పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

ABN , First Publish Date - 2020-03-02T17:32:31+05:30 IST

మా బాబుకు అయిదేళ్లు. ఆరోగ్యంగా పెరగడానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి?

పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

ఆంధ్రజ్యోతి(02-03-2020)

ప్రశ్న: మా బాబుకు అయిదేళ్లు. ఆరోగ్యంగా పెరగడానికి ఎటువంటి 

ఆహారం ఇవ్వాలి?


- ప్రజ్ఞ, బెంగుళూరు


జవాబు: పిల్లలకు చిన్నతనంలోనే చక్కని ఆహారపు అలవాట్లను 

పరిచయం చేయాలి. ప్రీ స్కూల్‌ నుంచి మామూలు స్కూల్‌లో చేరుతున్న దశ కాబట్టి, సొంతంగా తినేందుకు అనువైన ఆహారాన్నే ఇవ్వాలి. బడి వయసు పిల్లలకు సమయానికి తగిన ఆహారం చాలా ముఖ్యం. ఉదయం ఓ కప్పు పాలు, గుడ్డు, ఇడ్లీ, దోసె వంటి అల్పాహారం పెట్టండి. మధ్యాహ్నం ఆకుకూరలు, కూరగాయలు వేసి చేసిన ఫ్లేవర్డ్‌రైస్‌ లేదా పప్పుతో చేసిన కిచిడీ లేదా కూరతో పాటు రోల్స్‌లా చేసిన చపాతీలు మంచివి. సాయంత్రం ఓ కప్పు పాలు, స్నాక్స్‌గా పళ్ళు, బఠాణీలు, సెనగలు, వేరుశెనగ పప్పు, మరమరాలు, అటుకులు లాంటివి అలవాటు చేయండి. నూనెతో చేసిన చిరుతిళ్ళు, బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌... నెలకు ఒకటి రెండుసార్లకు మించకూడదు. రాత్రి భోజనంలో అన్నం లేదా చపాతీతో కొంత కూర, పెరుగు లేదా మజ్జిగ ఇస్తే సరిపోతుంది. కావాలంటే ఈ సమయంలో మరో పండు తినేలా చూడండి. ఐదారేళ్ళ పిల్లలకు రోజుకు కనీసం ఒక గంట ఏ మైదానాల్లోనో ఆడుకునే అవకాశం ఉండాలి. నిద్రకు రెండున్నర నుంచి మూడు గంటల ముందుగా రాత్రి భోజనాన్ని ముగించేలా చూడాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గంటల నిద్ర అవసరం.

 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-03-02T17:32:31+05:30 IST