మంచి రాజకీయం రావాలి

ABN , First Publish Date - 2021-05-07T09:44:36+05:30 IST

రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే ఏమవుతుందో కరోనా విలయతాండవం మూలంగానైనా...

మంచి రాజకీయం రావాలి

రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే ఏమవుతుందో కరోనా విలయతాండవం మూలంగానైనా భారతీయులకు అవగతమై ఉండాలి. బాధ్యతలను విస్మరించి ప్రధానమంత్రికి అనుకూలంగా వ్యవహరించడం మూలంగా ఎన్నికల సంఘం మద్రాస్‌ హైకోర్ట్‌ ముందు దోషిగా నిలబడింది. ప్రజలు తన మీద ఉంచిన కర్తవ్యాల నిర్వహణ కన్నా రాజకీయ లక్ష్యాల సాధనే మిన్నగా భావించిన ప్రధానమంత్రి అంతర్జాతీయ సమాజం దృష్టిలో దోషిగా నిలబడ్డారు. 


ఒకప్పుడు రాజకీయాలు ఒక బాధ్యతగా పరిగణింపబడేవి. రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు ఎంతో కొంత త్యాగం చేయడానికి సంసిద్ధులయ్యేవారు. దేశ ప్రయోజనాల కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన నాయకులు మన దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎందరో ఉండేవారు. నేడు మాత్రం రాజకీయాలు ఒక వెంచర్‌ గానో, వృత్తిగానో పరిగణించబడుతున్నాయి. ఎవరో వస్తే మాత్రం మాకు ఒరిగేదేంటి అంటూ రాజకీయాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న నిర్లిప్తత, నైరాశ్యం వల్ల అసమర్థులు, దోపిడీదారులు అందలమెక్కుతున్నారు. 


బలవంతుడే బతకాలన్న ఆటవిక సూక్తికి అనుగుణంగా భారతదేశంలో సంపద కేంద్రీకరణ జరుగుతున్న తీరును, కరోనా మోగిస్తున్న మరణమృదంగ హోరును చూసైనా, మంచి రాజకీయం ఎంత అవసరమో ఇకనైనా ప్రజలు గుర్తించాలి. రాజకీయ నాయకులు పెట్టుబడిదారుల మీద ఆధారపడడమే రాజకీయాలు భ్రష్టుపట్టడానికి మరో ప్రధాన కారణం. రాజకీయ పార్టీలకు, పెట్టుబడిదారులకు మధ్యనున్న అనైతిక పొత్తును తెగ్గొట్టడానికి ప్రజలు కార్యోన్ముఖులు కావాలి. కలుషితమైన రాజకీయవ్యవస్థ ప్రక్షాళన కాకపోతే భవిష్యత్తు మరింత అంధకారమవుతుంది.

గౌరాబత్తిన కుమార్‌బాబు

Updated Date - 2021-05-07T09:44:36+05:30 IST