బంగారు శాతం.. మోసాల భూతం

ABN , First Publish Date - 2022-07-03T05:19:23+05:30 IST

కొనేదంతా బంగారమే అంటారు.. చివరకు అమ్ముదామంటే మీ బంగారంలో కల్తీ ఉందంటూ తగ్గింపులు చేస్తుంటారు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలనేది సగటు మధ్య తరగతి ప్రజల మనోగతం.

బంగారు శాతం.. మోసాల భూతం

బంగారం నాణ్యత పరిశీలనలో మోసాలు

 వినియోగదారులకు కుచ్చుటోపి

 అనుమతులు లేని యంత్రాలతో దందా

పట్టించుకోని అధికారులు

వరంగల్‌లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు

వరంగల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కొనేదంతా బంగారమే అంటారు.. చివరకు అమ్ముదామంటే మీ బంగారంలో కల్తీ ఉందంటూ తగ్గింపులు చేస్తుంటారు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలనేది సగటు మధ్య తరగతి ప్రజల మనోగతం. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి, ఎంతో కొంత కొనుగోలు చేస్తారు. కొన్న బంగారాన్ని మార్చి మరో ఆభరణం కోసం వెళితే పాత బంగారంలో కల్తీ ఉందంటూ వ్యాపారులు కొసరుతుండడం ఈ మధ్య ఎక్కువైంది. దీనికి ప్రధాన కారణం ప్యూరిటీ చెక్‌ చేసే యంత్రాలున్న వాళ్లతో కొందరు వ్యాపారులు కుమ్మక్కు కావడంతో కొన్న బంగారంలో కత్తెర పెడుతూ జనాన్ని దోచుకునే వారి సంఖ్య పెరిగింది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బంగారం వ్యాపారమంతా వరంగల్‌ చౌరస్తాలో జరుగుతుంటుంది. నిత్యం కేజీ నుంచి మూడు కేజీ వరకు బంగారం వ్యాపారం జరుగుతుంది. పెళ్లిళ్ల సీజన్‌లో మాత్రం కొనేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ్ఞఅన్‌ సీజన్‌లో మాత్రం పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది. సినిమాలు, టీవీ సీరియళ్లలో వచ్చే కొత్త బంగారు మాడళ్లను చూసి చాలా మంది చేయించుకుంటున్నారు. ఇంతకుముందు పెళ్లినాడు ఏ నగలైతే పెట్టేవాళ్లో వాటిని భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్‌ మారడంతో పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకోవడం పరిపాటిగా మారింది. మరోపక్క బంగారం ధరలు రోజు రోజుకూ చుక్కలనంటుతున్నా కొనుగోళ్లు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ట్రెండ్‌ను బట్టి  పాత బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలనుకొన్న వారికి  బంగారం షాపు యజమానులు ఈ టంచ్‌ మిషన్‌ వ్యాపారులతో కలిసి కుచ్చుటోపి పెడుతున్నారు. 

నిద్ర మత్తులో అధికారులు

మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు, నిఘా వర్గాలు పట్టించుకోవడం లేదు. బం గారం మోసాలపై నిత్యం వినియోగదారులకు సహా యపడేందుకు ఉన్న బీఐఎస్‌ తన పని మరిచిపోయినట్టుంది. లీగల్‌ మెట్రాలజీ అధికారులుసైతం ఇది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాల కు తావిస్తోంది. వరంగల్‌ బులియన్‌ మార్కెట్‌లో అనే క రకాలుగా భారీ మోసాలు జరుగుతున్నా విజిలెన్స్‌ అధికారులకు మాత్రం కనిపించక పోవడం విడ్డూరం గా ఉంది. అనేక సార్లు తమకు బంగారు ఆభరణాల్లో మోసాలు జరిగాయంటూ దుకాణాల ముందు వినియోగదారులు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నా యి. అయితే ఇవేమీ పట్టించుకొనే పరిస్థితి, తీరిక లేనట్టుంది లీగల్‌ మెట్రాలజీ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అధికారులు బంగారంపై మోసం కేసులు నమోదు చేయకపోవడమే వారి పనితనానికి దర్పణం పడుతోంది. బంగారం మోసాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నా అధికారులు మాత్రం బంగారం దుకాణం యజమానులతో సత్సంబంధాలు పెట్టుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరో పణలు వినవస్తున్నాయి. అను మతులు లేని షాపులపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

మోసం ఇలా.. 

నగ నచ్చకనో, ఆభరణం పాతబడడమో, కొత్త మోడల్‌ మార్కెట్లోకి రావడమో జరుగుతుంది. దీంతో తమ ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకుందామని దుకాణదారుని దగ్గరుకు వస్తారు. పాత నగను కరిగించి దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి ముందే ఒప్పందం కుదుర్చుకున్న టంచ్‌ మిషన్‌ దగ్గరికి పంపిస్తున్నారు. ఈ టంచ్‌ మిషన్‌లో ఒప్పందం మేరకు ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తున్నారు. వాస్తవానికి పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఇది టంచ్‌ మిషన్‌లతో జరుగుతున్న మోసం. అయితే వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) సంస్థలో నిర్ధారణ చేయించాలి. 

అనుమతులు లేని యంత్రాలు 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం బంగారం నాణ్యతను, నగలోని బంగారం శాతాన్ని నిర్ధారణ చేయడానికి  బీఐఎస్‌ అనుమతి పొందిన సంస్థలకే నిర్ధారణ అర్హతలు ఉంటాయి. కానీ వరంగల్‌లో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్‌-రే ఫ్లోరోసెన్సు మిషన్‌ (కంప్యూటర్‌ అనుసంధాన యంత్రాల టంచ్‌ మిషన్‌)తో యఽథేచ్ఛగా బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారణ చేస్తున్నారు. కేవలం బంగారం షాపు యజమానులతో కలిసి వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వరంగల్‌ నగరంలో మొత్తం 25 టంచ్‌ మిషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. జీరో దందాలో భాగంగా సాధారణ పేపర్‌ మాత్రమే ఫ్యూరిటీ పర్సంటేజీలను పేర్కొనడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. 


Updated Date - 2022-07-03T05:19:23+05:30 IST