గొంతు దిగని గోరుముద్ద

ABN , First Publish Date - 2021-04-18T05:43:17+05:30 IST

పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం ఉచితంగా అందించే భోజనాన్ని జగనన్న గోరుముద్దగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికి పాఠశాలల్లో విద్యార్థుల గొంతు దిగడం లేదు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండటంతో పాఠశాలల్లో భోజనం చేసేందుకు విద్యార్థులు ఆసక్తిచూపడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 85శాతం మంది పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా వాస్తవంలో అక్కడ తినే పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

గొంతు దిగని గోరుముద్ద
ముండ్లమూరులో మధ్యాహ్న భోజనాన్ని ఇంటి నుంచి బాక్సుల్లో తెచ్చుకొని తింటున్న విద్యార్థినులు

ఆధ్వానంగా మధ్యాహ్న భోజనం

పాఠశాలల్లో తినేందుకు ఆసక్తిచూపని పిల్లలు

తీరుమారని కుకింగ్‌ ఏజెన్సీలు

ఎక్కువమంది ఇంటి నుంచే బాక్సులు తెస్తున్న వైనం

భోజనం లెక్కల నమోదులోనూ అవకతవకలు

కనిపించని కోడిగుడ్డు, పోషకాహారం

- గత నెలలో ఒంగోలులోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, డీఈఓ వీఎస్‌ సుబ్బారావులు మధ్యాహ్న భోజనం రుచి చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీ తీరుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తగుచర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేశారు. 

-పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం రోజు పొదిలిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కుకింగ్‌ ఏజెన్సీకి నేరుగా ఫోన్‌చేసి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీచేశారు. 

- కొత్తపట్నం హైస్కూల్‌లో 1,450మంది విద్యార్థులు ఉండగా వీరిలో సగంమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పాఠశాలలో చేసేందుకు విముఖత చూపుతున్నారు. పాఠశాల ముగిసిన వెంటనే ఇళ్లకు వెళ్లి తింటున్నారు. హాస్టళ్ల విద్యార్థులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో బడిలోనే తింటున్నారు. కరోనా భయానికి తోడు భోజనం నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినేందుకు అయిష్టత చూపుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.

- జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం తీరు చాలా దారుణంగా ఉంది. మెనూ లేదు. భోజనం కూడా అధ్వానంగా, నాసిరకంగా ఉంటుండటంతో పిల్లలు తినడానికి ఆసక్తిచూపడం లేదు. దీంతో చాలావరకు విద్యార్థులు బడి వదలగానే ఇళ్లకు వెళ్లి తింటున్నారు. లేకుంటే కొందరు స్కూళ్లకు బాక్సులు తెచ్చుకుని తింటున్నారు. ఇక టెన్త్‌ విద్యార్థుల పరిస్థితి దారుణం. ఉదయం 10.30కే పెడుతుండటంతో సాయంత్రం వరకు వారు అదే భోజనంతో ఉండాల్సి వస్తోంది. కనీసం మధ్యలో స్నాక్స్‌ కూడా పెట్టడం లేదు. ఇక కుకింగ్‌ ఏజెన్సీలదీ ఇష్టారాజ్యంగా మారింది. స్వయంగా ఉన్నతాధికారులు భోజనాన్ని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసినా మారని పరిస్థితి.


ఒంగోలు(విద్య), ఏప్రిల్‌ 17 :పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం ఉచితంగా అందించే భోజనాన్ని జగనన్న గోరుముద్దగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికి పాఠశాలల్లో విద్యార్థుల గొంతు దిగడం లేదు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండటంతో పాఠశాలల్లో భోజనం చేసేందుకు విద్యార్థులు ఆసక్తిచూపడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 85శాతం మంది పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా వాస్తవంలో అక్కడ తినే పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయినా లెక్కల్లో మాత్రం అందరూ బడిలోనే తింటున్నట్లు చూపడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన మెనూను కొన్ని ఏజెన్సీలు పాటించకపోవడంతో విద్యార్థులకు నాసిరకం భోజనమే దిక్కయింది. జిల్లా, జోనల్‌స్థాయి అధికారులు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్నభోజనం రుచి చూసి కుకింగ్‌ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీచేస్తున్నా వారి తీరులో ఎటువంటి మార్పులు రావడం లేదు. 

85శాతం మందికి భోజనమా?

జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో 85శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని 3,418 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల్లో 2,98,536 మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో 2,53,756 మంది విద్యార్థులు పాఠశాలల్లో భోజనం చేస్తున్నారు. ఒంగోలు, మార్కాపురం, దర్శిలలో ఏక్తాశక్తి కేంద్రీకృత కిచెన్‌షెడ్‌ ద్వారా భోజనాలు అందిస్తుండగా ఇతర పాఠశాలలు 3,370 కుకింగ్‌ ఏజెన్సీల ద్వారా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కానీ లెక్కల్లో చూపేదానికి పాఠశాలల్లో తినేవారి సంఖ్యకు పొంతన ఉండటం లేదు. సగం మందిపైనే ఇళ్లకు వెళ్లి తింటునట్లు స్వయంగా అధికారులే చెబుతున్నారు. కాగా పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10.30కే భోజనం పెడుతున్నారు. వారు రెండుపూట్ల స్కూల్‌లో ఉంటున్నారు. దీంతో వారు ఆకలితో నకనకలాడుతున్నారు. మధ్యలో స్నాక్స్‌ కూడా అందించకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు.


అధ్వానంగా ఏక్తాశక్తి భోజనం

ఏక్తాశక్తి ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటుంది. ఒంగోలు పరిధిలోని 223 పాఠశాలల్లో చదువుతున్న 20,867మంది, దర్శి ప్రాంతంలోని 177 పాఠశాలల్లో ఉన్న 19,923మంది, మార్కాపురంలోని 85 పాఠశాలల్లోని 11,248మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వారు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏకాశక్తి మధ్యాహ్న భోజనంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చిక్కిలు అందించాల్సి ఉండగా పిల్లలకు చిక్కిలు మాత్రమే అందుతున్నాయి. గత మూడు నెలలుగా విద్యార్థులకు కోడిగుడ్లు సరఫరా చేయడం లేదు. ఈ సంస్థ అందిస్తున్న మధ్యాహ్న భోజనం తీరుపై అన్నిచోట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు

- డీఈఓ వీఎస్‌ సుబ్బారావు

పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంఇఓలు, ఇతర అధికారులతో పాటు క్షేత్రస్థాయిలోని సచివాలయ సిబ్బంది కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి పిల్లలకు నాణ్యమైన భోజనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీచేశాం. నాణ్యతపై ప్రతిరోజు ప్రభుత్వానికి యాప్‌ ద్వారా తెలియజేస్తున్నాం. ఏక్తాశక్తి అందిస్తున్న భోజనంపై ఫిర్యాదులు రావడంతో జేసీ, నేను స్వయంగా పరిశీలించి తగు చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. పాఠశాలల్లో ఖచ్చితంగా మెనూ పాటించాలి. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలి. 



Updated Date - 2021-04-18T05:43:17+05:30 IST