పదో తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం.. సద్వినియోగం చేసుకోండి!

ABN , First Publish Date - 2021-11-30T17:20:22+05:30 IST

పదో తరగతి విద్యార్థులకు..

పదో తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం.. సద్వినియోగం చేసుకోండి!

ఎన్‌టీఎస్‌ఈ.. స్టడీ ఆసాంతం స్కాలర్‌షిప్‌


నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌టీఎస్‌ఈ) మొదటి దశ పరీక్ష 2022 జనవరి 15న జరుగుతోంది. ఈ టెస్ట్‌కు తెలంగాణలో మాత్రం ఫీజు చెల్లింపునకు డిసెంబర్‌ 2 వరకు గడువు పెంచారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను డిసెంబర్‌ 6 లోపు పంపుకోవాలి. ప్రధానంగా ఈ టెస్ట్‌లో విజయం సాధించి స్కాలర్‌షిప్‌ పొందితే కొన్ని నిబంధనలకు లోబడి డాక్టరేట్‌ పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. నిజానికి టెన్త్‌ చదువుతున్న పిల్లలకు ఇదో మంచి అవకాశం. 


దేశంలో నాణ్యమైన పాఠశాల విద్యను అందించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించే ఉద్దేశంతో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పాఠశాల విద్య మెరుగు కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. అలాంటి వాటిలో ఒకటి నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్ఈ). మొదట్లో దీన్ని నేషనల్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీమ్‌గా పిలిచేవారు. అందులో కేవలం సైన్స్‌ సంబంధ అంశాల నుంచి మాత్రమే ప్రశ్నలు ఇచ్చేవారు. అయితే 1976లో ఈ పరీక్షను ఎన్‌టీఎస్ఈగా మార్చారు. అదే సమయంలో సైన్స్‌తోపాటు అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పరీక్షించేలా పరీక్ష విధానంలో కూడా మార్పులు చేశారు. 


అర్హత

ప్రభ్వుత గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టెస్ట్‌ రాసేందుకు అర్హులు. కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సీబీఎస్ఈ, న్యూఢిల్లీలోని ఐసీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లోని విద్యార్థులు కూడా అర్హులే. 


ఎంపిక విధానం

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్‌-1 రాత పరీక్షను విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉన్న రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే స్టేజ్‌-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండో దశ పరీక్షకు విద్యార్థులను అర్హులను చేసేందుకు ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక కోటా ఉంటుంది. తుది దశ పరీక్ష పూర్తయిన తరవాత, స్కాలర్‌షిప్‌ అర్హుల ఎంపికకు మాత్రం ఎలాంటి కోటా ఉండదు. రెండు దశల్లోని రాత పరీక్షలను మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో నిర్వహిస్తారు.


స్టేజ్‌ -1(స్టేట్‌ లెవల్‌) పరీక్ష: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌), స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(సాట్‌). ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రాష్ట్రంలో పరీక్షను ఇంగ్లీ్‌ష/హిందీ/తెలుగు/ఉర్దూ మాధ్యమంలో రాయవచ్చు. మెంటల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. వీటికి కేటాయించిన మార్కులు 100. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో కూడా 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 120 నిమిషాలు కేటాయించారు. రెండు పరీక్షలను కూడా ఒకే రోజు ఉదయం(మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌), మధ్యాహ్నం(స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) సెషన్లుగా నిర్వహిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కులు లేవు. కాకపోతే రెండు పేపర్లలో నిర్దేశించిన విధంగా కనీస అర్హత మార్కులను సాధించాలి. ఈ క్రమంలో ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 32 శాతం, మిగతా వారు 40 శాతం మార్కులను ప్రతి పేపర్‌లో స్కోర్‌ చేయాలి. వీరిని మాత్రమే మెరిట్‌ లిస్ట్‌ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాట్‌, సాట్‌లలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తరవాతి దశకు ఎంపిక చేస్తారు. 


స్టేజ్‌ -2(నేషనల్‌ లెవల్‌) పరీక్ష: ఈ దశ పరీక్ష జాతీయ స్థాయిలో ఉంటుంది. పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (మ్యాట్‌); స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(సాట్‌). ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రాష్ట్రంలో పరీక్షను ఇంగ్లీష్‌/ హిందీ/ తెలుగు/ ఉర్దూ మాధ్యమంలో రాయవచ్చు. ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. ప్రశ్నపత్రాన్ని ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది. మైనస్‌ మార్కులు ఉండవు. మ్యాట్‌, సాట్‌లలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా స్కాలర్‌షిప్‌నకు అర్హులను ఎంపిక చేస్తారు.


సిలబస్‌

మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌)లో విద్యార్థుల రీజనింగ్‌ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఎనాలజీస్‌, క్లాసిఫికేషన్‌, సిరీస్‌, కోడింగ్‌ - డీ కోడింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(సాట్‌) విభాగంలో పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. 


స్కాలర్‌షిప్‌

ఈ పరీక్ష ద్వారా వెయ్యి మంది ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్మీడియెట్‌ రెండేళ్లలో నెలకు రూ.1,250 అందజేస్తారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు నెలకు రూ.2,000 ఇస్తారు. పీహెచ్‌డీలో చేరితే యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉపకారవేతనం మొత్తాన్ని నిర్ధారిస్తారు.


వెబ్‌సైట్‌: https://ncert.nic.in/national-talent-examination.php

తెలంగాణ: http//bse.telangana.gov.in

ఆంధ్రప్రదేశ్‌: https://www.bse.ap.gov.in/

Updated Date - 2021-11-30T17:20:22+05:30 IST