Google doodle: ప్రముఖ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్‌ ఆవిష్కరణలను గుర్తు చేస్తూ డూడుల్..!

ABN , First Publish Date - 2022-06-04T22:42:59+05:30 IST

వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి చరిత్రలో సుస్తిరస్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తులకు గూగుల్ తన డూడుల్స్‌తో నివాళులు అర్పిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిందే..! తాజాగా ప్రముఖ భారత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌ బోస్‌ను

Google doodle: ప్రముఖ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్‌ ఆవిష్కరణలను గుర్తు చేస్తూ డూడుల్..!

ఇంటర్నెట్ డెస్క్: వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి చరిత్రలో సుస్తిరస్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తులకు గూగుల్ తన డూడుల్స్‌తో నివాళులు అర్పిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిందే..! తాజాగా  ప్రముఖ భారత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌ బోస్‌ ఆవిష్కరణలను గుర్తు చేసుకుంటూ గూగుల్ ఓ డూడుల్‌ను రూపొందించింది. 1924లో సరిగ్గా ఇదే రోజున(జూన్ 4) బోస్.. క్వాంటమ్ మెకానిక్స్ శాస్త్రానికి సంబంధించి తాను రూపొందించిన కొన్ని ఫార్ములాలను ప్రముఖ ఫిజిక్స్ శాస్త్రవేత్త ఐన్‌స్టిన్‌కు పంపించారు. ఈ అపూర్వ సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బోస్ తన పరిశోధనశాలలో ప్రయోగం చేస్తున్నట్టు ఉన్న డూడుల్‌ను గూగుల్ విడుదల చేసింది. 


ఇక.. బోస్ పంపిన పరిశోధనను చూసిన వెంటనే ఐన్‌స్టీన్ దాన్నో అద్భుత ఆవిష్కరణగా భావించారు. ఆ తరువాత.. బోస్, ఐన్‌స్టీన్ ఇద్దరూ కాంతి తరంగాలకున్న వాయు లక్షణాలను వివరిస్తూ కొన్ని సిద్ధాంతాలను రూపొందించారు. కాలక్రమంలో అవి..బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్‌టిక్స్‌గా ప్రాచుర్యం పొందాయి. 


1920ల్లో క్వాంటమ్ మెకానిక్స్‌లో బోస్ విస్తృత పరిశోధనలు జరిపారు. ఆయన బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలో కూడా!  1954లో కేంద్ర ప్రభుత్వం బోస్‌ను పద్మవిభూషన్‌తో సత్కరించింది.  కోల్‌కతాలో 1894 జనవరి 1న జన్మించిన బోస్.. అనేక రంగాల్లో అద్భుత ప్రావీణ్యం సంపాదించారు. భౌతికశాస్త్రమే కాకుండా.. గణితం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, ఫిలాసఫీ, మినరలాజీ, కళలు, సాహిత్యం, సంగీతం పట్ల ఆయన అమితమైన ఆసక్తి కనబరిచేవారు. బోస్ తండ్రి ఓ అకౌంటెంట్. ప్రతి రోజు ఆయన బోస్‌కు గణితానికి సంబంధించి ఓ ప్రశ్న ఇచ్చేవారు. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో బోస్‌కు గణితంపై ఆసక్తి పెరిగింది. 15 ఏళ్ల వయసులో బోస్.. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో చేరారు. ఆ తరువాత.. యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1917 చివరి నాటికి ఆయన విద్యార్థులకు భౌతిక శాస్త్ర అధ్యాపకుడయ్యారు. ఇక బోస్ స్టాటిస్‌టిక్స్ ఆధారంగానే... దైవకణంగా పేరుపడ్డ హిగ్స్‌బోసాన్ ఆవిష్కరణ జరిగింది. సృష్టిరహస్యాలను ఛేదించేందుకు రూపొందించిన పార్టికల్ యాక్సెలరేటర్ నిర్మాణం వెనుకా బోస్ స్టాటిస్‌టిక్స్ సిద్ధాంతాలు ఉన్నాయి.



Updated Date - 2022-06-04T22:42:59+05:30 IST