డీసీసీబీలో.. గోల్డ్‌ గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-05-18T05:34:28+05:30 IST

బంగారు పూత పూసిన నకిలీ బంగారంతో మాయ చేశారు. బ్యాంకు సొమ్మును భద్రంగా చూసుకోవాల్సిన వారే గోల్‌మాల్‌ చేశారు.

డీసీసీబీలో.. గోల్డ్‌ గోల్‌మాల్‌
బంగారాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది

నకిలీ బంగారంతో రూ.1.5 కోట్ల రుణాలు 

తెనాలి చెంచుపేట బ్రాంచ్‌లో ఇంటి దొంగలు

మేనేజర్‌, అప్రైజర్‌ బంధువులే సూత్రధారులు 

వార్షిక తనిఖీల్లో బహిర్గతమైన నకిలీ బండారం  

మూడు నెలల్లోనే వ్యవహారం నడిపినట్లు గుర్తింపు

మరో రెండు రోజులు తనిఖీలు చేయిస్తామన్న సీఈవో

 

తెనాలి(ఆంధ్రజ్యోతి), తెనాలి క్రైం, మే 17: బంగారు పూత పూసిన నకిలీ బంగారంతో మాయ చేశారు.  బ్యాంకు సొమ్మును భద్రంగా చూసుకోవాల్సిన వారే గోల్‌మాల్‌ చేశారు. బంగారాన్ని పెట్టేది వారే.. తనిఖీ చేసేది వారే.. రుణాలు మంజూరు చేసేది వారే కావడంతో మూడో కంటికి తెలియకుండా మూడు నెలల వ్యవధిలో ఏకంగా రూ.1.5 కోట్ల వరకు స్వాహా చేశారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట 


జీడీసీసీబీ బ్రాంచ్‌ కేంద్రంగా నకిలీ బంగారం రుణాలు వ్యవహారం నడిచింది. వార్షిక తనిఖీల్లో భాగంగా బంగారాన్ని పరిశీలించిన నోడల్‌ ఆఫీసర్‌కు అనుమానం వచ్చింది. దీంతో సిబ్బందితో  బంగారాన్ని పరిశీలన చేయిస్తే నకిలీ బంగారం బండారం బహిర్గమైంది. బ్యాంకు సిబ్బంది సూత్రధారులు కాగా.. లబ్ధిదారులంతా వారి సొంత బంధువులే కావడం విశేషం. ఈ కుంభకోణం విలువ రూ.కోటిన్నర వరకు ఉంటుందని అధికారుల అంచనా. బ్యాంక్‌ డీసీవో రాజశేఖర్‌, సీఈవో కృష్ణవేణి, జనరల్‌ మేనేజర్‌ శేషభానురావులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. రెండు రోజులుగా చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు 29 రుణ ఖాతాలకు సంబంధించి రూ.42 లక్షల వరకు గోల్డ్‌లోన్ల గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించినట్లు వారు తెలిపారు. ఇంకా మిగిలిన ఖాతాలను కూడా తనిఖీలు చేయాల్సి ఉందని సీఈవో కృష్ణవేణి విలేకర్లకు వివరించారు.  మరో రెండు రోజులు తనిఖీలు కొనసాగిస్తామన్నారు. నకిలీ బంగారమే కాకుండా, ఒక వ్యక్తికి రూ.10 లక్షలకు మించి రుణం ఇవ్వరాదని, దీనిని అతిక్రమించి అదనంగా ఎవరికైనా ఇచ్చారా, లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. 18 నుంచి 20 క్యారెట్ల బంగారాన్ని పెట్టి 22 క్యారెట్ల బంగారపు విలువతో సమానంగా రుణాలు అక్రమంగా మంజూరు చేసిన విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అంతా ఈ సంవత్సరం మార్చి నుంచి మే నెలలోపే జరిగాయన్నారు. దీనికి ముందు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నకిలీ బంగారంతో రుణాల దోపిడీ కేసులో బ్యాంక్‌ ఉన్నతాధికారులు రికవరీ పనిలో ఉన్నారు. రూ.42 లక్షల్లో రూ.20 లక్షల వరకు  రికవరీ చేసినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా రాబట్టే పనిలో ఉన్నట్లు వివరించారు. ఒకవేళ కుంభకోణం విలువ పెరిగితే దానిపైన కూడా ఆలోచిస్తామన్నారు. తనిఖీలు పూర్తయ్యాక బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెడతామని చెప్పారు. ఇటీవల బంగారమే లేకుండా ఖాళీ సంచులు పెట్టి రుణాలు రూపంలో దోచేయడం,  పొలం లేకుండానే వ్యవసాయ రుణాలు తీసుకున్న సంఘటనలు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇటీవల వెలుగుచూశాయి. అయినా ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అటెండర్‌ సోదరుడే అప్రైజర్‌

గోల్డ్‌లోన్ల గోల్‌మాల్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌ నేతి వరలక్ష్మి, అటెండర్‌ అలీబాషాలు ముందుగానే పథకం వేసి వ్యవహారం నడిపినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలో అలీబాషా సోదరుడు జానీబాషాను అప్రైజర్‌గా నియమించుకున్నారు. మార్చిలో తొలిసారిగా గోల్డ్‌లోన్‌ కుట్రను అమలు పరిచారు. అయితే మొదట పెట్టిన తనఖాలో నిజమైన బంగారాన్నే పెట్టారు. తర్వాత బంగారం పూత పూసిన నకిలీ బంగారాన్ని పెట్టి రుణాల పేరుతో బ్యాంకుకే టోకరా వేశారని తనిఖీల్లో తేలింది. 


Updated Date - 2022-05-18T05:34:28+05:30 IST