వచ్చే ఏడాది బంగారం కొనడం కష్టమే.. రూ. 55 వేలు దాటే అవకాశం

ABN , First Publish Date - 2021-12-31T02:19:13+05:30 IST

వచ్చే ఏడాది పుత్తడి వంక చూడాలంటేనే భయపడేలా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

వచ్చే ఏడాది బంగారం కొనడం కష్టమే.. రూ. 55 వేలు దాటే అవకాశం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పుత్తడి వంక చూడాలంటేనే భయపడేలా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2020లో ఒకానొక దశలో 10 గ్రాముల బంగారం ధర రూ. 57 వరకు వెళ్లి వినియోగదారులను భయపెట్టింది. అయితే, ఆ తర్వాత బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు ఈక్విటీలకు మళ్లించడంతో ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ. 42-49 వేల మధ్య చాలా కాలం పాటు స్థిరంగా కొనసాగింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం పసిడి ధర పైకి ఎగబాకడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది గరిష్ఠంగా పది గ్రాముల బంగారం ధర రూ. 55 వేలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు తోడు ఒమైక్రాన్ వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బంగారం ధరలు పైకి ఎగబాకుతాయన్నది నిపుణుల మాట. వచ్చే ఏడాది రెండో అర్ధ భాగం నాటికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 2 వేల డాలర్లు దాటే అవకాశం ఉందని, ఫలితంగా దేశీయంగా పది గ్రాముల బంగారం ధర రూ. 55 వేలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు కామ్ ట్రెండ్జ్ సీఈవో త్యాగరాజన్ తెలిపారు. 


ఇక, ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో నేడు పది గ్రాముల బంగారం ధరపై రూ. 98 తగ్గి రూ. 46,688కు చేరుకుంది. గత ట్రేడింగ్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 46,786 వద్ద ముగిసింది. బంగారం బాటలోనే పయనించే వెండి ధర కూడా కిలోకు రూ. 699 తగ్గి రూ. 60,024కు చేరుకుంది. గత ట్రేడింగ్‌లో వెండి కిలో ధర రూ. 60,723 వద్ద ముగిసింది. 

Updated Date - 2021-12-31T02:19:13+05:30 IST