గోరంత అనుమతి.. కొండంత తవ్వకం

ABN , First Publish Date - 2022-05-20T05:50:49+05:30 IST

‘కుక్కపిల్ల.. సబ్బుబిల్ల. అగ్గిపుల్ల.. కాదేదీ కవితకు అనర్హం’ అని శ్రీశ్రీ చెప్పిన మాటలను అన్నమయ్య జిల్లాలో అక్రమార్కులు బాగా వంటబట్టించుకున్నట్లున్నారు. ఇసుక, మట్టి కాదేదీ అక్రమ రవాణాకు అతీతం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. గోరంత అనుమతులు పెట్టుకుని.. కొండంతా తవ్వుకుంటూ.. రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు ఓ వైపు అధికార ఒత్తిడికి తలొగ్గి.. మరోవైపు కాసుల తూకానికి పూర్తిగా లొంగిపోయి తలాడిస్తున్నారు. ఫలితంగా కొందరు అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా రేయింబళ్లు టిప్పర్లతో మట్టిని తోలేస్తున్నారు.

గోరంత అనుమతి.. కొండంత తవ్వకం
మదనపల్లెలో మట్టితవ్వకాల కోసం.. ప్రత్యేకంగా రోడ్డును తయారు చేసిన దృశ్యం

చెలరేగిపోతున్న మట్టి మాఫియా  

యథేచ్ఛగా అక్రమ రవాణా    

రోజుకు రూ.లక్షల్లో ఆదాయం 

రాయచోటి, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘కుక్కపిల్ల.. సబ్బుబిల్ల. అగ్గిపుల్ల.. కాదేదీ కవితకు అనర్హం’ అని శ్రీశ్రీ  చెప్పిన మాటలను అన్నమయ్య జిల్లాలో అక్రమార్కులు బాగా వంటబట్టించుకున్నట్లున్నారు. ఇసుక, మట్టి కాదేదీ అక్రమ రవాణాకు అతీతం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. గోరంత అనుమతులు పెట్టుకుని.. కొండంతా  తవ్వుకుంటూ.. రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు ఓ వైపు అధికార ఒత్తిడికి తలొగ్గి.. మరోవైపు కాసుల తూకానికి పూర్తిగా లొంగిపోయి తలాడిస్తున్నారు. ఫలితంగా కొందరు అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా రేయింబళ్లు టిప్పర్లతో మట్టిని తోలేస్తున్నారు. పంచాయతీలకు పన్ను (రాయల్టీ) ఎగ్గొడుతున్నారు. జిల్లాలో కోరలు చాచిన మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక కథనం.


గరుగుమట్టికి భలే గిరాకీ.. 

సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చదును చేసేందుకు, భవన నిర్మాణాలు, ఇతరా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల పునాదులు పూడ్చేందుకు గరుగుమట్టిని (గ్రావెల్‌) వినియోగిస్తారు. గరుగుమట్టితో పాటు ఎర్రమట్టికి కూడా విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఈ ఎర్రమట్టి కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది. ఎక్కువగా ఈ మట్టిని పునాదులు పూడ్చేందుకు వాడతారు. రాయచోటి పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో చదును చేయడానికి గరుగుమట్టి, ఎర్రమట్టిని వాడతారు. దీంతో వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా చెరువులు, కుంటల నుంచి బంక, ఒం డ్రుమట్టిని తరలిస్తారు. ఈ మట్టిని ఇటుకల తయారీకి వినియోగిస్తారు. గరుగుమట్టి టిప్పర్‌ రూ.3000, ఒండ్రుమట్టి రూ.2500, ఎర్రమట్టి రూ.5000 ధర పలుకుతోంది. ఈ మట్టిని తరలించడానికి గనులు, భూగ ర్భ శాఖ అనుమతి తప్పని సరి. ఇందు కోసం క్యూబిక్‌ మీటర్‌ చొప్పున ప్రభుత్వానికి చలానా చెల్లించాలి. కానీ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కడో ఒకటో, రెండో తీసుకున్నా.. ఆ ముసుగులో వందల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. అనుమతులు లేకుండానే.. యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అన్నమయ్య జిల్లా గనులు, భూగర్భ శాఖ అదనపు సంచాలకులు తెలిపిన ప్రకారం.. రాయచోటి ప్రాంతంలో ముగ్గురికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. రామాపురం మండలం, రాయచోటి మండలంలో అనుమతిచ్చిన చోట నుంచే మట్టిని తరలించాలి. అయితే రాయచోటి పట్టణంలో రోజూ వందల సంఖ్యలో ట్రిప్పర్ల మట్టిని తరలిస్తున్నాయి. స్వయంగా ఈ మట్టి తరలింపులో అధికార పార్టీ నాయకులు, వాళ్ల అనుచరులే ఉండడంతో.. అటు గనులు భూగర్భ శాఖ అధికారులు, ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు ఎవరూ మట్టి తరలింపు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాయచోటి శిబ్యాల పెద్ద చెరువులో అనుమతులు లేకున్నా..పెద్ద పెద్ద గుంతలు చేసి మట్టిని తరలించారు. రాయచోటి మండలం వరిగె మార్గంలో గరుగుమట్టి కోసం గుట్టలను తవ్వేశారు. ఇప్పుడు పెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. రామాపురం మండలంలో నుంచి అనుమతి తీసుకుని.. నిబంధనలకు విరుద్ధంగా మీటర్‌ కంటే ఎక్కువగానే మట్టిని తవ్వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే సంబేపల్లె మండలంలో  జిమ్మికుంట, సంబేపల్లె చెరువులో అనుమతులు లేకుండా పెద్ద గుంతలు తవ్వి మట్టిని తరలించారు. అనంతరం భారీ నీటిపారుదల శాఖ అదికారులు, రెవెన్యూ అధికారులు ఆ చెరువు, కుంటలను సందర్శించి ఇంక మట్టి తోలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మట్టి అక్రమార్కుల దెబ్బకు చిన్న, చిన్న గుట్టలు కనుమరుగైపోతున్నాయి. మదనపల్లె ప్రాంతంలో గుట్టల్లో నుంచి మట్టిని తరలించేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. మదనపల్లె పట్టణంలో 5 ముఠాలు మట్టి తరలింపులో బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడమట్టిని తోలడానికి అనుమతి తీసుకుంటే లోడు ఒక రేటు, అనుమతి లేకుండా అయితే ఇంకో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అనుమతులు పేరుతో.. రెవెన్యూ అధికారులకు లంచాలు ఇవ్వాలి అనే పేరుతో ట్రిప్పర్‌ ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రవాణా చార్జీలు కూడా కస్టమర్ల దగ్గరే వసూలు చేస్తున్నట్లు సమాచారం. పీలేరు పరిసరాలల్లో మట్టి అక్రమ రవాణాదారుల వల్ల గుట్టలు కరిగిపోయి.. రూపురేఖలే మారిపోయాయని చెప్పవచ్చు. 


అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా..

అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులకు ఈ మట్టి అక్రమ రవాణా ముఖ్య ఆదాయవనరుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రాయచోటి ప్రాంతంలో మట్టిని అక్రమంగా తరలిస్తూ.. రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఆదాయం సంపాదిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యప్రజాప్రతినిధి సిపార్సుతోనే.. గనులు, భూగర్భ శాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాయచోటి పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మట్టి తవ్వకాలకు అనువైన ప్రాంతం కోసం పలువురు వెతుకులాడినట్లు తెలిసింది. అదే సమయంలో కొందరు అధికార పార్టీ నాయకులు తమను అడిగేవారెవ్వరు ? అన్నట్లు అనుమతులు లేకుండానే.. మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా  గనులు భూగర్భ శాఖ అధికారులు, రెవెన్యూ పోలీసు అధికారులు స్పందించి.. మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


అడ్డుకోవాల్సింది రెవెన్యూ వారే.. 

మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సింది రెవెన్యూ శాఖ వారే. మా శాఖలో సిబ్బంది తక్కువ మంది ఉంటారు. అన్ని మండలాల్లో రవాణా తిరగకుండా పర్యవేక్షించడం అంత సులభం కాదు. అదే రెవెన్యూ శాఖలో వీఆర్‌ఓ స్థాయి నుంచి సిబ్బంది ఉన్నందున మట్టి రవాణాను అడ్డుకోవడం సులభం. 

- వెంకటేశ్వర్‌రెడ్డి, గనుల భూగర్భశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ 


Updated Date - 2022-05-20T05:50:49+05:30 IST