సహకారంపై పెత్తనం!

ABN , First Publish Date - 2021-07-16T08:20:59+05:30 IST

కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వశాఖ విమర్శలకు గురవుతోంది. మంత్రివర్గ విస్తరణకు కొద్దిగాముందు ఈ కొత్తశాఖ తెరమీదకు వచ్చి...

సహకారంపై పెత్తనం!

కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వశాఖ విమర్శలకు గురవుతోంది. మంత్రివర్గ విస్తరణకు కొద్దిగాముందు ఈ కొత్తశాఖ తెరమీదకు వచ్చి, ఆ తరువాత దానిని అమిత్‌ షా వంటి యో‌ధానుయోధుడికి అప్పగించడంతో దీని ఆవిర్భావ లక్ష్యాలమీద విపక్షాల్లో చాలా అనుమానాలు పుట్టుకొచ్చాయి. కేంద్రపెద్దలు ఏం చేసినా అందులో రాజకీయమే ఉంటుందని గట్టిగా నమ్మే పెద్దమనుషులు సైతం ఈ శాఖ ఆధారంగా రాబోయే రోజుల్లో కేంద్రం ఎలా చెలరేగబోతున్నదో అంచనాలు కడుతున్నారు.


పార్లమెంటు సమావేశాల్లో దీనిపై పెద్ద రచ్చ జరిగే అవకాశాలున్నాయి. రాజ్యాంగం ప్రకారం సహకారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉండగా, కేంద్రంలో ఇలా ఓ ప్రత్యేకమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం వెనుక రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే ఆలోచనలేవో ఉన్నాయని విపక్ష నేతల అనుమానం. కేంద్రపాలకులు ఒకవైపు రాష్ట్రాలతో సహకారం గురించీ, సమాఖ్య వ్యవస్థ ఔన్నత్యం గురించీ మాట్లాడుతూనే మరోవైపు రాష్ట్రాల హక్కులూ అధికారాలను హరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నవారు సహకార రంగాన్ని ఉద్ధరిస్తారంటే ఎలా నమ్మడం అని పలువురి ప్రశ్న. మొన్నటి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి దేశంలో సహకార రంగాన్ని సమూలంగా ఉద్ధరించడం గురించి ప్రస్తావించారనీ, ఇది అదేనని బీజేపీ నేతలు అంటున్నారు. కొత్తశాఖ అన్నది అప్పటికప్పుడు చేసిన రాజకీయ నిర్ణయం కాదని చెప్పడం ఉద్దేశం. సహకారంతోనే సర్వతోముఖాభివృద్ధీ, సమృద్ధీ సాధ్యమనీ, సహకారోద్యమానికి బలం చేకూర్చే దిశగా న్యాయ, విధాన, పరిపాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వశాఖ తయారుచేస్తుందని ప్రభుత్వం అంటోంది. కుదేలైన సహకార సంస్థలను పునరుద్ధరించడం, గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై సాగుతున్న దోపిడీని అడ్డుకోవడం దీనిద్వారా సాధ్యమని చెబుతున్నారు. 


ఇక, కొత్తకూటముల ముచ్చట్లు పెడుతున్న శరద్‌ పవార్‌ పవర్‌ అంతా సహకార రంగంలోనే ఉన్నందున ఆయనను రాజకీయంగా కత్తిరించే లక్ష్యంతోనే ఈ శాఖ ఏర్పడిందన్న అనుమానాలూ ఉన్నాయి. మహారాష్ట్ర శాసనసభలోని అత్యధిక ఎమ్మెల్యేలకు సహకార సంఘాలతో బంధం ఉంది. అక్కడి చక్కెర పరిశ్రమ మీద పవార్‌ పట్టు తెలిసిందే. కేరళ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని రాజకీయనాయకత్వం కూడా సహకారం పునాదిగా బలం సంతరించుకున్నమాట నిజం. ఈ రాష్ట్రాల్లోని సహకారం ఆయా పార్టీల అదుపులో ఉన్నది. రాజకీయనాయకుల ప్రాబల్యాలకు సహకారం పునాది కనుకనే, కొత్తగా అధికారంలోకి రాగానే పాతవాసనలను ప్రక్షాళించే ప్రయత్నాలూ విశేషంగా జరుగుతూంటాయి. రాజకీయంతో ఎంత చెడినా, దేశంలో సహకార వ్యవస్థ బలంగానే ఉంది. 40కోట్లమంది భాగస్వామ్యంతో, కనీసం 9లక్షల సంఘాలు లక్షల కోట్ల రుణాలు ఇస్తూ, ఏటా వేలకోట్ల వ్యాపారం చేస్తున్నాయి. 


వ్యవసాయం, చేనేత, చక్కెర, జౌళి, పాడి, బ్యాంకింగ్‌ ఇత్యాది అనేకానేక రంగాలకు విస్తరించి, ఒక భారీ వ్యవస్థగా తయారైన సహకార రంగాన్ని రాజకీయంగా ఏ స్థాయిలో ఉపయోగించుకోవచ్చునో గుజరాత్‌ మూలాలున్న కేంద్రపాలకులకు తెలియనిదేమీ కాదు. స్థానిక ప్రజల విస్తృత భాగస్వామ్యంతో, అనుబంధంతో కొనసాగుతున్న ఈ వ్యవస్థపై అదుపు అధికారంలో కొనసాగడానికి ఉపకరిస్తుంది. గుజరాత్‌లో జరిగింది ఇదేననీ, అయితే అక్కడ శృతిమించిన రాజకీయపెత్తనంతో సంఘాలు అనేకం దివాలా తీశాయని కూడా అంటారు. అమూల్‌ను నష్టాల్లోకి నెట్టి, ఆంధ్రప్రదేశ్‌, లక్షద్వీప్‌ వంటిచోట్ల రుద్దుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. గుజరాత్‌లో మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లోని సహకార సంస్థలనూ గుప్పిట్లోకి తెచ్చుకొని, రాబోయే రాష్ట్రాల ఎన్నికలనుంచి సార్వత్రక ఎన్నికల వరకూ లబ్ధిపొందాలన్నది బీజేపీ పెద్దల దూరాలోచనని విపక్షనేతల వాదన. రాష్ట్ర చట్టాలకు లోబడి ఉండే సహకార సంస్థలమీద కేంద్రం ఇలా పెత్తనం చేయాలనుకోవడం వెనుక వాటి ఆస్తిపాస్తులతోపాటు, విపక్షాలను రాజకీయంగా దెబ్బతీసే ఆలోచన కూడా ఉండవచ్చు. రాష్ట్రాల చేతుల్లోని కీలకమైన రంగాలను కేంద్రం ఒక్కొటొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్న స్థితిలో ఈ కొత్తమంత్రిత్వశాఖ వెనుక కూడా కుట్ర ఉన్నదనీ, అది ఫెడరల్‌ నీతిని తూట్లు పొడుస్తున్నదనీ విపక్షనేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా కొట్టిపారేయలేనివి.

Updated Date - 2021-07-16T08:20:59+05:30 IST