్థాయికి చేరుకోవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1,793 డాలర్లుగా ఉంది. దేశీయంగా చూస్తే, ముంబై మార్కె ట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.47,800 పలుకుతోంది. 


కారణాలేంటి: మిగతా కమోడిటీలతో పోల్చితే పసిడి ధరను ప్రభావితం చేయబోయే కారణాలు మాత్రం వేరని డేవిడ్‌ గారోఫాలో, రాబ్‌ మెక్‌విన్‌ పేర్కొన్నారు. ముడి సరుకుల కొరత, ధరల పెరుగుదల, సరఫరా అడ్డంకులు తదితర కారణాలతో అంతర్జాతీయంగా వస్తు ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది తాత్కాలిక ధరాఘాతం కాదని.. సెంట్రల్‌ బ్యాంక్‌లు, ప్రభుత్వాల ద్రవ్యోల్బణ సూచీల లెక్కలతో పోల్చితే తీవ్రత అధికంగా ఉందన్న విషయం త్వరలోనే అవగతం కానుందన్నారు. ఇలాంటి ఆర్థిక అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం వైపు  ఇన్వెస్టర్లు మళ్లీ దృష్టిసారించనున్నారని వారన్నారు. దాంతో విలువైన లోహాల ధరలు మళ్లీ పుంజుకోనున్నాయని, ఈ సారి చాలా వేగంగా ర్యాలీ తీసే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2021-10-24T08:50:43+05:30 IST