హైదరాబాద్‌లో గోల్డ్ మాఫియా దాష్టీకం...నలుగురి కిడ్నాప్.. ఇనుపరాడ్లతో కొట్టి చిత్రహింసలు

ABN , First Publish Date - 2022-06-24T17:29:51+05:30 IST

నగరంలోని గోల్డ్ మాఫియా దాష్టీకం వెలుగులోకి వచ్చింది. నలుగురిని కిడ్నాప్ చేసిన మాఫియా గత నాలుగు రోజులుగా చిత్రహింసలకు గురిచేసింది.

హైదరాబాద్‌లో గోల్డ్ మాఫియా దాష్టీకం...నలుగురి కిడ్నాప్.. ఇనుపరాడ్లతో కొట్టి చిత్రహింసలు

హైదరాబాద్‌: నగరంలోని గోల్డ్ మాఫియా దాష్టీకం వెలుగులోకి వచ్చింది. నలుగురిని కిడ్నాప్ చేసిన మాఫియా గత నాలుగు రోజులుగా చిత్రహింసలకు గురిచేసింది. శాస్త్రిపురం కింగ్స్ కాలనీలోని ఓ విల్లాలో నిర్బంధించిన రౌడీ గ్యాంగ్ ఇనుపరాడ్లతో కొట్టి.. తుపాకులతో బెదిరించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రౌడీగ్యాంగ్‌ బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.  స్మగ్లింగ్ కోసం 300 మందిని  గోల్డ్ మాఫియా నియమించుకుంది. పాతబస్తీలో పేరుమోసిన రౌడీషీటర్ మేనల్లుడే నెట్‌వర్క్‌ సూత్రధారి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గోల్డ్ మాఫియా నుంచి బాధితులను రక్షించారు. 



అసలేం జరిగిందంటే...

గోల్డ్ మాఫియా రౌడీమూకల కనుసన్నల్లో సాగుతోంది. దుబాయ్ చూడాలనుకునే ఆత్రుతపడే యువతను ప్రధానంగా టార్గెట్ చేసుకుని అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ సాగుతోంది. పాతబస్తీలో ఓ పేరుమోసిన రౌడీషీటర్ మేనల్లుడే ఈ గ్యాంగ్‌కు కీలక సూత్రధారి. 15 రోజుల క్రితం పాతబస్తీతో పాటు.. పంజగుట్ట శ్రీనగర్ కాలనీ, సనతనగర్ అశోక్ కాలనీకు చెందిన ముగ్గురు యువకుల్ని ఈ గ్యాంగ్ ఖర్చులు భరించి దుబాయ్‌కు విమానాల్లో పంపింది. దుబాయ్‌లో వారం రోజుల పాటు ఓ అపార్ట్‌మెంట్‌లోని ఆశ్రయం కల్పించారు. దుబాయ్‌లో అందమైన ఆకర్షణీయమైన ప్రదేశాలను చూసొచ్చేందుకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి ప్రతీ రోజు 100 దిర్హామ్స్ కూడా ఇచ్చేది ఈ రౌడీ గ్యాంగ్. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు దుబాయ్‌లోని వీరి ప్లాట్‌లోనే బస చేశారని.. వారంతా స్మగ్లింగ్ రాకెట్లో చిక్కుకున్నట్టు ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లిన ముగ్గురు వ్యక్తులు తెలుసుకున్నారు. 


దుబాయ్‌లో ఆరు కిలోల బంగారం అప్పగింత

పాతబస్తీకు చెందిన షెహబాజ్ (22), పంజగుట్ట శ్రీనగర్ కాలనీకు చెందిన అయాజ్ (21), సనతనగర్ అశోక్ కాలనీకు చెందిన ఫహద్ (23)లనే ముగ్గురు గోల్డ్ స్మగ్లింగ్ కోసం  ఈ ముఠా దుబాయ్‌కు పంపింది. దుబాయ్ నుంచి ఒక్కొక్కరు రెండేసి కిలోల బంగారాన్ని హైదరాబాద్ తెచ్చివ్వాలని పంపుతున్నారు. ఈ ముగ్గురికి మొత్తం ఆరు కిలోల బంగారం పేస్టును వారి కాళ్లకు బ్యాండేడ్లను చుట్టారు. వీరిలో పంజగుట్ట శ్రీనగర్ కాలనీకు చెందిన యువకుడు రెండు కిలోల బంగారంతో వచ్చి కస్టమ్స్‌‌కు చిక్కకుండా సేఫ్ నగరానికి చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కారులో అప్పటికే వేచి ఉన్న ముఠా సభ్యులు అయాజ్‌ను కారులో ఎక్కించుకుని ఆ బంగారం పేస్టును తీసుకుని అతనికి రూ.10,000 ఇచ్చి కారులో నుంచి దింపేశారు. ఆ తర్వాత పాతబస్తీకు చెందిన షెహబాజ్ కూడా రెండు కిలోల బంగారాన్ని తెచ్చి ఆ గ్యాంగ్‌కు అప్పగించాడు. ఇక సనతనగర్ అశోక్‌కాలనీకి చెందిన ఫహద్, షెహబాజ్ ఒకే విమానంలో హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. పాతబస్తీకు చెందిన షెహబాజ్ ఒక్కడే వచ్చి స్మగ్లింగ్ చేసిన రెండు కిలోల బంగారాన్ని గ్యాంగ్‌కు అప్పగించాడు. ఇక మూడో వ్యక్తి సనతనగర్ అశోక్ కాలనీకి చెందిన ఫహద్ ఆ గోల్డ్ పేస్ట్ తీసుకున్నాక.. దుబాయ్ ఎయిర్ పోర్ట్కు చేరుకుని విమానం ఎక్కకుండా అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నాడు. ఎక్కడికి వెళ్లాడు. అతనేమయ్యాడు. ఆ బంగారంతో ఉడాయించాడా.. అనేది మిస్టరీగా మారింది. అయితే అశోక్ కాలనీకి చెందిన ఫహద్ దుబాయ్‌కు వెళ్లినప్పుడు అక్కడ అతను తన బంధువును కలిశాడు. రెండు కిలోల బంగారాన్ని తమకు అప్పగించకపోవడంతో.. దుబాయ్‌లోని అతని బంధువును కూడా అక్కడే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్టు బాధితులు చెప్తున్నారు.


నలుగురిని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలు

సనతనగర్ అశోక్ కాలనీకి చెందిన ఫహద్ రెండు కిలోల బంగారాన్ని దుబాయి నుంచి తెచ్చివ్వకపోవడంతో.. ఫహద్ తండ్రి అహ్మద్ షరీఫ్‌తో పాటు..అతని బంధువైన మరో యువకుడు ఆసిమ్‌ను కూడా కిడ్నాప్ చేశారు. ఫహద్‌తో కలిసి దుబాయ్‌కు ప్రయాణం చేసి తిరిగొచ్చిన షహబాజ్, అయాన్లను తుపాకులు ఎక్కుపెట్టి.. సఫారీలు ధరించిన బౌన్సర్లు కారులో కిడ్నాప్ చేశారు. నలుగుర్ని కిడ్నాప్ చేసి పాతబస్తీలోని శాస్త్రిపురం కింగ్స్ కాలనీలోని ఓ విల్లాలో నిర్బంధించి ఇనుపరాడ్లతో వారిని చితకబాదుతూ చిత్రహింసలకు గురిచేశారని బాధితులు వాపోతున్నారు. దుబాయ్‌కి వెళ్లి రెండు కిలోల బంగారంతో అదృశ్యమైన ఫహద్ ఫోన్‌ను ఆ గ్యాంగ్ ట్రాప్ చేసింది. అతనితో టచ్లో ఉన్నవారిని కూడా బెదిరింపులు, దాడులకు దిగుతున్నారని బాధితులు చెప్తున్నారు. చిత్రహింసలు పెట్టేటప్పుడు ఆర్తనాదాలు బయటకు వినబడకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి.. ఇనుపరాడ్లతో దాడులకు దిగుతున్నారని..పోలీసులకు చెప్తే ఆ గ్యాంగ్ వాళ్లు చంపేస్తారేమోనన్న భయంతో బాధితులు వణికిపోయారు. చివరికి సాహసం చేసి కిడ్నాపర్ల అరాచకాలు తాళలేక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ‘‘దుబాయ్‌లో నీ కుమారుడు ఎక్కడున్నాడు. అతని జాడచెప్పు అంటూ ఆ వృద్ధుడిపై దాడి చేస్తున్నారు. ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పాడు..ఈ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ విషయమే తెలీదని అతని తండ్రి నెత్తినోరు బాదుకున్నా వినిపించుకోకుండా నాలుగు రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేస్తూనే ఉంది ఈ గ్యాంగ్. రెండు కిలోల బంగారం తెచ్చివ్వకుంటే దుబాయ్‌లో ఎక్కడ దాక్కున్నా నీ కొడుకును.. ఇక్కడ నిన్ను, నీవాళ్లను చంపేస్తాము’’ అని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలిసింది.



పేరుమోసిన రౌడీషీటర్ మేనల్లుడే గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ సూత్రధారి

పాతబస్తీకు చెందిన ఓ పేరుమోసిన రౌడీషీటర్ మేనల్లుడే ఈ నెట్ వర్క్ సూత్రధారని బాధితులు చెప్తున్నారు. అనేక హత్యలు, కిడ్నాపులు, సెటిల్‌మెంట్లతో అరాచకాలు సృష్టించి పోలీసు రికార్డులకెక్కిన రౌడీషీటర్ మేనల్లుడు ఇసాక్ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్‌ను గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ఈ గ్యాంగ్‌లో 300 మంది ఉన్నారని తెలుస్తోంది. రొటేషన్ పద్దతిలో వీరిని దుబాయ్‌కు పంపడం.. అక్కడ విలాసవంతంగా యాత్ర నిర్వహించుకున్నాక తిరుగు ప్రయాణమై ఇండియాకు వచ్చేటప్పుడు బంగారాన్ని స్మగ్లింగ్ చేయిస్తున్నారు. అందుకోసం ఓ భారీ నెట్వర్క్‌నే ఏర్పాటు చేసుకుంది ఈ కిరాతక గ్యాంగ్. ఎయిర్ పోర్టుల్లో అనుమానం రాకుండా కస్టమ్స్, పోలీసుల కళ్లుగప్పి బంగారాన్ని ఎలా తేవొచ్చనే అంశంపై దుబాయ్‌లో ప్రత్యేకంగా శిక్షణా తరగుతుల్ని కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. కాళ్లకు బంగారం పేస్ట్‌ని చుట్టి.. డిటెక్ట్ కాకుండా ఉండేందుకు బంగారంలో మలినాలను మిశ్రమం చేస్తారు. అలా పోలీసులను బురిడీకొట్టించి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటారు. బంగారాన్ని తెచ్చాక కెమికల్‌లో వేసి.. బంగారమంత వరకు వేరు చేసి అక్రమ బంగారాన్ని విక్రయిస్తుంది ఈ రౌడీ గ్యాంగ్. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే.. వారిని విడిపించేందుకు ఆ గ్యాంగ్ అందుకనుగుణంగా న్యాయవాదులను కూడా నియమించుకున్నట్టు బాధితులు చెప్తున్నారు.

Updated Date - 2022-06-24T17:29:51+05:30 IST