మాధవ్‌పై చర్యలేవీ?

ABN , First Publish Date - 2022-08-12T09:23:44+05:30 IST

మనిషికి, మిగతా జీవరాశులకి ఉన్న తేడా ఒక్కటే. మేధస్సు, ఆలోచన, వివేచన, మానవత్వం, పశ్చాత్తాపం లాంటి భావనలు, స్పందనలు, మన శారీరిక నిర్మాణంలోనే భాగంగా ఉంటాయి.

మాధవ్‌పై చర్యలేవీ?

మనిషికి, మిగతా జీవరాశులకి ఉన్న తేడా ఒక్కటే. మేధస్సు, ఆలోచన, వివేచన, మానవత్వం, పశ్చాత్తాపం లాంటి భావనలు, స్పందనలు, మన శారీరిక నిర్మాణంలోనే భాగంగా ఉంటాయి. మనిషి జీవితంలో వ్యక్తిగతం మూసిన గుప్పిట లాంటిది. వ్యక్తులుగా పొరపాట్లు చేస్తే అది ఒక కుటుంబాన్నో ఒక చిన్న సమూహాన్నో నష్టపరుస్తుంది. అదే పొరపాటు ఒక వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు చేస్తే సమాజమే విచ్ఛిన్నం అవుతుంది. వ్యక్తులుగా వారి అంతరంగ జీవితం ఎలా ఉన్నా ఒకసారి సమాజ గతిని నిర్దేశించే పాత్రలోకి వెళ్లాక ఎవరైనా సరే సమాజానికి జవాబుదారీగా ఉండాల్సిందే.


అధికార మదం, అనాయాస ధనం, నియో రిచ్ భావనలు, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న బరితెగింపు, వెరసి ఈ నగుబాటు తెంపరితనం. గోరంట్ల మాధ‌వ్ న‌గ్న వీడియో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. అంత‌కు ముందు కాసినోల్లో ప్ర‌జాప్ర‌తినిధులు వార్త జోరుగా తిరిగి, మాధ‌వ్ వ్యవహారం తెరమీదకు వ‌చ్చేస‌రికి అది వెనక్కుపోయింది. మాధ‌వ్‌ని మించి ఇంకోటి వ‌స్తే ఇదీ అంతే. సంఘటన వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులైనా మాధవ్ మీద కనీస చర్యలు లేవు. నిజ నిర్ధారణ అయ్యేవరకు అయినా అతన్ని దూరం పెట్టాల్సి ఉన్నది. మాధవ్ ఒక మానసిక రుగ్మతతో, నిస్సిగ్గుగా చేసిన ఈ పని అతి తీవ్రమైనది. అతనో ఊరూపేరూ లేని వ్యక్త్తి అయితే సమాజానికి ఇంత పట్టింపు అక్కరలేదు. కానీ మాధవ్ ఒక వ్యవస్థకు ప్రతినిధి. పుచ్చలపల్లి, నెహ్రూ, ఇందిరాగాంధీ, మురార్జీ, వాజపేయి, అద్వానీ లాంటి గొప్ప‌వాళ్లు కూచున్న పార్ల‌మెంట్‌లో అతడు ఇప్పుడున్నాడు. భావిత‌రాల భ‌విష్య‌త్ నిర్మించే చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌లో ఇతనూ భాగస్వామి.


ఈ న‌గ్న వీడియో కంటే కూడా స‌మాజానికి మాధ‌వ్‌తో జ‌రిగిన ఎక్కువ న‌ష్టం ఏమంటే ఆయ‌న చాలా ఏళ్లు పోలీస్ అధికారిగా ఉండ‌డం. ఇలా విప‌రీత ప్ర‌వ‌ర్తన‌తో ఎంద‌రి మహిళల జీవితాలు అల్లక‌ల్లోల‌మై ఉంటాయో ఊహించాలంటేనే భ‌యంగా జుగుప్సగా ఉంది. సాధార‌ణంగా త‌మ వాళ్ల‌ని వెనుకేసుకొచ్చే పోలీస్‌ శాఖ కూడా భ‌రించ‌లేక అనేకసార్లు స‌స్పెండ్ చేసిందంటే ఆయనేంటో అర్థ‌మ‌వుతుంది. ఎంత మంది మ‌హిళ‌ల‌ని వేధించాడో తెలియ‌దు కానీ, అధికారికంగా ఒక రేప్ కేసు ఉంది. జేసీ దివాక‌ర్‌రెడ్డిని స‌వాల్ చేసి హీరోగా మారినందుకు మాధ‌వ్‌కి వైసీపీ టికెట్ ఇచ్చింది. వ్యక్తిత్వాన్ని, గత చరిత్రని పరిగణనలోకి తీసుకోకపోడం ఎంత నష్టదాయకమో ఇప్పటికైనా ఆ పార్టీ గ్రహిస్తుందో లేదో తెలియదు. మాధ‌వ్‌ని ఎంపీ చేసి జ‌గ‌న్ ఒక ర‌కంగా జ‌నాల‌కి మంచే చేశాడేమో. పోలీస్ అధికారిగానే ఆయన కొనసాగివుంటే, క‌నీసం 20 ఏళ్లు మరిన్ని ఉన్నతస్థాయిల్లో ఉంటూ జ‌నానికి న‌ర‌కం చూపించేవాడు.


ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడు ప్ర‌జ‌ల‌కి అభివృద్ధి చూప‌కుండా ఇంకేదో చూపిస్తున్నాడంటే మ‌న‌మంతా సిగ్గుప‌డాలి. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మానవీయ విలువలను కొంతవరకైనా పరిగణనలోకి తీసుకోవాలని, మాధవ్ లాంటి గోముఖ వ్యాఘ్రాలను ప్రజా జీవితంలోకి రాకుండా కట్టడి చెయ్యాలని, తక్షణం మాధవ్‌ని పార్టీనుంచి, పదవి నుంచి బహిష్కరించాలని కోరుతున్నాను.

– డా. వసుంధర

(సామాజిక ఉద్యమ కార్యకర్త)

Updated Date - 2022-08-12T09:23:44+05:30 IST