సప్లిమెంటరీలో మంచి ఫలితాలు తేవాలి

ABN , First Publish Date - 2022-07-01T06:16:30+05:30 IST

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరిలో మెరుగైన ఫలితాల కోసం ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు.

సప్లిమెంటరీలో మంచి ఫలితాలు తేవాలి

- ఇంటర్‌ అఽధికారులతో సమీక్షలో కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జూన్‌ 30 : ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరిలో మెరుగైన ఫలితాల కోసం ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో ఇంటర్‌ ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుక బడిన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ మాట్లాడాలన్నారు. అదేవిధంగా ప్రతీ వారం విద్యార్థులకు పరీక్ష లు నిర్వహించాలని సూచించారు. ఇంటర్‌ విద్యపై తాను ప్రతీనెల సమీక్షిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డీఐఈవో వెంకటేశ్వర్లు పాల్గోన్నారు.

వైద్య సేవలను వినియోగించుకోవాలి

దేవరకద్ర, జూన్‌ 30 : గ్రామాల్లో చేపడుతున్న ఉచిత పశువు వైద్య శిబిరాలను రైతులు విని యోగించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని బస్వాయ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు ప్రభుత్వం  అందిస్తున్న పథకాలను వినియోగించుకోవా లన్నారు. అదేవిధంగా హజీలాపూర్‌ గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, సర్పంచ్‌ సుజాత, కో-ఆప్షన్‌ ఖదీర్‌, పశువైద్యాధికారి జేషన్‌అలీ పాల్గొన్నారు.


ఇసుక అనుమతులు రద్దు చేయాలి

- కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి


మిడ్జిల్‌, జూన్‌ 30 : ఇసుక మాఫియా ఇసుకను అక్రమంగా తీస్తున్నా పట్టించుకోని అధికారులు రైతులపై కేసులు నమోదుచేస్తే సహించేది లేదని కాంగ్రెస్‌పార్టీ జడ్చర్ల నియోజవర్గ సమన్వయ కర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ శివారులోని దుందుభీవాగులో ఇసుక తవ్వకాలను రైతులతో కలిసి పరిశీలించారు. అమాయక రైతులపై అక్రమంగా కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తే సహించేదిలేదని, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యామాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ రామాంజనేయులు, ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్‌లు వాగువద్దకు చేరుకున్నారు.  తహసీల్దార్‌ శ్రీనివాస్‌ అక్కడి నుంచే మైనింగ్‌ ఏడీ విజయ్‌కుమార్‌కు ఫోన్‌చేసి అనిరుధ్‌రెడ్డితో మాట్లాడించారు. నాలుగున్నర ఫీట్లలోతు తీయాల్సి ఉండగా 8 అడుగుల లోతువరకు వాగులో ఇసుకను తవ్వుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని పై అధికారులకు నివేదించి తదుపరి చర్యలు చేపడతామని తహసీల్దార్‌ రైతులకు వివరించి వాగులోంచి ఎక్స్‌కవేటర్లను తీసేయించారు. అనంతరం ఎంపీపీ కాంతమ్మ అయ్యవారిపల్లి గ్రామ శివారులోని ఇసుక తరలింపును నిలిపివేయాలని తహసీల్దార్‌కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాంతమ్మతోపాటు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, ఎంపీటీసీ గౌస్‌, జిల్లా నాయకులు బాలస్వామి, సంపత్‌కుమార్‌, సాయులు రైతులు నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, కత్తాల్‌, శ్రీకాంత్‌, కృష్ణారెడ్డి, రాజుపంతులు, వెంకట్రాములు, రాములు, శివ, ప్రేమ్‌రాజ్‌, జంగయ్య, తిరుపతిరెడ్డి, రాములు, శ్రీశైలం ఉన్నారు. 


‘సామాన్యులది ఆమ్‌ ఆద్మీ పార్టీ’


పాలమూరు, జూన్‌ 30 : ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సామాన్యుల పార్టీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్‌ ఇందిరాశోభన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం కన్వీనర్‌ సి.బాబుల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటే నేడు కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుం టామని చెప్పి నేటికీ తీసుకోకపోవటం సరికాదన్నారు. కార్యక్రమంలో అంబరీష, వి.శ్రీనివాస, రాఘవరెడ్డి, ఎల్లప్ప, జనార్దన్‌, రాజు, చరణ్‌, గోపాల్‌, సతీష్‌రెడ్డి, శివరాం, శ్రీనివాసులు, ఇక్బాల్‌, చేవెళ్ల పార్లమెంట్‌ కన్వీనర్‌ కృష్ణలు పాల్గొన్నారు.


జిల్లా విద్యాశాఖాధికారిగా ఎ. రవీందర్‌ 


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 30  : మహబూ బ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖాధికారిగా డైట్‌ కళాశాల అధ్యాపకులు ఎ.రవీందర్‌ను నియమిస్తూ గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఇది వరకు డీఈవోగా పనిచేసిన ఉషారాణి జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతిపై ఐఏఎస్‌ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ  ఈనెల 24న ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో రవీందర్‌కు ఎఫ్‌ఏసీ డీఈవోగా బాధ్యతలు అప్పజెప్పారు. ఈయన వనపర్తి డీఈవోగా ఇప్పటికే కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉషారాణి రిలీవ్‌కానుండగా, రవీందర్‌ డీఈవో బాధ్యతలు చేపట్టనున్నారు.


సమస్యలపై కదం తొక్కిన వీఆర్‌ఏలు


దేవరకద్ర/ హన్వాడ/ గండీడ్‌/ అడ్డాకుల/ రాజాపూర్‌/ మూసాపేట, జూన్‌ 30 : జిల్లాలో రెవెన్యూ సహాయ ఉద్యోగులు (వీఆర్‌ఏలు) తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేశారు. నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు పే స్కేలు సీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన వీఆర్‌వోలకు ప్రమోషన్లు ఇవ్వాలని, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెన్షన్‌ సౌకర్యం కలిగించాలని, ఇతర పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిస్కరించాలని కోరుతూ గురువారం మండల కార్యాలయాల ఉందు ధర్నా చేశారు. దేవరకద్ర, హన్వాడ, గండీడ్‌, అడ్డాకుల, రాజాపూర్‌, మూసాపేట తదితర మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. తహసీల్దార్లకు సమస్యతో కూడిన వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - 2022-07-01T06:16:30+05:30 IST