ఆ మంచీ మర్యాద ఇప్పుడెక్కడున్నాయి?

Published: Wed, 26 Jan 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ మంచీ మర్యాద ఇప్పుడెక్కడున్నాయి?

భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు జరిగిన సమరం అపూర్వం, అమోఘం. యావత్ప్రపంచానికే ఆదర్శం. ఆ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించినవారు, పాలుపంచుకున్నవారిలో ఇంకా మనతో ఉన్నవారు బహు అరుదు. అలాంటి వారిలో కనగాల సరోజినీదేవి ఒకరు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 96 ఏళ్ల సరోజినీదేవి ‘నవ్య’తోపంచుకున్న జ్ఞాపకాలు... 


‘‘మా నాన్నగుత్తా చిననరసయ్య. అమ్మ లలితమ్మ. అప్పట్లో అందరూ పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టేవారు. కానీ మా నాన్నమాత్రం స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడుపై ఉన్న అభిమానంతో నాకు ఆమె పేరు పెట్టారు. మాది గుంటూరు జిల్లా గుత్తావారిపాలెం. ఊళ్లో మాది పెద్ద మేడ. మేం ఊరి నుంచి బయటకు వచ్చాక కూడా ఎప్పుడైనా వెళితే ‘మేడవారి అమ్మాయి వచ్చింది’ అనేవాళ్లు. మా వారు కనగాల శ్రీధర్‌రావు. కానీ అందరూ రోశయ్య అని పిలిచేవారు. ఆయన గుంటూరు సరస్వతీ ప్యాలెస్‌ మేనేజర్‌గా పని చేశారు. ఆ ప్యాలెస్‌ చల్లపల్లి జమీందారు గారిది. మా వారు, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యగారు, మాజీ సీఎం సంజీవరెడ్డిగారు మంచి మిత్రులు. మా అత్తగారి ఊరు చల్లపల్లి. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఏడుగురు అన్నదమ్ములం. నాన్న మా అందరికీ సంగీతం, నృత్యం నేర్పించారు. దేశం గురించి, నాటి సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కల్పించారు. 


స్వాతంత్య్ర సమరంలో మా ముగ్గురు అన్నయ్యలు, వదిన ఎన్నోమార్లు జైళ్లకు వెళ్లారు. దాంతో మా కుటుంబంలో ఎన్నో ఒడుదొడుకులు. ఆస్తిపాస్తులు పోయాయి. భూస్వాములుగా ఉన్నవాళ్లం పేదలుగా మారిపోయాం. కుట్టు పని చేస్తేనే పొట్టగడిచే స్థితికి చేరుకున్నాం. అయినా ఏనాడూ మేం బాధపడలేదు. అన్నయ్యలు జైలు నుంచి వస్తే ఇంట్లో పండుగలా ఉండేది. అప్పటికప్పుడు పొలంలో పండిన కూరగాయల్ని అమ్మేసి ఇంట్లోకి కావాల్సినవి తెచ్చేవాళ్లం. అన్నయ్యలు హేతువాదులు, నాస్తికులు. వారు కులాంతర వివాహాలు చేసుకున్నారు. మా అన్నయ్య గుత్తా రాధాకృష్ణ రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. కుటుంబ కష్టాల కారణంగా నేను ఐదో తరగతితో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆడపిల్లల్ని బడికి పంపేవారు కాదు.


కానీ మా అమ్మానాన్న ఆ మాత్రమైనా బడికి పంపించడం అప్పట్లో విశేషమే. పెద్దక్కయ్య రాజరత్నం మిషన్‌ కుట్టేది. నేనూ ఆమెనే అనుసరించాను. ఒకసారి సరదాగా ఓ జాకెట్‌ కుట్టాను. దాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత అందరూ నా వద్దకు రావడం మొదలైంది. ఫారిన్‌ వెళ్తూ నా వద్ద కుట్టించుకుని తీసుకెళ్లేవారు. ఆ రోజుల్లో టేప్‌లు లేవు. అలా మనిషిని చూసి వారి ఆకారాన్ని బట్టి కుట్టేసేదాన్ని. ఇప్పటికీ నా డ్రెస్సులు నేనే కుట్టుకుంటాను.   


బుర్రకథలు చెప్పి... పేదలకు సాయం

నేను, అక్కయ్యలు బుర్రకథ చెప్పేవాళ్లం. జమీందారులకు, బ్రిటిష్‌ వారికి, పేదల మధ్య జరిగే సంఘటనల గురించి, ‘కష్టజీవి’, ‘సుమతి’ లాంటి కథలూ చెప్పేవాళ్లం. వచ్చినదానిలో ఎక్కువ మొత్తం పేదలకు ఇచ్చేవాళ్లం. అప్పుడు దేశంలో ఏదో సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో ‘ప్రజలకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది కదా’ అని బుర్రకథలతో డబ్బు సేకరించి పంపేవాళ్లం. స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలిపే పుస్తకాలు మా అన్నయ్యలు చదివేవారు. అవి మేమూ చదివేవాళ్లం. నేతాజీ వంటి వారి జీవిత స్ఫూర్తితోనే మేము బుర్రకథలు చెప్పాం. ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్ననాటికి నేను చిన్నదాన్ని. కానీ అప్పుడు కూడా మేము దేశభక్తి గీతాలు ఆలపిస్తూ తిరిగినట్లు గుర్తు. అప్పట్లో ఖద్దరు తప్ప మరేమీ ధరించేవారు కాదు. మా పెళ్లిలోనూ ఖద్దరు దుస్తులే ధరించాం. తెల్లోళ్ల వస్త్రాలు మనం కట్టడమేమిటని మా అన్నలు ఒప్పుకునేవాళ్లు కాదు. ఒకసారి మా నాన్నగారు మా తోటలో కాసిన మామిడిపండ్లు బ్రిటిష్‌ వారికి పంపించారట. అవి పెద్ద పెద్ద పండ్లు కావడం, మంచి రుచిగా ఉండడంతో మెచ్చుకున్న బ్రిటిష్‌ దొరలు మా ఇంటికి గుర్రాలపై వచ్చారట. దాంతో ఊరు ఊరంతా భయపడిపోయి చూసిందట. మా నాన్నగారు కూడా గాంధీగారిలానే చొక్కా ధరించేవారు కాదు. ఆయన చొక్కాలేకుండా, చేత కర్రబట్టి రోడ్డున వెళ్తుంటే ఊరివాళ్లు గౌరవంగా పక్కకు తప్పుకొని నమస్కారాలు పెట్టేవాళ్లు. 


గాంధీని చూడ్డానికి వడ్లు అమ్మేశాం 

ఒకానొక దశలో మా అమ్మకు మంచి చీర కూడా ఉండేది కాదు. ఒకసారి బెజవాడకు గాంధీగారు వస్తున్నారని తెలిసింది. ఆయనను ఎలాగైనా చూడాలని మేమంతా అనుకున్నాం. కానీ అమ్మను అలా తీసుకెళ్లలేం కదా! ఏం చేయాలో అర్థంగాక ఎవరివో రెండు బస్తాల వడ్లు తీసుకుని అమ్మేశాం. ఆ వచ్చిన డబ్బుతో అమ్మకు ఖద్దరు చీర కొన్నాం.బెజవాడ వెళ్లి, గాంధీగారిని చూశాం. ఆయనను చూస్తే మా అందరికీ దేవుణ్ణి చూసినట్లే అనిపించింది. ఆ తరువాత చాలామంది నేతల్ని చూశాం. కానీ గాంధీగారిని దర్శించడం మాకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చింది. అన్నయ్యలు జైలుకు వెళ్లారని అమ్మ రేయింబవళ్లు ఏడుస్తుండేది. వాళ్లు జైల్లో కింద పడుకుంటారని అమ్మ కూడా ఇంట్లో కటికనేలపై పడుకునేది. సరిగ్గా భోజనం చేసేది కాదు.. అయినా ఏనాడూ ఆమె అన్నయ్యలను వారించలేదు. దేశం కోసం వాళ్లు పోరాడుతుంటే అమ్మ కూడా తన వంతు సహకారం అందించేది. అప్పట్లో దేశం కోసం ఎంతోమంది కమ్యూనిస్టులూ ప్రాణాలు వదిలారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవన్నీ చూసి పెద్దక్కయ్య రాజరత్నం చలించిపోయింది. తన రెండెకరాల పొలాన్ని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుతో విజయవాడలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేసింది. చాలామందికి కుట్టుమిషన్లు కొనిచ్చి, టైలరింగ్‌ నేర్పింది. ఎంతోమందికి తిండీ, దుస్తులు ఇచ్చి కాపాడింది. 


అంతకు మించిన ఆస్తి లేదు...

ప్రస్తుతం చెన్నై శివార్లలో నా కుమార్తె లలితా రాంబాబు దగ్గర ఉంటున్నాను. నా దినచర్య ఒకే విధంగా వుంటుంది. ప్రతిరోజూ వేకువజామున 4 గంటలకు నిద్ర లేస్తాను. ఇల్లు, వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తాను. కాలకృత్యాలు, స్నానపానాదులు అయ్యాక గంటపాటు యోగా, ఒక గంట ధ్యానం చేస్తాను. తోటలో పూలు తీసుకొచ్చి పూజ చేస్తాను. ఆ తరువాతే ఏ పనైనా! ఉదయం లేవగానే నాలుగు గ్లాసుల నీటిలో తులసి ఆకు వేసి, మరిగించి, అందులో నిమ్మకాయ రసం కలుపుకొని తాగుతాను. ఆ తరువాత ఉదయం 11 గంటల ప్రాంతంలో గోధుమలు, ఆకు కూర వేసి అన్నం వండుకుంటాను. బొప్పాయి కాయ సన్నగా తరిగి కూర వండుతాను. లేదా బొప్పాయి పండు తింటాను. మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు పాలు తాగుతాను. మధ్యలో నువ్వుల ఉండలు రెండు మూడు తీసుకుంటాను. రోజులో నా ఆహారం ఇదే. పరిమితమైన ఆహారం శరీరానికి మంచిది. మధ్యాహ్నం కొంతసేపు మహాభారతం, రామాయణం లాంటివి చదువుకుంటాను. యోగాతో ఆరోగ్యం ఎంతో బావుంటుంది. పరిమితమైన, పుష్టికరమైన ఆహారం తీసుకుంటే చాలు. మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. 


దేశ సేవకు ప్రతిఫలం కోరుకోలేదు... 

స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పింఛన్‌ను మా ఇద్దరు అన్నయ్యలు తిరస్కరించారు. నేను కూడా వారినే అనుసరించాను. నా దేశం కోసం నేను చేసిన దానికి ప్రతిఫలం తీసుకోవడం ఇష్టం లేకపోయింది. స్వాతంత్య్రం వచ్చేనాటి కాలానికి, ఇప్పటికీ ఎంతో తేడా వుంది. అప్పట్లో ఇలాంటి మోసాలు, అక్రమాలు లేవు. ఇప్పుడు ఆ మంచీ, మర్యాద, ధర్మం ఎక్కడున్నాయి? అన్నయ్యలు అప్పట్లో మా ఊళ్లో సంస్కృత పాఠశాల పెట్టించారు. ఎక్కడెక్కడి నుంచో ఉపాధ్యాయులు వచ్చి పాఠాలు చెప్పివెళ్లేవారు. అందుకు ఎంతో కొంత ఇచ్చేవారు. జనం నుంచి కూడా డబ్బు వసూలు చేసేవారు. ఆ బడి కాలగర్భంలో పోయింది. పేద పిల్లలు చదువుకునేందుకు అనువుగా నాకూ ఓ బడి పెట్టాలని వుంది. అది నెరవేరుతుందో లేదో తెలీదు.’’


అన్నయ్యలు జైలుకు వెళ్లారని అమ్మ రేయింబవళ్లు ఏడుస్తుండేది. వాళ్లు జైల్లో కింద పడుకుంటారని అమ్మ కూడా ఇంట్లో కటికనేలపై పడుకునేది. సరిగ్గా భోజనం చేసేది కాదు. అయినా ఏనాడూ ఆమె 

అన్నయ్యలను వారించలేదు. ఆ మంచీ మర్యాద ఇప్పుడెక్కడున్నాయి?

ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాం... 

ఆస్తిపాస్తులన్నీ పోవడంతో బతకడం కోసం మా అన్నయ్యలు మద్రాసు దగ్గర్లో వున్న ఆవడి ప్రాంతానికి వచ్చేశారు. గాంధీగారు చనిపోయిన రోజు నేనూ మా అన్నయ్యల దగ్గర ఉన్నాను. ఆ వార్త రేడియోలో విని, రోజంతా ఏడుస్తూ ఉండిపోయాం. ఇప్పుడు మేము ఉంటున్నది ఒకప్పడు అటవీప్రాంతం. కానీ మా చిన్నన్నయ్య శ్రీనివాసరావు రూ.200 పెట్టి ఇక్కడ భూమి కొని, వ్యవసాయం చేశాడు. ఈ ప్రాంతానికి ‘పుష్పగిరి’ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎంతోమంది సినిమావాళ్లు ఇక్కడ ఫాంహౌ్‌సలు కట్టుకుని సేద తీరుతున్నారు. మా పూదోటలో ఎన్నో సినిమాల షూటింగ్‌లు జరిగేవి. ఎన్టీఆర్‌ గారు కూడా ఈ చుట్టుపక్కల షూటింగులు చేశారు. మా అన్నయ్యల గురించి ఆయనకు బాగా తెలుసు. ‘దేశానికి మీరు చేసిన సేవతో పోల్చుకుంటే మేమెంత’ అనేవారు. షూటింగ్‌లకు వచ్చినప్పుడు ఆయన చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. ఇక మా మా పెద్దమ్మాయి ప్రమీలారాణిచాలా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేసింది. 


  డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

ఫొటోలు: కర్రి శ్రీనివాస్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.