కేసీఆర్ ఆలోచనలో ‘బంగారు భారత్’

ABN , First Publish Date - 2022-03-03T10:02:33+05:30 IST

రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం చూపిస్తానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దిశగా...

కేసీఆర్ ఆలోచనలో ‘బంగారు భారత్’

రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం చూపిస్తానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలతోపాటు దేశ పాలనలో కూడా గుణాత్మక మార్పును సూచిస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. భావసారూప్యం గల పలు రాష్ట్రాల నాయకులను కలుసుకుని తన భావాలను వారితో పంచుకుంటున్నారు. త్వరలోనే ఆయన ప్రయత్నాలు ఒక రూపుదిద్దుకుంటాయనడంలో  సందేహం లేదు. ఈ పాటికే కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన నాయకుల స్పందన చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తోంది. 


మహోన్నతమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నుంచి, తెలంగాణ రాష్ట్ర సాధన వరకు, ఆ తదుపరి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దాకా, గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలను పరిశీలిస్తే, భవిష్యత్‌లో ఏం జరగబోతుందో యావద్దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్నాయంపై  ఆలోచన చేయడానికి, ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడానికి ఇప్పుడే సరైన పరిస్థితులున్నాయి. ఆ మాటకొస్తే ఒక్క భారతీయ జనతా పార్టీనే కాకుండా, దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారానికి దూరంగా ఉండే విధంగా ప్రత్యామ్నాయం వుండబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు!


ఈ నేపథ్యంలో దేశంలో గత 75 ఏండ్ల దేశ రాజకీయ పరిణామాలను చక్కదిద్దాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వేదికల మీద పదే పదే స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఏర్పడబోయే జాతీయస్థాయి ప్రత్యామ్నాయ కూటమికి తానే నాయకత్వం వహిస్తానని కూడా కేసీఆర్ సూచనప్రాయంగా చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 14 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలననూ నిశితంగా గమనించినవారికి, ఆయన తలపెట్టిన పని ఏమంత కష్టం కాదనిపిస్తుంది.


ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజలను మతాలవారీగా కులాలవారీగా విభజించి, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ, నేరపూరిత రాజకీయాలు చేసే పార్టీలు గత 75ఏళ్ళుగా పాలించిన ఈ దేశాన్ని ఉద్ధరించేందుకు ఏం చేయాలో కేసీఆర్ అరమరికలు లేకుండా స్పష్టంగా చెప్పారు. ఇంతకాలం పాలకులు అవినీతికి పాల్పడ్డారని, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపారని, వారికి ప్రజాస్వామ్య నైతికత, విలువలపై అవగాహన కొరవడిందని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అధీనంలోని ప్రతి సంస్థ స్వయంప్రతిపత్తిని, రాష్ట్రాల అధికారాలను, సహకార సమాఖ్య ప్రాథమిక స్వరూపాన్ని నిర్వీర్యం చేస్తున్నదన్న సీఎం కేసీఆర్ ధర్మాగ్రహాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. జాతీయ స్థాయిలో అధికార పీఠాన్ని కేసీఆర్ సూచించిన ప్రత్యామ్నాయం అధిష్ఠించే అవకాశం వస్తే అది చేసే మొట్ట మొదటి ముఖ్యమైన పని ఏమిటంటే, ఈ దేశ కాలపరీక్షగా నిలిచిన పాత గంగా–జమున తెహజీబ్‌ సంస్కృతిని బలోపేతం చేయడమే.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గతంలో నెలకొన్న మతపరమైన విభేదాలను సమసిపోయేలా చేసి, సెక్యులరిజాన్ని బలపరుస్తూ, గంగా జమునా తెహజీబ్ సంస్కృతిని నెలకొల్పారు. అదేవిధంగా దేశస్థాయిలో కేసీఆర్ కు అవకాశం లభిస్తే మత సామరస్యం పాటిస్తూ, కుల మత వర్గాల ఆధారంగా ప్రజలపై దాడులు జరగకుండా చూస్తారు. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను, తమకిష్టమైన ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను తిరిగి తీసుకువస్తారు. 


'బంగారు భారత్‌' గురించి కేసీఆర్‌ మాట్లాడినప్పుడు  అసలు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కొందరికి ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన అద్భుతమైన విజయాలను చూస్తే ఆయన దార్శనికత గురించి తెలియని వారికి స్పష్టత వస్తుంది. కేసీఆర్ సూచించే ప్రత్యామ్నాయ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో లాగానే విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి 2లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలోని ప్రతి మూలకు సరఫరా చేస్తారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 24గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 65,000 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకునేందుకు భారీ, మధ్యతరహా, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.


దేశంలోని వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి నదులను అనుసంధానం చేస్తారు. వ్యవసాయ రంగానికి 24గంటల సాగునీరు, ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తారు. దేశవ్యాప్తంగా రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలను అమలు పరుస్తారు. రైతు వేదికలు నిర్మిస్తారు. 


కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకోనున్న ప్రత్యామ్నాయం దేశవ్యాప్తంగా వ్యవసాయరంగానికి అత్యంతప్రాధాన్యతనిస్తుంది. సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని సద్వినియోగంలోకి తెచ్చి బీడు భూములను సద్వినియోగ పరిచి సస్యశ్యామలం చేస్తారు. రైతుల నేలల్లో భూసార పరీక్షలు చేయించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలనే పండించేలా చూస్తారు. రైతుల ఆదాయాన్ని బాగా పెంచుతారు. 


దళితుల కోసం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా స్వావలంబన పొందేలా చూస్తారు. గిరిజనులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా లబ్ధి చేకూరేలా పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలను జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తారు. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రారంభించి అందులో 50శాతం బాలికల కోసం కేటాయిస్తారు. విదేశీ విద్యార్థులు కూడా భారత్‌కు ఇష్టంగా వచ్చేలా అవకాశాలు కల్పించి, మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే బదులు దేశంలోనే అవకాశాలు కలిగిస్తారు.


లోపభూయిష్టమైన జిఎస్‌టి అమలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హస్తగతం చేసుకోవడం, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని విషయాలపై నియంత్రణ సాధించే ప్రయత్నం వంటి మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకునేందుకు కూడా కేసీఆర్ ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసిమెలిసి పనిచేయాల్సిన నిజమైన సమాఖ్య స్ఫూర్తికి మార్గం సుగమం అవుతుంది. వలస రాజ్యాల కాలం నుంచి వాడుకలో ఉన్న అన్ని క్రూరమైన చట్టాలను రద్దు చేస్తారు. 


ఆర్థిక రంగంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలను కేసీఆర్ సూచించిన ప్రత్యామ్నాయం పునరుద్ధరిస్తుంది. ఈ సంస్కరణలు ఆచరణాత్మకమైనవి, ప్రజలకు అనుకూలమైనవిగా ఉంటాయి. ప్రభుత్వంతోపాటు పన్ను చెల్లింపుదారులకు అనుకూల విధానం, సంస్కరణలు పెద్దఎత్తున పెట్టుబడులను తెస్తాయి. దీంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతుంది.


మరో మాటలో చెప్పాలంటే, కేసీఆర్ చెప్పిన "బంగారు భారత్" అంటే శాంతియుత, సంతోషకరమైన, సౌకర్యవంతమైన, అభివృద్ధి–సంక్షేమం ప్రతిబింబించే దేశం అని అర్థం. పారిశ్రామిక పెట్టుబడిదారులకు, విద్యార్థులకు, యాత్రీకులకు, సత్యాన్వేషకులకు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని అనుసరించే వారందరికీ అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా భారత దేశం మారాలి. అదే కేసీఆర్ కాంక్షించే బంగారు భారత్.

వనం జ్వాలా నరసింహారావు

Updated Date - 2022-03-03T10:02:33+05:30 IST