పేద విద్యార్థులకు శుభవార్త!

ABN , First Publish Date - 2021-06-18T05:10:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న పాఠశాల / కళాశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోదలక్ష్మి తెలిపారు.

పేద విద్యార్థులకు శుభవార్త!




 గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి అవకాశం

 ఐదు, ఇంటర్‌లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఎచ్చెర్ల, జూన్‌ 17 : ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న పాఠశాల / కళాశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోదలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.  2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 12 గురుకుల పాఠశాలలు ఉన్నాయని... వీటిలో   8 బాలికలు, 4 బాలురవని తెలిపారు. 5వ తరగతి, నీట్‌ ఐఐటీ అకాడమీలోనూ, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం(ఇంగ్లీష్‌ మీడియం)లో ప్రవేశించా లనుకున్న బాలురు, బాలికలు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని చెప్పారు. 5వ తరగతి ప్రవేశాల కోసం హెచ్‌టీటీపీ:// ఏపీజీపీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో, ఇంటర్‌కు సంబంధించి హెచ్‌టీటీపీ: //ఏపీజీపీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌/ఇంటర్‌ అన్న వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 7 తరువాత దరఖాస్తులు స్వీకరించబోమని తెలిపారు. ఒకసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత ఎటువంటి మార్పులు చేసేందుకు అవకాశం ఉండదన్నారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష తేదీని రిజిస్టర్‌ ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో కానీ..పత్రికా ప్రకటనల ద్వారా కానీ తెలియజేయనున్నట్టు ఆమె వివరించారు. 


రిజర్వేషన్లు ఇలా..

గురుకుల విద్యాలయాల్లో ఎస్సీ విద్యార్థులకు 75 శాతం, ఎస్సీ (కన్వెర్టడ్‌ క్రిస్టియన్‌) వారికి 12 శాతం, ఎస్టీ విద్యార్థులకు 6 శాతం, బీసీ విద్యార్థులకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2008 సెప్టెంబరు 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఓసీ, బీసీ, ఎస్సీ (కన్వెర్టడ్‌ క్రిస్టియన్‌), బీసీ సీ విద్యార్థులు 2010 సెప్టెంబరు 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారై ఉండాలి. సొంత జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలో 2019-20 విద్యాసంవత్సరంలో 3వ తరగతి, 2020-21లో 4వ తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయ పరిమితి రూ.లక్షకు మించకూడదు. 



Updated Date - 2021-06-18T05:10:49+05:30 IST