‘హ్యాపీనెస్ట్‌’కు మంగళం!

ABN , First Publish Date - 2022-07-03T09:38:35+05:30 IST

‘హ్యాపీనెస్ట్‌’కు మంగళం!

‘హ్యాపీనెస్ట్‌’కు మంగళం!

ప్రాజెక్టు నుంచి త ప్పుకోవటానికి ప్రభుత్వం కుయుక్తులు

స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి.. డబ్బులు ఇచ్చేస్తాం

హ్యాపీనెస్ట్‌ లబ్ధిదారులకు సీఆర్‌డీఏ లేఖలు

‘రివర్స్‌ టెండరింగ్‌’లో ఉన్నామని రెరాకు సమాధానం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

అమరావతి రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ‘హ్యాపీనె్‌స్ట’ను వదిలించుకునే దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశం లేకపోవడంతో.. ప్రాజెక్టు వద్దనుకునే వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ఓవైపు లబ్ధిదారులకు లేఖలు రాస్తూ.. మరోవైపు లబ్ధిదారులే స్వచ్ఛందంగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారని ఏపీ రెరాకు చెబుతోంది. హ్యాపీనెస్ట్‌ లబ్ధిదారులకు గత రెండు రోజులుగా సీఆర్‌డీఏ నుంచి ఈమేరకు లేఖలు అందుతున్నాయి. అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణ పనులను ఓ పథకం ప్రకారం నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టును వదిలించుకోడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అధికారంలోకి రాగానే శాశ్వత రాజధాని నిర్మాణాలైన గ్యాడ్‌ టవర్స్‌, ఇంటిగ్రేటెడ్‌ సెక్రటేరియట్‌ టవర్స్‌ (4), హైకోర్టు, అడ్వకేట్‌ బ్లాక్‌ పనులను నిలుపుదల చేసిన జగన్‌ ప్రభుత్వం.. ఆతర్వాత హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదిలించుకోవడం అంత తేలిక కాలేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో సీఆర్‌డీఏ నేతృత్వంలో చేపట్టిన ‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ మల్టీస్టోర్డ్‌ అపార్ట్‌మెంట్స్‌’ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత సీఆర్‌డీఏపై ఉంది. ప్రాజెక్టును పూర్తిచేయలేకపోతే రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) దృష్టిలో డీ ఫాల్టర్‌గా మారుతుంది. వాస్తవానికి 2021 మార్చి 31 నాటికే ప్రాజెక్టును పూర్తిచేసి లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించాలి. అయితే ఈ ప్రాజెక్టును వదిలించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత తీవ్ర జాప్యం చేసి గడువుకు మూడు నెలల ముందు ఒక పథకం ప్రకారం సీఆర్‌డీఏ రివర్స్‌ టెండర్లు పిలిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచినపుడు రూ.658.46 కోట్ల వ్యయంతో షాపూర్జీ పల్లోంజి సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు మూడు సార్లకు పైగానే వెళ్లినా.. ఏ కాంట్రాక్టు సంస్థ నుంచీ స్పందన రాలేదు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయకపోగా.. ఒక్క ఇటుక కూడా వేయకపోవటంతో హ్యాపీనెస్ట్‌ లబ్ధిదారులు సీఆర్‌డీఏ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. మరికొందరు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు. దీనిని రెరా సీరియ్‌సగా తీసుకుని, సీఆర్‌డీఏకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సీఆర్‌డీఏ అధికారులు సమాధానం ఇస్తూ.. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు విషయంలో సీఆర్‌డీఏ చాలా తక్కువ లాభంతోనే ప్రాజెక్టును తలకెత్తుకుందని, ఇంకా ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని.. అయితే కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టును పూర్తి చేయటానికి 2022 డిసెంబరు 31 వరకు ఏపీ రెరా గడువు ఇచ్చింది. ఈ గడువులోగా పనులు ప్రారంభించటానికి సీఆర్‌డీఏ ఏ మాత్రం కృషి చేయలేదు. గడువు తేదీ మరో ఐదు నెలలు ఉందనగా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో ఉన్నామంటూ లబ్ధిదారులకు ఇచ్చిన లేఖల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఏపీ రెరా ఆదేశాలు ఇచ్చిన తర్వాత సీఆర్‌డీఏ వ్యూహాత్మకంగా.. లబ్ధిదారులకు కూడా ప్రాజెక్టుపై ఆసక్తి లేదని, తాము ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించామని మెజారిటీ లబ్ధిదారులు ప్రాజెక్టును రద్దు చేయమంటున్నారని రెరాకు నివేదించింది. ప్రభుత్వ తీరుతో విసుగెత్తి ప్రాజెక్టును రద్దు చెయ్యమని కొందరు లబ్ధిదారులు మెయిల్స్‌ చేయటం వాస్తవమే. అయితే ఇది కొందరి అభిప్రాయం మాత్రమే. సీఆర్‌డీఏ వాదనలు విన్న తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకునే వారికి ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాలని, ఇష్టపడని వారిని బలవంతం చేయకూడదని ఏపీ రెరా గట్టిగా చెప్పింది. ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లే విషయంలో కాంట్రాక్టర్‌ నియామకం స్థితిని తెలపాలని సీఆర్డీయేను కోరింది. అయితే ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశం లేని సీఆర్‌డీఏ.. లబ్ధిదారులకు డబ్బులు చెల్లించి వదిలించుకోవాలనే ఎత్తుగడతోనే.. హ్యాపీనెస్ట్‌ లబ్ధిదారులకు లేఖలు పంపుతోంది. డబ్బులు తీసుకుంటామంటే ఇచ్చేస్తామని రెండు నెలలుగా చెబుతోంది. డెబ్బై శాతం మంది డబ్బులు తీసుకున్నారన్న తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తోంది. వాస్తవానికి 1187 మంది లబ్ధిదారుల్లో ఐదుగురు తమ అప్లికేషన్లను రద్దు చేసుకున్నారని, 1182 మంది ప్రాజెక్టుతో కలిసి ఉన్నారని ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉంది. 

Updated Date - 2022-07-03T09:38:35+05:30 IST