వీసా దరఖాస్తుదారులకు తీపికబురు!

ABN , First Publish Date - 2022-02-28T12:45:34+05:30 IST

భారత్‌ నుంచి వచ్చేవారికి అమెరికా శుభవార్త చెప్పింది. కొన్నిరకాల వీసాల మంజూరు కోసం దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకూ మినహాయింపు ఇస్తున్నట్లు భారత సంతతి నేతలకు ఓ అమెరికన్‌ సీనియర్‌ అధికారి తెలిపారు..

వీసా దరఖాస్తుదారులకు తీపికబురు!

వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేసిన అమెరికా 

విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులకు మినహాయింపు 

ఈ ఏడాది డిసెంబరు 31 వరకూ అమలు


వాషింగ్టన్‌, ఫిబ్రవరి 27: భారత్‌ నుంచి వచ్చేవారికి అమెరికా శుభవార్త చెప్పింది. కొన్నిరకాల వీసాల మంజూరు కోసం దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకూ మినహాయింపు ఇస్తున్నట్లు భారత సంతతి నేతలకు ఓ అమెరికన్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. విద్యార్థులు (ఎఫ్‌, ఎం, జే), ఉద్యోగులు (హెచ్‌-1, హెచ్‌-2, హెచ్‌-3, ఎల్‌), కళాకారులు, విశిష్ట ప్రతిభావంతులకు (ఓ, పీ, క్యూ) ఇచ్చే వీసాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ నిర్ణయం దరఖాస్తుదారుల్లో ఆందోళనలను తొలగించడంతో పాటు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణాసియా కమ్యూనిటీ నాయకుడు, ఆసియా అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సలహాదారు అయిన అజయ్‌ జైన్‌ భుటోరియా అభిప్రాయపడ్డారు.  అయితే ఈ కార్యక్రమంలో లబ్ధి పొందడానికి దరఖాస్తుదారులు ఏదైనా అమెరికన్‌ వీసా ప్రోగామ్‌ కింద వీసా పొంది ఉండాలి. గతంలో వారి వీసా తిరస్కరణకు గురై ఉండకూడదు. అలాగే దరఖాస్తు చేసుకున్న దేశంలో స్థానికులై ఉండాలి. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్లు ఈ ఏడాదికి గాను 20వేలకు పైగా ఇంటర్వ్యూ మినహాయింపు దరఖాస్తులను విడుదల చేయనున్నాయని ఢిల్లీ ఎంబసీ ప్రకటించింది.


Updated Date - 2022-02-28T12:45:34+05:30 IST