పెట్టుబడితో విదేశాల్లో నివాసార్హత.. భారతీయ కుబేరులకు ఉన్న మార్గాలు ఇవే..!

ABN , First Publish Date - 2022-03-17T23:54:55+05:30 IST

సాధారణంగా మనకు వీసా అంటే గుర్తొచ్చేది స్టూడెంట్, ఉద్యోగ వీసాలే. వీటి ద్వారా ఏటా అనేక మంది భారతీయులు అమెరికా, బ్రిటన్, మధ్యప్రాచ్య దేశాలకు వలస వెళుతుంటారు. అయితే.. అభివృద్ధి చెందిన దేశాల్లో శాశ్వత నివాసార్హత కోసం భారతీయ కుబేరులు కాస్తంత భిన్నమైన రూట్‌ను ఎంచుకుంటారు.

పెట్టుబడితో విదేశాల్లో నివాసార్హత.. భారతీయ కుబేరులకు ఉన్న మార్గాలు ఇవే..!

ఎన్నారై డెస్క్: సాధారణంగా మనకు వీసా అంటే గుర్తొచ్చేది స్టూడెంట్, ఉద్యోగ వీసాలే. వీటి ద్వారా ఏటా అనేక మంది భారతీయులు అమెరికా, బ్రిటన్, మధ్యప్రాచ్య దేశాలకు వలస వెళుతుంటారు. అయితే.. అభివృద్ధి చెందిన దేశాల్లో శాశ్వత నివాసార్హత కోసం భారతీయ కుబేరులు కాస్తంత భిన్నమైన రూట్‌ను ఎంచుకుంటారు. తాము స్థిరపడాలనుకున్న దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి.. అక్కడే పర్మెనెంట్‌గా నివసించేందుకు అనుమతి పొందుతారు. ఈ అనుమతులనే వాడుక భాషలో గోల్డెన్ వీసాలని అంటుంటారు. అగ్రరాజ్యం అమెరికాలో పెట్టుబడి పెట్టే వారికి ఇచ్చే వీసాను ఈబీ-5 అని పిలుస్తుంటారు. పోర్చుగల్ దేశం కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక గతంలో బ్రిటన్‌లో అమలైన టైర్-1 ఇన్వెస్టర్ వీసాను అక్కడి ప్రభుత్వం కొంత కాలం క్రితం రద్దు చేసింది. 


బ్రిటన్‌లో గోల్డెన్ వీసాకు ఫుల్ స్టాప్..!

గతంలో అమలైన టైర్-1 ఇన్వెస్టర్ వీసాను అక్కడి ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. అయితే.. దీని వల్ల భారతీయులు పెద్దగా నష్టపోయిందంటూ ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వీసాకు తొలి నుంచి భారతీయ కుబేరుల నుంచి డిమాండ్ తక్కువగానే ఉందని చెబుతున్నారు. 2008 నుంచి ఇప్పటివరకూ కేవలం 280 మంది భారతీయులు మాత్రమే ఈ వీసాను పొందారు. భారత్‌లో అనేక కేసులు ఎదుర్కొంటోన్న నీరవ్ మోదీ కూడా ఇదే వీసా సాయంతో దేశాన్ని వీడారు. బ్రిటన్ జారీ చేసిన మొత్తం వీసాల్లో వీటి వాటా కేవలం 3 శాతమే!


రారమ్మంటున్న పోర్చుగల్..!

2.8 లక్షల యూరోల పెట్టుబడి ద్వారా ఎవరైనా పోర్చుగల్ దేశంలో గోల్డెన్ వీసా పొందవచ్చు. అంతేకాదు.. ఈ వీసా తీసుకున్న వారు ఏటా పోర్చుగల్‌లో కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంటే సరిపోతుంది. మిగిలిన సమయమంతా స్వేచ్ఛగా తమకు కావాల్సిన చోట గడపవచ్చు. అయితే.. బ్రిటన్‌లోని భారతీయ సంతతి కుబేరుల సంతానం ఈ వీసాపై మొగ్గు చూపుతున్నారు. బ్రిటన్ ప్రభుత్వం విధిస్తున్న ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్‌కు భారమని భావిస్తున్న వారు పోర్చుగల్‌లో పెట్టుబడులు పెడుతున్నారట. అయితే.. పోర్చుగల్ ప్రభుత్వం కూడా గోల్డెన్ వీసా విషయంలో కాస్తంత కట్టుదిట్టంగానే వ్యవహరిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు తీర ప్రాంత నగరాలైన లీస్బన్, పోర్టో, ఆల్గరేవ్‌లో పెట్టుబడులకు బ్రేకులు వేసింది. 


ఈబీ-5 వీసాతో అమెరికాలో ఎంట్రీ..

అమెరికాలో పాపులర్ ఇన్వెస్టర్ వీసా ఈబీ-5లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వీసా పొందేందుకు పెట్టాల్సిన కనీస పెట్టుబడి మొత్తం 5 లక్షల డాలర్ల నుంచి 8 లక్షల డాలర్లకు పెరిగింది. కనీస పెట్టుబడి మొత్తం పెరిగినప్పటికీ.. వీసాలు సులువుగా లభ్యమయ్యే అవకాశం ఉండటంతో అనేక మంది ఈ మార్గాన్ని ఎంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 


అమెరికాలో ఎంట్రీ.. వయా గ్రెనాడా..

అమెరికా ప్రభుత్వం ఎన్ని రకాల వీసాలు ఆఫర్ చేస్తున్నప్పటికీ నిబంధనలు కఠినంగా ఉన్నాయని అనేక మంది భావిస్తుంటారు. ఇటువంటి వారికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. మొదట కరీబియన్ దేశమైన గ్రెనాడాలో పెట్టుబడి పెట్టి, అలా అందుబాటులోకి వచ్చే కొత్త మార్గాల ద్వారా అమెరికా కలను సాకారం చేసుకుంటున్నారు. అమెరికా, గ్రెనాడా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. గ్రెనాడా పౌరులు ఈ-2 ట్రీటీ ఇన్వెస్టర్ వీసాతో అమెరికాలో పెట్టుబడులు పెట్టి, నివాసార్హత  పొందొచ్చు. గ్రెనాడాలో విదేశస్తులు ఐదేళ్ల పాటు 1.5 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకూ పెట్టుబడులు పెడితే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ ఇదే దారిలో కరీబియన్ దీవుల్లో మకాం వేశారు.


Updated Date - 2022-03-17T23:54:55+05:30 IST