మళ్లీ వివాదాస్పదంగా గొల్లపల్లి దేవస్థాన భూములు

ABN , First Publish Date - 2020-12-01T15:03:20+05:30 IST

గొల్లపల్లి రఘునాథస్వామివారి భూములు రోజురోజుకూ..

మళ్లీ వివాదాస్పదంగా గొల్లపల్లి దేవస్థాన భూములు

నూజివీడు రూరల్‌: గొల్లపల్లి రఘునాథస్వామివారి భూములు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్నాయి. 25 ఏళ్లుగా స్వామివారి భూముల్లో కౌలుదారులుగా ఉన్న రైతులు ఈ భూములను నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. సోమవారం పొట్లూరి రామస్వామి, మలేటి జానకీదేవి, చిట్టూరి బృందాదేవి సాగుదారులుగా ఉన్న భూముల్లో వేసిన మినుము పంటను కొందరు ఆక్రమణదారులు కోత యంత్రంతో కోసుకుని వెళుతుండగా కౌలుదారులకు సంబంధించిన వారసురాలు తోటకూర గాయత్రి అడ్డుకుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కొందరు కౌలు రైతులు స్వామివారి భూముల విషయంలో పరస్పరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసిన ఘటనలున్నాయి. స్వామివారికి వేంపాడు అగ్రహారంలో, గొల్లపలిలో మొత్తం 3700 ఎకరాలు భూములున్నాయి. వాటిలో సుమారు 2700 ఎకరాల్లో రైతులు కౌలుదారులుగా ఉన్నారు. ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారుల నిర్లక్షంతో ఈ భూములు మరింతగా వివాదాస్పదంగా మారుతున్నాయి.


గతంలో సదరు భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఒకే పట్టాదారు పుస్తకాన్ని జారీ చేశారు. 2003లో స్వామివారి భూములు సర్వే నిర్వహించినా, ఆ వివరాలను రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ చెయ్యలేదు. ఈ భూముల విషయంలో అటు కౌలు రైతుల్లో, ఇటు అధికారుల్లో ఒక స్పష్టత లేకుండా పోయింది. 2010లో కౌలు రైతుల ఎంజాయ్‌మెంట్‌ సర్వేను చేసినా, ప్రతిపాదిత సర్వే నెంబర్లు అప్‌డేట్‌ కాలేదు. 2016లో స్వామివారి పేరుతో కేటాయించిన పట్టాదారు పాస్‌ పుస్తకంలో 1 నుంచి 35 వరకు సర్వేనంబర్లు ఉండగా, 2003 సంవత్సరానికి ముందున్న సర్వే నంబర్లతోనే ప్రస్తుతం దేవాదాయశాఖ అధికారులు కౌలుదారుల నుంచి కౌలుశిస్తు కట్టించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు మధ్యస్తంగా తీసుకొచ్చిన డాక్యుమెంట్లతో సదరు భూములు తమవేనంటూ, 50 ఏళ్లకుపైగా కౌలుదారులుగా ఉన్న రైతుల నుంచి భూములను ఆక్రమించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు అధికారులు, అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతో ఆక్రమణలు ఎక్కువ కావడంతో భూముల వివాదం మరింత సమస్యగా తయారయ్యింది.  

Updated Date - 2020-12-01T15:03:20+05:30 IST