దాంపత్య జీవితానికి మరో బిలియనీర్ గుడ్‌బై.. విడాకుల కోసం Sergey Brin దరఖాస్తు

ABN , First Publish Date - 2022-06-21T02:26:53+05:30 IST

సెర్చింజన్ దిగ్గజం గూగుల్(Google) సహ-వ్యవస్థాపకుడు, ప్రపంచ 6వ సంపన్న వ్యక్తి సెర్గీ బ్రిన్(Sergey Brin) తన వైవాహిక జీవితానికి ముగింపు పలకాలనుకుంటున్నారు. మూడేళ్లుగా

దాంపత్య జీవితానికి మరో బిలియనీర్ గుడ్‌బై.. విడాకుల కోసం Sergey Brin దరఖాస్తు

కాలిఫోర్నియా : సెర్చింజన్ దిగ్గజం గూగుల్(Google) సహ-వ్యవస్థాపకుడు, ప్రపంచంలో 6వ సంపన్న వ్యక్తి సెర్గీ బ్రిన్(Sergey Brin) తన వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారు. మూడేళ్లుగా దాంపత్య జీవితం పంచుకుంటున్న భార్య నికోలే షనాహన్‌(Nicole Shanahan) నుంచి విడాకులు(Divorce) కోరుతూ దరఖాస్తు చేశారు. నికోలే షనాహన్‌తో తన వివాహాన్ని రద్దు చేయాలని పేర్కొంటూ ఈ నెలలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి మధ్య సమన్వయం సాధ్యపడని విబేధాలు ఉన్నాయని సెర్గీ బ్రిన్  పేర్కొన్నట్టు కోర్ట్ డాక్యుమెంట్ల ద్వారా బహిర్గతమైంది. అయితే బహిష్కృతమైన విడాకుల విషయాన్ని రహస్యంగా ఉంచాలని, కోర్ట్ పత్రాలకు సీల్ వేయాలని కోర్టుకి సెర్గీ విజ్ఞప్తి చేశారు. అయితే సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులు కావడంతో ఈ కేసుపై జనాల్లో ఆసక్తి నెలకొందని కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కోర్ట్ సెర్గీకి తెలిపింది. కాగా సెర్గీ బ్రిన్ దంపతులకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. 


సెర్గీ బ్రిన్ ఇదివరకు 23అండ్‌మీ సహ-వ్యవస్థాపకురాలు అన్నె వొజ్కీకీని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 2015లో విడాకులైంది. కాగా ఇటివల విడాకుల తీసుకున్న బిలియనీర్లు బిల్‌గేట్స్-మిలిందా గేట్స్, అంతకు మూడేళ్ల క్రితం విడిపోయిన జెఫ్ బెజోస్-మెకంజీ స్కాట్‌ల జాబితాలో సెర్గీ బ్రిన్-నికోలే షనాహన్‌ చేరబోతున్నారు. గేట్స్ దంపతులు విడిపోయినప్పుడు 145 బిలియన్ డాలర్లు పంచుకున్నారు. ఇక బెజోస్-స్కాట్ 137 బిలియన్ డాలర్లలో కొంత వాటాను పంచుకున్న విషయం తెలిసిందే.


కాగా 48 ఏళ్ల బ్రిన్ ఆస్తుల విలువ 94 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7,32,260 కోట్లు)గా ఉందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఇందులో అత్యధికం గూగు‌ల్‌లో తన హోల్డింగ్ ద్వారానే వచ్చింది. లారీ పేజ్‌తో కలిసి 1998లో గూగుల్‌ కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత హోల్డింగ్ కంపెనీ ‘అల్ఫాబెట్’ను ఏర్పాటు చేశారు. అయితే 2019లో ఇద్దరూ అల్ఫాబెట్‌ నుంచి నిష్ర్కమించారు. అయినప్పటికీ బోర్డు సభ్యులుగా ఉంటారు. నియంత్రిత షేర్ హోల్డర్లగానే కొనసాగుతున్నారు.

Updated Date - 2022-06-21T02:26:53+05:30 IST