గోరఖ్‌నాథ్ మఠం వద్ద దాడి నిందితుని విచారణ లక్నోలో

ABN , First Publish Date - 2022-04-06T20:50:56+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద దాడి కేసులో నిందితుడు ముర్తజాను

గోరఖ్‌నాథ్ మఠం వద్ద దాడి నిందితుని విచారణ లక్నోలో

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద దాడి కేసులో నిందితుడు ముర్తజాను విచారించేందుకు లక్నో తరలించారు. అంతకుముందు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను తదుపరి దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. ముర్తజాను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) బుధవారం లక్నోకు తీసుకెళ్ళింది. 


యూపీ ఏటీఎస్ సోమవారం ముంబైలో దర్యాప్తు చేసింది. నిందితుడు ముర్తజా మూడేళ్ళ నుంచి తన కుటుంబ సభ్యులను కలవలేదని వెల్లడైంది. ముర్తజా అంతకుముందు తన కుటుంబంతో కలిసి నివసించిన నవీ ముంబైకి మంగళవారం వెళ్లింది. 


ముర్తజా తండ్రి మునీర్ అహ్మద్ అబ్బాసీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన కుమారుడు బాల్యం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని చెప్పారు. ఆయన మానసిక పరిస్థితి బాగులేదని, నేరం చేయాలనే ప్రణాళిక అతనికి లేదని చెప్పారు. గతంలో అతనికి వైద్య చికిత్స చేయించినట్లు తెలిపారు. కొన్ని పరిణామాల వల్ల పోలీసులు తన వెంటపడుతున్నట్లు ఆయన భావించేవాడన్నారు. 


యూపీ పోలీసుల కథనం ప్రకారం, గోరఖ్‌పూర్ నివాసి అహ్మద్ ముర్తజా అబ్బాసీ ఆదివారం గోరఖ్‌నాథ్ మఠం వద్దకు ఓ పెద్ద కత్తితో వచ్చి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. బలవంతంగా గోరఖ్‌నాథ్ దేవాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ముర్తజాను అరెస్టు చేశారు. దర్యాప్తు బాధ్యతలను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించారు.  ముర్తజా ఐఐటీ ముంబైలో కెమికల్ ఇంజినీరింగ్ చేసినట్లు తెలుస్తోంది. కోర్టు సోమవారం నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించింది. 


Updated Date - 2022-04-06T20:50:56+05:30 IST