40 ఏళ్లు దాటిన ఈఎస్‌ఐసీ సభ్యులకు.. గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-12-05T14:13:26+05:30 IST

కార్మిక రాజ్య బీమా సంస్థ..

40 ఏళ్లు దాటిన ఈఎస్‌ఐసీ సభ్యులకు.. గుడ్‌న్యూస్!

40 ఏళ్లు దాటిన ఈఎస్‌ఐసీ సభ్యులకు ఏటా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు!

పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌, ఫరీదాబాద్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతాల్లో అమలు

ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌

విశాఖలో 30 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం


న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈఎస్ఐసీ సభ్యులైన 40 ఏళ్లు, ఆపై వయసు గల ఉద్యోగులకు ఏటా ఉచితంగా ‘ముందస్తు ఆరోగ్య పరీక్షలు’ చేసే కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శనివారం ప్రారంభించారు. ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఫరీదాబాద్‌, కోల్‌కతాల్లోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేయనున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన ఈఎస్ఐసీ 186వ సమావేశం కూడా జరిగింది.


గురుగ్రామ్‌(మనేసర్‌)లో 500 పడకలతో ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించే ప్రతిపాదనకు సమావేశంలో ఆమోదముద్ర వేశారు. సమావేశం అనంతరం యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. తమ లక్ష్యం ‘స్వస్థ భారత్‌’ అని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే 3.50 కోట్ల మంది ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు కింద 40 ఏళ్లు దాటిన ఉద్యోగులందరికీ ఏటా ఉచితంగా ముందస్తు ఆరోగ్యపరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా తమ కల నెరవేరుతుందని చెప్పారు. భవిష్యత్తులో సామాజిక భద్రతా కోడ్‌ను అమలు చేయడం ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షల పరిధిని 5 కోట్ల మంది సభ్యులకు విస్తరింపజేస్తామన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రులను సూపర్‌ స్పెషాలిటీగా అభివృద్ధి చేస్తామని, తద్వారా రిఫరల్‌ కేసులు తగ్గుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో 30 పడకలతో నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రికి భూమిని సేకరించేందుకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. 2 ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించారు.  

Updated Date - 2021-12-05T14:13:26+05:30 IST