Techies కు మంచి రోజులు !.. జీతాలు పెంపు బాటలో పలు Tech companies

ABN , First Publish Date - 2022-05-31T22:04:24+05:30 IST

జీతాల పెంపు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టెకీలకు మంచి రోజులొచ్చాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నె

Techies కు మంచి రోజులు !.. జీతాలు పెంపు బాటలో పలు Tech companies

న్యూఢిల్లీ : జీతాల పెంపు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టెకీలకు(Techies) మంచి రోజులొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శాలరీల పెంపు(Salary Hike) దిశగా కంపెనీలు అడుగులేస్తున్నాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను దక్కించుకోవడం, ఇప్పటికే ఉన్న ఉద్యోగులు పక్క కంపెనీలవైపు చూడకుండా జీతాలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. ఇందుకు అనుగుణంగానే అమెజాన్(Amazon), గూగుల్(Google), మైక్రోసాఫ్ట్‌(Microsoft)తోపాటు పలు టెక్ కంపెనీలు ఇప్పటికే భారీగా వేతనాలు పెంచాయి. వాస్తవానికి కరోనా కారణంగా 2020 నుంచి పలు కంపెనీలు జీతాలు పెంచలేదు. ఆర్థిక మందగమనం కూడా కంపెనీల నిర్ణయంపై ప్రభావం చూపింది. అయితే తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో కంపెనీల కార్యకలాపాలు కరోనా ముందు నాటి స్థితికి చేరాయి. దీంతో కరోనా సమయంలో వ్యవహరించిన వైఖరికి భిన్నంగా రివార్డులు, ప్రమోషన్లు, జీతాల పెంపునకు కంపెనీల యాజమాన్యాలు ముందుకు సాగుతున్నాయి.


శాలరీ గరిష్ఠ పరిమితి రెట్టింపు చేసిన అమెజాన్

ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచేందుకు వీలుగా అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల గరిష్ఠ జీతం పరిమితిని రెట్టింపు చేసి 350,000 డాలర్లకు పెంచింది. గతంలో గరిష్ఠ పరిమితి కేవలం 160,000 డాలర్లుగా మాత్రమే ఉండేది. అయితే టెక్ ఉద్యోగులకు గరిష్ఠంగా 350,000 డాలర్ల వరకు జీతం ఇవ్వనుంది. నైపుణ్యం ఉన్న ఉద్యోగుల నియామకం, ప్రస్తుత ఉద్యోగులు ఇతర కంపెనీలకు వెళ్లకుండా నిరోధించడమే లక్ష్యంగా అమెజాన్ ఈ నిర్ణయానికి ముఖ్యకారణంగా ఉందని ‘గీక్‌వైర్’ రిపోర్ట్ పేర్కొంది.


టాప్ పోస్టుల్లో ఉన్నవారికి శాలరీ పెంచిన గూగుల్

ఈ ఏడాది జనవరిలో కంపెనీలో టాప్ స్థానాల్లో ఉద్యోగుల జీతం గరిష్ఠ పరిమితిని 650,000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు పెంచుతూ గూగుల్ ప్రకటన చేసింది. దీంతో కనీసం నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. ఇందులో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రూత్ పోరట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్(గూగుల్ సెర్చ్ ఇన్‌‌చార్జ్), సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ సిండ్లెర్, కెంట్ వాకర్(ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్, చీఫ్ లీగల్ ఆఫీసర్)లు ఉన్నారు. ఇతర స్థానాల్లో అర్హత కలిగిన ఉద్యోగుల జీతాల పెంపునకు కట్టుబడి ఉన్నట్టు కంపెనీ పేర్కొన్న విషయం తెలిసిందే. గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్ పయనించింది. ఉద్యోగుల జీతం పెంపు కోసం గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇటివలే ఉద్యోగులకు మెయిల్ పంపించారు. కెరీర్ మధ్యలో ఉన్న ఉద్యోగుల కోసం మరింత డబ్బును కేటాయిస్తామని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. 


పెద్ద సంఖ్యలో నియామకాలు, జీతాల పెంపు బాటలో ఇన్ఫోసిస్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఇటివలే తమ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు పెంచింది. అంతేకాదు ప్రమోషన్లు, బోనస్‌లు ప్రకటించింది. డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌లకు చెందిన ఉద్యోగులకు ఈ మేరకు జీతాలను పెంచింది. మింట్ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లోని ఉద్యోగులకు 12-13 శాతం మధ్య జీతాలు పెంచినట్టు సమాచారం. టాప్ పోస్టింగుల్లో ఉన్నవారికి 20-25 శాతం వరకు పెంచింది. ఉద్యోగులు పక్క కంపెనీలవైపు చూడకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ స్థాయిలో జీతాలు పెంచిన విషయం తెలిసిందే. కాగా ఆర్థిక సంవత్సరం 2023లో 50 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్టు పలు రిపోర్టులు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా గతేడాది 85 వేలకుపైగా ఫ్రెషర్లను నియమించుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-31T22:04:24+05:30 IST