గోల్డ్‌.. రన్‌!

ABN , First Publish Date - 2020-08-09T11:17:53+05:30 IST

మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెడుతోంది. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా ధర అదుపులోకి రావడం లేదు.

గోల్డ్‌.. రన్‌!

గ్రాము బంగారం రూ.5830 8 కేజీ వెండి రూ.75,500

దిగుమతులు లేకపోవడమే కారణమంటున్న వ్యాపారులు


తుని, ఆగస్టు 8: మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెడుతోంది. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా ధర అదుపులోకి రావడం లేదు. బంగారం ధర శనివారం రికార్డుస్థాయికి చేరింది. బిస్కెట్‌ బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాములు రూ.58,300కు చేరింది. అంటే గ్రాము బంగారం రూ.5830 పలికింది. బులియన్‌ మార్కెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక రేటు. గత వారంతో పోలిస్తే గ్రాముకు 500 వరకూ పెరిగింది. ఇటు వెండి ధర కూడా ఆకాశాన్ని అంటుతోంది. శనివారం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.75,500 వేలు పలికింది. ఈ స్థాయిలో వెండి ధర పదేళ్ల కిందట నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో చేరడంతో రానున్న రోజుల్లో కేజీ లక్షకు చేరవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలను చూపి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో అవసరానికి కావలసిన బంగారు నగలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు అంటే మార్చి ప్రారంభంలో గ్రాము (బిస్కెట్‌) 24 క్యారెట్లు 3,600 నుంచి 3,900 మధ్య ఉండేది. కరోనాతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఒక్క సారిగా పసిడి పెరగడంతోపాటు డిమాండ్‌ ఏర్పడింది.


ఇటు బంగారు గనుల్లో ఉత్పత్తి తగ్గడం, అంతర్జాతీయంగా రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాకపోవడంతో దిగుమతులు తగ్గాయి. ఈ కారణంగా దేశీయం గా ఉన్న నిల్వలకు డిమాండ్‌ ఏర్పడింది. ఇటు మార్కెట్‌కు డిమాండ్‌ తగ్గ సరఫరా లేకపోవడంతో ధర రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులుకొనసాగితే పసిడి గ్రాము రూ.8 వేలను త్వరలో దాటే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నారు. అంటే ఇటు వెండి కూడా అతి దగ్గరలో కేజీ రూ. 80 వేలు దాటేయవచ్చునంటున్నారు.

Updated Date - 2020-08-09T11:17:53+05:30 IST