నిజము నీవె

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

యాతనలు బాపేటి సక్కని తోవ నీ ఎరుక లిపింది ఓ బుద్ధదేవ మితిలేక పోటెత్తె తిలోభపాశ..

నిజము నీవె

యాతనలు బాపేటి సక్కని తోవ

నీ ఎరుక తెలిపింది ఓ బుద్ధదేవ

మితిలేక పోటెత్తె అతిలోభపాశ

ఊబికే కళ్లెము నీ దమ్మ భాష

పాటిగ నీ బోధ పాటించె చోట

ఊట తేనియలూరె సుగుణాల తోట

ఎడతెగని వలపోతలెన్నొ వినిపింప

ఎంత అల్లాడెనొ నీ జాలి మనసు

కడు దీనుల కంట కారె నీరు జూసి

ఎంత ఎడమాయెనొ నీ కంటి కునుకు

హాని ఎరుగని సాధుజీవుల బలిగని

ఎంత విలపించితివొ అది నీకె తెలుసు

మేలిమింటి సుక్క తూలిపోయె వేళ

పాలరాతి సలువ మేడనొదిలావు

దివి వెన్నెలేనుగు దిగివచ్చెనేమొయని

ఎల్లనావులు నెమరునాపి తిలకించె

పూల గంధము చిమ్మె పుర వీధుల దాటి

ఏల కారడవులకు నేగినావు

రుసులూరె అరటాకు వడ్డింపులొదిలేసి

మట్టి అంబలి సిప్ప పట్టినావు

కొత్తకొత్తగ మెరిసె పట్టుదోతుల నిడిసి

పాత పేలికలేల చుట్టినావు

భువినేలె రాజువయి అరకాణి లేకుండ

అవధూతలకు ఆది పాదువయినావు


నీ జననమె లేక ఈ మట్టి గోళం

తలసుకుంటె తోచు వట్టి మసి గోళెం

నిజం తన రూపును నీలొ చూసుకుంది

భయం నీ వాకిలి ఆవలె నిలిసింది

నీ కంటి కొనలెంట కురిసేటి వానంట

నీ వంటి కాంతిలొ నీరెండ పొలుపంట

ఆశలతొ ఊరేగె భోగాల తెప్ప

ఆరిపోతేముంది బూడిద కుప్ప

ఆగడాల గెలుపు అది ఏమి గొప్ప

అంత నాదనె నరుడు నూతిలొ కప్ప

మేలెంచి తపియించె నీ బోధ తప్ప

ఇతరంబు లేదని జగమంత వొప్ప

మంచి తావుల నేలె మల్లె రెక్కల రాణి

ఎంచుకొని నీ వొడిలొ వాలిపోయినది

ఎగదోసినా మదపుటేనుగె నిను గని

తలవంచి పాదాల మోకరిల్లింది

కాటేయ కదిలిన కందిరీగల మంద

చందురుడు అందెనని సిందువేసె

నీలొ పొంగిన జాలి నింగి పవనమయి

నేల నలుదిక్కుల జ్నానమయి కురిసింది

నీ కాలి జాడల నీటి సెలిమలు ఊరి

దారినలిసిన వారి సేద దీర్చినవి

దీవెనొంపె చేతి దివ్య రూపంబును

నిలుపుకొని ప్రతికొండ నీకు మొక్కె

ఎంచి చూడగ మాన్యులెందరేతెంచిన

నీవంటి నిజముని మరల రాడు

అచల సాంఖ్య సిద్ధ అమనస్క భావాలు

నీ తపోవన పూల పరిమళాలె

చిదిమి వేసిన గాని శిథిలాలలోనుంచి

చిగురించి బోధివయి వెలిగినావు


గోరటి వెంకన్న

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST