ఉపాధిలో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-05-28T06:54:13+05:30 IST

జిల్లాలో ఒకవైపు ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నా.. మరోవైపు సామాజిక తనిఖీల్లో భారీగా నిధుల దుర్వియోగం జరిగినట్లు బయట పడుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రతీరోజు వేలాదిమంది ఉపాధి పనులకు వస్తున్నారు. ఎండలు పెరిగేలోపే పనులను పూర్తిచేస్తున్నారు. గ్రామాల్లో ఈ పథకం ద్వారా వ్యవసాయ, అటవీ, సాగునీటి శాఖలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు.

ఉపాధిలో గోల్‌మాల్‌

జిల్లాలో భారీగా బయటపడుతున్న ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం

ఒక్క డిచ్‌పల్లి లోనే రూ.3కోట్ల నిధులు

మరిన్ని మండలాల్లోనూ పెద్దమొత్తంలో బయటపడే అవకాశం

కరోనా సమయంలో పనులు జరిగినా.. రికార్డులు నిర్వహించని సిబ్బంది

ప్రస్తుతం సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు!! 

గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు

ప్రతీరోజు 80వేల మందికి పైగా హాజరవుతున్న కూలీలు

కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూలి డబ్బుల చెల్లింపుల్లో ఆలస్యం

జిల్లావ్యాప్తంగా  మొత్తం 530 గ్రామాల పరిధిలో పనులు

నిజామాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఒకవైపు ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నా.. మరోవైపు సామాజిక తనిఖీల్లో భారీగా నిధుల దుర్వియోగం జరిగినట్లు బయట పడుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రతీరోజు వేలాదిమంది ఉపాధి పనులకు వస్తున్నారు. ఎండలు పెరిగేలోపే పనులను పూర్తిచేస్తున్నారు. గ్రామాల్లో ఈ పథకం ద్వారా వ్యవసాయ, అటవీ, సాగునీటి శాఖలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. గ్రామాల్లో వానాకాలం సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన కాల్వలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులో పూడికతీత పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ ద్వారా కూలీ లు ఉపాధి పొందుతున్నా.. కొత్తసాఫ్ట్‌వేర్‌ వల్ల కూలి డబ్బులు చెల్లింపులో మాత్రం ఇబ్బందులు ఎదరురవుతున్నాయి. రోజుల తరబడి వేతనం కోసం చూసే పరిస్థితులు గ్రామాల్లో ఎదురరవుతున్నాయి.

పెద్దసంఖ్యలో కూలీల హాజరు

జిల్లాలో ఈ వేసవిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు భారీగానే కూలీలు హాజరవుతున్నారు. జిల్లాలోని 530 గ్రామా ల పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో గుర్తించిన పనులను ఈ కూలీలతో చేయిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు, అలాగే సాయంత్రం 3 నుంచి 6గంటల మధ్య ఉపాధి పనులు చేస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పనులు నిలిపివేస్తున్నారు. జిల్లాలో ఆయా గ్రామాల్లో మొత్తం 2లక్షల 90వేల 448 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఈ జాబ్‌కార్డుల ఆధారంగా పని అడిగిన ప్రతీ ఒక్కరికి వందరోజుల పాటు కల్పిస్తున్నారు. వారుచేసిన పనికి అనుకూలంగా వేతనం 249 రూపాయలకు మించకుండా చెల్లింపులు చేస్తున్నారు. గ్రామాల్లో పనులు లేకపోవడంతో ప్రతీరోజు 85వేల నుంచి 88 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గ్రామాల్లో హరితహారం, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలలో మిగిలిన పనులు ఉపాధి హామీ కింద చేస్తున్నారు. చెరువుల్లో పూడికలు తీయడం, వ్యవసాయ పనులకు ఉపయోగపడే కాల్వలను బాగుచేయడం, అటవీ ప్రాంతంలో కాంటూర్‌ కందకాలను తవ్వడం, చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు కొనసాగించడం వంటి పనులను ఎక్కువగా చేస్తున్నారు. గత హరితహారం పనులను కొనసాగిస్తూనే.. గ్రామాల్లో గుర్తించిన ఇతర పనులను ఉపాధి హామీ కూలీల ద్వారా చేయిస్తున్నారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతీరోజు రూ.150 నుంచి రూ.249 మధ్య కూలి పడేవిధంగా పనులు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా వేసవి అలవెన్స్‌ 30 శాతం ఇవ్వకపోవడం వల్ల కూలీలకు వేతనాలు తక్కువగా వస్తున్నాయి. ఎండవేడి ఉండడం, భూమిలో తేమశాతం లేకపోవడం వల్ల తక్కువగా కూలి వస్తుంది.

కూలి చెల్లింపుల్లో ఆలస్యం

జిల్లాలో ఉపాధి హామీ పనులు పెద్దఎత్తున జరుగుతున్నా.. కూలి డబ్బుల చెల్లింపులు మాత్రం ఆలస్యమవుతున్నాయి. కొత్త జిల్లాలతో పాటు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత జాబ్‌కార్డులు ఆయా గ్రామాలకు కొత్త సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా పంచడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల పరిధిలో విడిపోయిన రెండు గ్రామాల్లోనూ కొంతమంది పేర్లు రెండుచోట్ల ఉండడం వల్ల కొత్త సాఫ్ట్‌వేర్‌కు అనుగుణంగా పనుల వివరాలు ఎంట్రీ చేసిన సమయంలో రెండుచోట్ల ఉండడంతో తీసుకోకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. గత సంవత్సరం వరకు రాష ్ట్రప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించిన అధికారులు, ప్రస్తుతం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తుండడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నా యి. కొన్ని గ్రామాల పరిధిలో రెండు నెలల వరకు చెల్లింపులు జరగడం లేదు. ఇప్పటి వరకు ఏప్రిల్‌ నెల వరకే చెల్లింపులు చేశారు. పనులు చేస్తున్నా.. చెల్లింపులు ఆలస్యమవుతుండడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా చెల్లింపులు చేయాలని అధికారులను కోరుతున్నారు. 

వెలుగులోకి నిధుల దుర్వినియోగం

జిల్లాలో గత మూడేళ్లుగా కరోనా సమయంలో పనులు జరిగినా.. సామాజిక తనిఖీ చేయకపోవడంతో ఆయా మండలాల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సామాజిక తనిఖీలతో ఎక్కువ మొత్తంలోనే నిధుల దుర్వినియోగం జరిగినట్లు బయటపడుతున్నాయి. దీనిలో భాగంగా డిచ్‌పల్లి మండలంలో జరిగిన సామాజిక తనిఖీలో రూ.మూడు కోట్ల వరకు ఈ నిధులు బయటపడ్డాయి. కరోనా సమయంలో రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, ప్రతీ సంవత్సరం తనిఖీలు చేయకపోవడం వల్ల, ప్రస్తుతం సామాజిక తనిఖీ అధికారులు గ్రామాలకు వెళితే ఆ పనులు ఎక్కువగా కనిపించ పోవడం గమనార్హం. అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడి కూలీలను అడిగి నమోదు చేస్తున్నారు. రికార్డుల నిర్వహణ లేకపోవడం వల్ల ఇతర మండలాల్లో జరిగే సామాజిక తనిఖీలతో భారీ మొత్తంలో బయటపడే అవకాశం కనిపిస్తోంది.

గ్రామాల్లో పని అడిగిన వారందరికీ ఉపాధి కల్పిస్తున్నాం..

: చందర్‌నాయక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కింద.. అడిగిన వారందరికీ పనులు కల్పిస్తున్నాం. ప్రస్తుతం ప్రతీరోజు 80వేల మందికి పైగా కూలీలు హాజరవుతున్నారు. గ్రామాల్లో గుర్తించిన పనులను వారితో చేయించడంతో పాటు వెంట వెంటనే వారికి చెల్లింపులు జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కొత్త సాఫ్ట్‌వేర్‌ వల్ల ఇబ్బందులు ఉండడం వల్ల కూలి డబ్బుల చెల్లింపుల్లో ఆలస్యం అవుతోతంది. సామాజిక తనిఖీల్లో నిధుల దుర్వినియోగం బయటపడితే సంబంధిత ఉద్యోగులపైన తప్పలు చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-05-28T06:54:13+05:30 IST