గోపాలమిత్రల గోడు పట్టదా?

ABN , First Publish Date - 2022-07-06T06:24:23+05:30 IST

పశుసంపద ఉన్న రైతులకు సేవలందించే గోపాలమిత్రలకు నెలనెలా వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చేదే అరకొర అయినా, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. అధికారులను అడిగి తే బడ్జెట్‌ లేదనే సమాధానం వస్తోందని,నెలనెలా వేతనం రాకపోవడంతో కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందని గోపాలమిత్ర లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోపాలమిత్రల గోడు పట్టదా?
మోత్కూరులో వైద్యం చేసేందుకు వెళ్తున్న గోపాలమిత్ర సత్యనారాయణ

ఐదు నెలలుగా అందని వేతనాలు

టార్గెట్‌ ప్రాతిపదికన వేతనం

చేసేది పశు వైద్యమే.. పశుసంవర్ధకశాఖతో సంబంధం ఉండదు


మోత్కూరు :  పశుసంపద ఉన్న రైతులకు సేవలందించే గోపాలమిత్రలకు నెలనెలా వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చేదే అరకొర అయినా, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. అధికారులను అడిగి తే బడ్జెట్‌ లేదనే సమాధానం వస్తోందని,నెలనెలా వేతనం రాకపోవడంతో కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందని గోపాలమిత్ర లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో వేతనం పెరగకపోదా, పశుసంవర్ధకశాఖలో అటెండర్‌గానైనా అవకాశం కల్పించకపోతారా అనే ఆశతో తక్కు వ వేతనంతో రెండు దశాబ్దాలుగా గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. రైతుల వ్యవసాయ బా వుల వద్దకు వెళ్లి సేవలందిస్తున్న వీరికి బీమా, 20ఏళ్లుగా పనిచేస్తున్నా పీఎఫ్‌ సౌకర్యం లేదు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 248 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. జిల్లాలో 64మంది,నల్లగొండ జిల్లాలో 108 మంది, సూర్యాపేట జిల్లాలో 76 మంది సేవలందిస్తున్నారు. గోపాలమిత్ర లు పాడి గేదెలు, ఆవులు ఎదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణకు వాటికి సెమెన్‌ (ఏఐ) ఎక్కిస్తారు. అందుకు ఒక్కో గోపాలమిత్రకు ఐదారు గ్రామాలు కేటాయించారు. తొలుత ఏఐ సేవలు మాత్రమే అందించే వీరు, పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత కారణంగా పశువులు, గొర్రెలు, మేకలకు వచ్చే జబ్బులకు కూడా పశువైద్యుల సూచనల మేరకు చికిత్స కూడా అందిస్తున్నారు. జీవా ల్లో సీజనల్‌ వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్‌, నట్టల నివారణ మందు తాగించడం లాంటివి కూడా వీరే చేస్తున్నారు. గతంలో గోపాలమిత్రలకు నెలకు రూ.1200 వేతనం ఉండగా, ఆతర్వాత రూ.2,500వేతనం ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు వేతనాన్ని రూ.3,500కు ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం వీరి వేతనాన్ని ప్రభుత్వం రూ.8,500 చేసింది.


టార్గెట్‌ ప్రాతిపదికన వేతనం

ప్రభుత్వం వేతనం పెంచినా టార్గెట్‌ ప్రాతిపదికన ఇస్తోంది. ఒక్కో గోపాలమిత్ర సీజన్‌ను బట్టి నెలకు 50నుంచి150 వరకు ఏఐ సేవలు అందించాలి. ఏఐ చేసిన చోట రైతు నుంచి వీరు రూ.130 వసూలు చేసి, అందులో రూ.40 చొప్పున ప్రభుత్వానికి జమచేయాలి. వీరికి రూ.90 మిగులుతున్నా, రైతుల వద్దకు వెళ్లి వచ్చేందుకు వీరికి సగటున రోజుకు రూ.200 పెట్రోల్‌ ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం ఏఐ కేసులు రావడం లేదు. టార్గెట్‌ పూర్తిచేయకపోతే వేతనం రాదని వారు సొంతంగా ప్రభుత్వానికి డబ్బు జమచేస్తున్నారు. రైతులు కొందరు రూ.130కి తక్కువ ఇచ్చి నా తీసుకోవాల్సి వస్తోందని,నాణ్యమైన వీర్యం సరఫరా కానప్పుడు గర్భం నిలవకపోతే రైతులు డబ్బు ఇవ్వకపోగా, వారి దూషణలను వినాల్సి వస్తోందని గోపాలమిత్రలు చెబుతున్నారు.


ఐదు నెలలుగా అందని వేతనం

ప్రభుత్వం గోపాలమిత్రలకు ఇచ్చేది తక్కువ వేతనం అయినా, గత ఫిబ్రవరి నెల నుంచి రావడం లేదు. ఐదు మాసాలుగా వేతనాలు లేకపోవడంతో పూటగడవడం లేదని, పిల్లలను మంచి పాఠశాలు, కళాశాలల్లో చేర్పించి చదివించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గోపాలమిత్రలు చేసేది పశువైద్యమే అయినా వారికి పశుసంవర్ధకశాఖతో సంబంధం ఉండటం లేదు. వీరు ఆల్డా పరిధిలో ఉన్నారు. ఏఐ కేసులకు సంబంధించిన డబ్బు వారు నెలనెలా ఆల్డా సంస్థకు చెల్లిస్తున్నా, ఆల్డాకు ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ వచ్చినప్పుడే వీరికి వేతనాలు విడుదల చేస్తున్నారు. దీంతో ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియడం లేదు.


టార్గెట్‌ విధానం తొలగించాలి : సత్యనారాయణ, గోపాలమిత్ర, మోత్కూరు

గోపాలమిత్రగా 13 ఏళ్లుగా పనిచేస్తున్నా. గత ఫిబ్రవరి నుంచి వేతనం రాలేదు. నాకంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారూ ఉన్నారు. వెటర్నరీ డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు జీవాలకు చికిత్స కూడా అందిస్తున్నాం. నెలకు రూ.8500 వేతనం ఇస్తున్నా, కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వం వేతనం పెంచి టార్గెట్‌ విధానాన్ని తెచ్చింది. ఈ విధానాన్ని తొలగించాలి. పశుసంవర్ధకశాఖలో అటెండర్‌, వీఏ పోస్టులు భర్తీలో పాధాన్యం ఇవ్వాలి.


Updated Date - 2022-07-06T06:24:23+05:30 IST