AP: ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయి: గోరంట్ల

ABN , First Publish Date - 2022-04-19T20:12:13+05:30 IST

నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది పాలకుడు కావడంతో ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయని...

AP: ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయి: గోరంట్ల

అమరావతి: నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది పాలకుడు కావడంతో ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు, ఆర్థికాంశాలు ముడిపెడితే మిగిలేది సంక్షోభమేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. సంక్షేమం పేరుతో చేస్తున్న అప్పులతో  ఏపీ దివాళా అంచులకు చేరిందన్నారు. ఇప్పటి వరకు ఏపీపై ఉన్న మొత్తం అప్పు రూ. 7.76 లక్షల కోట్లు అన్నారు. అంతసొమ్ము దేనికి ఖర్చుపెట్టారంటే పాలకులవద్ద సమాధానంలేదన్నారు. శ్రీలంకలో ఉన్న పరిస్థితులు మక్కీకి మక్కీ ఏపీలో ఉన్నాయన్నారు.


ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకూడదని కోరుకుంటున్నామని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. బటన్లు నొక్కుతూ కూర్చుంటున్న సీఎం జగన్ ఎంత సొమ్ము ప్రజలకు ఇచ్చారంటే నీళ్లునములుతున్నారని విమర్శించారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు.. ప్రజలకు విద్యుత్ కోతలు మిగిల్చారు. యువత మత్తులోజోగితే, తన ఆటలు యథేఛ్చగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టున్నారన్నారు. వాలంటీర్లను నియమించింది...రాష్ట్రాన్ని రేప్‌ల రాజ్యం చేయడానికా? అని ప్రశ్నించారు. నగదు బదిలీ పథకంతో ప్రజలు అడుక్కుతింటుంటే, ముఖ్యమంత్రికి ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో అప్పులపై కేంద్రం జోక్యంచేసుకోవాలన్నారు. గవర్నర్ ఉత్సవ విగ్రహం పాత్రకు పరిమితం కావడం బాధాకరమన్నారు. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ రూ. 50 వేల కోట్ల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులోని సాక్ష్యాలు మాయమైతే, ఎస్పీ చిలుక పలుకులు పలుకుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. 

Updated Date - 2022-04-19T20:12:13+05:30 IST