Good News: చెన్నైవాసులకు శుభవార్త!

ABN , First Publish Date - 2022-08-13T12:51:09+05:30 IST

గ్రేటర్‌ చెన్నైలో మరో నాలుగు నెలల్లో పైప్‌ లైన్‌ ద్వారా ఇళ్లకు వంటగ్యాస్‌(cooking gas) సరఫరా కానుంది. ప్రస్తుతం సిలిండర్లలో నింపిన గ్యాస్‌ను ఇంటింటి

Good News: చెన్నైవాసులకు శుభవార్త!

                  - నాలుగు నెలల్లో పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 12: గ్రేటర్‌ చెన్నైలో మరో నాలుగు నెలల్లో పైప్‌ లైన్‌ ద్వారా ఇళ్లకు వంటగ్యాస్‌(cooking gas) సరఫరా కానుంది. ప్రస్తుతం సిలిండర్లలో నింపిన గ్యాస్‌ను ఇంటింటికీ గ్యాస్‌ ఏజెన్సీలు పంపిణీ చేస్తున్నాయి. ఈ విధానాన్ని మార్చి, పైప్‌ లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ ప్రజలకు అందించాలని కేంద్రప్రభుత్వం ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పథకం రూపొందించింది. తొలివిడతగా చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ తదితర మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఈ ప్రక్రియ అమలుపరిచే పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నగరంలో తొలివిడతగా అన్నానగర్‌, కేళంబాక్కం ప్రాంతాల్లో ఉన్న అపార్ట్‌మెంట్లు(Apartments), హౌసింగ్‌ బోర్డు క్వార్టర్స్‌లలో పైప్‌లైన్‌ గ్యాస్‌కు సంబంధించి మీటర్లు, పైపులు పొందుపరిచే పనులు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తిచేసి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారి కంటే ప్రైవేటు ఇళ్లకు పైప్‌లైన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ కేటాయించడం అధిక ఖర్చుతో కూడిన పని అని, అందువల్ల రెండవ కనెక్షన్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకం మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని అధికారులు వ్యాఖ్యానించారు. చెన్నై, తిరువళ్లూర్‌ జిల్లాల్లో దాదాపు 33 లక్షల ఇళ్లకు పైప్‌లైన్‌ గ్యాస్‌ కనెక్షన్లు కేటాయించనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే నాగపట్టణం జిల్లాలో 30 మంది వినియోగదారులు, వేలూరులో ఏడు ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ పొందే నెట్‌వర్క్‌లో ఉన్నారని, ప్రస్తుతం నాగపట్టణం(Nagapattinam) జిల్లాలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. చెన్నై, తిరువళ్లూర్‌ అనంతరం కడలూరు, తిరువారూర్‌, రామనాథపురం, సేలం, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాల్లో కూడా పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు కల్పించేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-13T12:51:09+05:30 IST