విదేశాల నుంచి వచ్చే 5 ఏళ్ళలోపు బాలలకు శుభవార్త

ABN , First Publish Date - 2021-11-12T15:35:36+05:30 IST

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రయాణ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి సవరించింది. దీనిలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశాల నుంచి వచ్చే 5 ఏళ్ళలోపు బాలలకు శుభవార్త

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రయాణ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి సవరించింది. దీనిలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి స్వదేశానికి చేరుకున్న తర్వాత ఎలాంటి కరోనా పరీక్ష అవసరం లేదని ప్రకటించింది. అలాగే ప్రయాణానికి ముందు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే, కరోనా లక్షణాలు ఉన్నట్లైతే హోం క్వారంటైన్‌లో మాత్రం ఉండాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం ఈ క్వారంటైన్ తప్పనిసరి. శుక్రవారం(నవంబర్ 12) నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని ఆరోగ్యశాఖ గురువారం స్పష్టం చేసింది. మహమ్మారి ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతుండడంతో విదేశాల నుంచి వచ్చేవారికి ప్రయాణ మార్గదర్శకాలను సవరించినట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది.


ఇక ఇంతకుముందు నిబంధనల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం పొందిన కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న విదేశీ ప్రయాణికులు భారత్‌కు రావొచ్చు. వారిక ఎలాంటి హోం క్వారంటైన్ ఉండదు. ఒకవేళ వ్యాక్సిన్ వేసుకోని వారు లేదా ఒక డోసు వేసుకున్న వారు ఉంటే.. విమానశ్రయానికి చేరుకున్న వెంటనే అరైవల్ పాయింట్‌లో ప్రయాణానికి ముందు టెస్టు చేయించుకున్న కరోనా పరీక్షకు సంబంధించిన నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అలా చూపించిన తర్వాతే వారిని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అలాగే ఈ కేటగిరీకి చెందిన ప్రయాణికులు ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండడంతో పాటు ఎనిమిదో రోజున మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టులో నెగెటివ్ వస్తే మరో ఏడు రోజులు తమ ఆరోగ్యంపట్ల స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. ఒకవేళ టెస్టులో పాజిటివ్ వస్తే వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లడంతో పాటు ఈ విషయాన్ని దగ్గరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియజేయాలి. లేదా జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు గానీ, సంబంధిత రాష్ట్ర హెల్ప్‌లైన్‌కు గానీ కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. 

Updated Date - 2021-11-12T15:35:36+05:30 IST