Advertisement

గవర్నర్‌ కోటాలో మండలికి గోరటి వెంకన్న?

Sep 16 2020 @ 04:55AM

ఎమ్మెల్సీగా ప్రజా వాగ్గేయకారుడి పేరు

ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన వెంకన్న

మూడో సీటు ఎస్సీ, ఎస్టీలకు?

గవర్నర్‌ కోటాలో గోరటి


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ రేసులో తాజాగా ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో ఒకదాని కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరును టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియ్‌సగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన మాటలు, పాటలు, రాతలతో తొలి నుంచీ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వెంకన్న.. సీఎం కేసీఆర్‌ విధానాలను బాహాటంగా వ్యతిరేకించిన దాఖలాలూ లేవు. ప్రగతి భవన్‌లో సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకన్న పేరు బలంగా వినిపిస్తోంది.


దీనిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి, ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతోందో’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావటానికి ముందు నిర్వహించిన పాదయాత్రలో ఆ పాటను బాగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత గోరటి వెంకన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నాకు ఎంపీ పదవికి పోటీ చేసే ఆసక్తి ఉందో లేదో కనుక్కోవాలని రవిచంద్ర ద్వారా వైఎస్‌ వాకబు చేయించారు. బాబు గారు (చంద్రబాబు) కూడా నాపై ఎంతో వాత్సల్యం చూపేవారు’’ అని చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన పేరు వినిపిస్తోంది.


గవర్నర్‌ కోటాలో మూడు ఖాళీలు

గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి (సభావత్‌ రాములునాయక్‌) మార్చి 2న ఖాళీ కాగా, మరొకటి (నాయిని నర్సింహారెడ్డి) జూన్‌ 19న, ఇంకొకటి (కర్నె ప్రభాకర్‌) ఆగస్టు 17న ఖాళీ అయింది. వీటిలో ఒకటి కర్నె ప్రభాకర్‌కు పక్కా అనే అభిప్రాయంతో పార్టీ ముఖ్యులు ఉన్నారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప, సీనియర్‌ నేత నాయినిని నిరాశపర్చకపోవచ్చని చెబుతున్నారు. ఇక, మూడో స్థానం కోసం మొదటి నుంచీ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి.


అలాగే, సిరికొండ మధుసూదనాచారి, తుల ఉమ, గుండు సుధారాణి, పిడమర్తి రవి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, చాడ కిషన్‌రెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, జి.దేవీప్రసాదరావు, బొమ్మెర రామ్మూర్తి, మర్రి రాజశేఖర్‌రెడ్డిసహా అనేక మంది పార్టీ నేతలు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయన కూతురు సురభి వాణిదేవి పేరును పరిశీలిస్తారనే చర్చ ఇప్పటికే జరిగింది. అయితే, మూడింటిలో ఒక స్థానం ఎస్సీ-ఎస్టీల్లో ఒకరికి దక్కవచ్చని చెబుతున్నారు. అందుకే గోరటి వెంకన్న పేరు సీఎం పరిశీలనలోకి వచ్చిందని సమాచారం. మూడింటినీ ఒకేసారి ప్రకటించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.