మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. అన్నంత పని చేసిన ఆప్ సర్కార్.. ఏడాదిలో ఇక..

ABN , First Publish Date - 2022-01-25T01:27:45+05:30 IST

మందుబాబులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. ఏడాదిలో కేవలం 3 రోజులు మినహా మిగిలిన రోజుల్లో మద్యం అందుబాటులో ఉండేందుకు ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం ప్రియులు ఎగిరి గంతేస్తు

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. అన్నంత పని చేసిన ఆప్ సర్కార్.. ఏడాదిలో ఇక..

ఇంటర్నెట్ డెస్క్: మందుబాబులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. ఏడాదిలో కేవలం 3 రోజులు మినహా మిగిలిన రోజుల్లో మద్యం అందుబాటులో ఉండేందుకు ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం ప్రియులు ఎగిరి గంతేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని మందు బాబులు గొప్పగా చెప్పుకుంటారు. అయినా తామంటే ప్రభుత్వానికి చిన్నచూపే అని ఆవేదన వెల్లగక్కుతారు. తమ కోసం ఏ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టదని ఉసూరుమంటారు. కాగా.. మందుబాబుల మొర ఢిల్లీలోని ఆప్ సర్కా‌ర్‌‌కు వినిపించినట్టు ఉంది. ‘సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాం. మరి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న మందుబాబులు ఏం తప్పు చేశారు?’ అని పశ్చాతాప పడ్డట్టు ఉంది. అందుకే మందు బాబులు ఎగిరి గంతేసే నిర్ణయం ఒకటి తీసుకుంది. డ్రై డేలను 21 నుంచి 3కు కుదించింది. ఈ మేరకు సోమవారం రోజు ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. రిపబ్లిక్ డే(జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2)న మాత్రమే డ్రై డేను అమలు చేయనున్నట్టు వెల్లడించింది. మిగిలిన రోజుల్లో మద్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. 


నిజానికి ఢిల్లీలో డ్రై డేలను 21 నుంచి 3కు కుదించనున్నట్టు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఏడాది చివరిలోనే ప్రకటించారు. దీంతోపాటే మద్యంతాగే వయసును కూడా 25 ఏళ్ల నుంచి 21కు తగ్గించనున్నట్టు అప్పట్లోనే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వ వైఖరిపట్ల ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.




Updated Date - 2022-01-25T01:27:45+05:30 IST