మార్కింగ్‌.. మస్కా

ABN , First Publish Date - 2022-08-14T05:05:35+05:30 IST

కేంద్ర ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) నుంచి ఎలాంటి లైసెన్సు పొందకుండానే గుంటూరు నగరంలో కొంతమంది బంగారు నగలకు హాల్‌మార్కింగ్‌ చేస్తున్నారు.

మార్కింగ్‌.. మస్కా

బీఐఎస్‌ లైసెన్సు లేకుండా హాల్‌మార్కింగ్‌ వేస్తున్న కేటుగాళ్లు

జిల్లాలో అనేక చోట్ల నకిలీ యంత్రాలు గుర్తింపు

అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట 



 కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే మనం.. విలువైన బంగారం కొనుగోలు చేసేటప్పుడు అంత జాగ్రత్తగా వ్యవహరించం. కారణం దుకాణదారునిపై నమ్మకం. దీనికి తోడు బులియన్‌ మార్కెట్‌ ధర, మజూరీ, రాళ్లు తీసివేత, తరుగు వంటి లెక్కలు అర్ధం కాకపోవడం.. అందుకే బంగారం కొనుగోలు విషయంలో పూర్తి నిర్ణయం దుకాణదారునికే అప్పగిస్తాం. ఈ నమ్మకాన్ని కొంతమంది వ్యాపారులు నిలబెట్టుకుంటారు. మరికొంత మంది దీనిని అలుసుగా తీసుకుని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా బంగారాన్ని ఆస్తిలా భావించే మధ్యతరగతి వారే ఎక్కువుగా మోసాల బారిన పడుతుంటారు. 

 

బంగారం కొనుగోలు విషయంలో ఎక్కువమంది మోసపోతున్నారని భావించి కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్కింగ్‌ విధానానికి చట్టబద్ధత కల్పించింది. దీంతో మోసాలకు చెక్‌ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇదే కేటుగాళ్లకు వరంలా మారింది. బంగారం దుకాణాలకు  తగ్గట్టుగా బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) హాల్‌ మార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కొంతమంది నకిలీ యంత్రాల ద్వారా హాల్‌మార్కింగ్‌ వేస్తున్నారు. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు పూర్తిస్థాయిలో హాల్‌మార్కింగ్‌పై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

గుంటూరు(తూర్పు), ఆగస్టు13: కేంద్ర ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) నుంచి ఎలాంటి లైసెన్సు పొందకుండానే గుంటూరు నగరంలో కొంతమంది బంగారు నగలకు హాల్‌మార్కింగ్‌ చేస్తున్నారు. వీరు కొంతమంది జ్యూయలరీ దుకాణదారులతో ముందుగానే ఒప్పందం చేసుకొని ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఆయా షాపుల నుంచి హాల్‌మార్కింగ్‌ పొందిన ఆభరణాలను కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోతున్నారు. గత బుధవారం గుంటూరులోని గంటలమ్మ చెట్టు వీధిలో ఓ దుకాణ నిర్వాహకుడిపై  బీఐఎస్‌ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి, ఎలాంటి లైసెన్సులు లేవని గుర్తించి అక్కడ ఉన్న యంత్రాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానిక బులియన్‌ వ్యాపారుల్లో కలకలం రేకెత్తించింది. 


ఏమిటీ హాల్‌మార్కింగ్‌..

బంగారంలో ఎంత స్వచ్ఛత ఉందో నిర్ధారించడాన్నే హాల్‌మార్కింగ్‌ అంటారు. ఇది 2000 సంవత్సరం నుంచే అమల్లో ఉంది. గతంలో స్వచ్ఛందంగా ఉండే హాల్‌మార్కింగ్‌ విధానానికి ఈ మధ్యనే చట్టబద్ధత కల్పించారు. కొనుగోలు చేసే ప్రతి నగపైనా హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  విధానం ప్రకారం బంగారంలో రాగి, ఇతర లోహాల శాతం ఎంత ఉంది.. రుధేనియం, క్యాడ్మియం, ఇరిడియం వంటి నిషేధిత ద్రావణాలు ఏవైన ఉన్నాయా అని పరీక్షించి ఇవన్నీ మినహాయించి బంగారం ఎంత ఉంది అని తేలుస్తారు. స్వచ్ఛత 916, దాని కంటే ఎక్కువశాతం వస్తే 22 క్యారెట్ల గోల్డ్‌ అని, 875 ఉంటే 18 క్యారెట్ల గోల్డ్‌ అని నిర్ధారిస్తారు. అనంతరం స్వచ్ఛత శాతం, బీఐఎస్‌ చిహ్నం, హాల్‌ మార్కింగ్‌ సెంటర్‌ గుర్తింపు నెంబరు, దుకాణదారుని లైసెన్స్‌ నెంబరు వంటి నాలుగు అంశాలను నగపై ముద్రిస్తారు. ఈ ప్రక్రియకు చెల్లించాల్సిన మొత్తం కూడా రూ.100 నుంచి రూ.150 వరకు మాత్రమే ఉంటుంది. చాలామంది కేవలం 22 క్యారెట్ల బంగారానికే హాల్‌మార్కింగ్‌ ముద్ర వేస్తారు అనే అపోహలో ఉంటారు. 14, 16, 18 క్యారెట్ల బంగారానికి కూడా హాల్‌మార్కింగ్‌లో వివరాలను ముద్రించుకోవచ్చు.


నకిలీ యంత్రాల జోరు...

కొన్నిచోట్ల బీఐఎస్‌ గుర్తింపు లేని నకిలీ యంత్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.  ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి జిల్లాలో సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, తాజాగా నగరంలోని పట్నంబజారు వద్ద దాదాపు 8కి పైగా నకిలీ యంత్రాలను గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు స్ర్కీనింగ్‌ కూడా చేయకుండా హాల్‌మార్కింగ్‌లను ముద్రిస్తారు. 


వివరాలను నిర్ధారించుకోవడం ఎలా..

కొంతమంది వ్యాపారులు హాల్‌మార్క్‌ ముద్రించిన నగలనే అమ్ముతుంటారు. ఇవి సరైనవా కాదా అని తెలుసుకోవడానికి బ్యూరో స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా బీఐఎస్‌ కేర్‌ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో ఉండే ఆప్షన్స్‌ ద్వారా నగపై ఉండే హాల్‌మార్క్‌ సెంటరు నెంబరును టైప్‌ చేస్తే సదరు సెంటరుకు గుర్తింపు ఉందా లేదా అనే సమాచారం వస్తుంది. అలాగే నగ యొక్క సమాచారం. సెంటర్లు ఎక్కడ ఉన్నాయి.. ఒకవేళ మోసపోతే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఈ యాప్‌ అందిస్తుంది. ఇది పూర్తిగా బీఐఎస్‌ నియంత్రణలో పనిచేస్తుంది. 


అవగాహన కార్యక్రమాలు శూన్యం..

హాల్‌మార్కింగ్‌  ఈ ఏడాది జూన్‌ 15 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. కానీ  దీనిపై ఇంతవరకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. దీనికితోడు తగినన్ని సెంటర్లను కూడా ఏర్పాటు చేయలేదు. గుంటూరులో చిన్నవి, పెద్దవి కలుపుకుని దాదాపు రెండువేలు వరకు ఉంటాయి. వీటి నుంచి నిత్యం కొన్ని వేల నగల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిన్నంటికీ కలుపుకొని కేవలం మూడు మాత్రమే బీఐఎస్‌ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రెండు పట్నంబజారు గంటలమ్మ చెట్టు వద్ద ఉండగా, మరోటి అరండల్‌పేట ప్రాంతంలో ఉంది. ఇన్ని నగలకు ఈ మూడు కేంద్రాల వద్ద హాల్‌మార్కింగ్‌ వేయడం అంటే కష్టసాధ్యమైన ప్రక్రియ. దీంతో హాల్‌మార్కింగ్‌కు ఒకోసారి రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి.   


పాత నగలకు కూడా..

ఒకోసారి పాతనగలను అమ్మడానికి వెళితే తగినంత ధర రాదు. దీనిపై హాల్‌మార్కింగ్‌ లేదంటూ దుకాణదారుడు ధర తగ్గిస్తాడు. అందుకే పాతనగలకు కూడా బంగారు స్వచ్ఛత నిర్ధారించుకోవచ్చని బీఐఎస్‌ పేర్కొంది. అలాగే హాల్‌మార్కింగ్‌పై మోసాలకు బీఎస్‌ఐకే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, స్థానిక పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. 


రశీదులో అన్ని వివరాలు ఉండాలి

ఆభరణం కొనుగోలు చేసిన తరువాత బంగారం ఎంత ఉంది. రాళ్ల తరుగు ఎంత అనే వివరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. దుకాణదారుడి లైసెన్స్‌ నెంబరుకు కూడా సరిచూసుకోవాలి. ప్రస్తుతం దాదాపు 90శాతం నగలు హాల్‌మార్కింగ్‌తోనే వస్తున్నాయి. ఇవి సరైనవా కాదా అనే వివరాలను చూసుకోవాలి. నగల యొక్క రశీదులను భద్రపరుచుకోవాలి. ఒకవేళ మోసపోయినా రశీదులు ఉంటే న్యాయపోరాటం చేయవచ్చు. 

- డాక్టర్‌ రాధామోహన్‌, ఇండియన్‌ నేషన్‌ సభ్యురాలు గుంటూరు  

 

  ఇరిడియంతో బ్రెస్ట్‌ క్యాన్సర్‌..

బంగారం బరువు తగ్గకుండా ఉండటానికి దానిలో ఇరిడియంను కలుపుతారు. ఇది భారతదేశంలో పూర్తిగా నిషేధం. దీనివల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఇతర చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే హాల్‌మార్కింగ్‌ పరీక్షల్లో ఇరిడియం ఉందని తేలితే ఆ నగను తీసుకోకపోవడం మంచిది. క్యాడ్మియం కూడా ప్రమాదకరం. అందుకే నగలకు పరీక్షలు తప్పనిసరి. అలాగే ఎవరైనా ప్రమాణాలకు తగినట్టుగా నగలు లేకపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి తగిన పరిహారం పొందవచ్చు. 

- చదలవాడ హరిబాబు,  వినియోగదారుల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  


Updated Date - 2022-08-14T05:05:35+05:30 IST