నాకూ Offer ఇచ్చారు : Sanjay Raut

ABN , First Publish Date - 2022-07-03T01:00:49+05:30 IST

గౌహతి వెళ్లి ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలవాలని తనకు కూడా ఆఫర్ ఇచ్చారని..

నాకూ Offer ఇచ్చారు : Sanjay Raut

ముంబై: గౌహతి వెళ్లి ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలవాలని తనకు కూడా ఆఫర్ (Offer) ఇచ్చారని, తాను ఆ ఆఫర్‌ను తోసిపుచ్చానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) శనివారంనాడు తెలిపారు. శివసేన నేతల తిరుగుబాటుతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ, తనకు కూడా గౌహతి వెళ్లాలంటూ ఆఫర్ వచ్చిందని, అయితే తాను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను అనుసరించే వ్యక్తిగా ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. ''సత్యం మీ వైపు ఉన్నప్పుడు, ఎందుకు భయపడాలి?'' అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడం మింగుడు పడని వ్యవహారమని రౌత్ అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి ఫడ్నవిస్‌కు సీఎం పదవి రాలేదని, ఆయనను డిప్యూటీ సీఎంగా నా నోటితో సంబోధించడం కూడా కష్టంగా ఉందని అన్నారు. అయితే, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనందున దానిపై తాను ఏమీ చెప్పలేనని అన్నారు. శివసేనను ముంబై, మహారాష్ట్రలో పూర్తిగా కనుమరుగు చేయాలని బీజేపీ కోరుకుంటోందని, అయితే అది ఎన్నటికీ జరగదని రౌత్ ధీమా వ్యక్తం చేశారు.


మనీ లాండరింగ్ కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లపై మాట్లాడుతూ, ఒక దర్యాప్తు సంస్థగా ఈడీ సమన్లు పంపితే హాజరుకావడం బాధ్యతగల పౌరునిగా, ఎంపీగా తన బాధ్యతని చెప్పారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ సమయంలో సమన్లు పంపడం వల్లే వారిపై (ఈడీపై) అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈడీ అధికారులు తనతో చక్కగా వ్యవహరించారని, అవసరమైతే మళ్లీ వస్తానని కూడా తాను చెప్పానని ఆయన వివరించారు. శుక్రవారం సౌత్ ముంబైలోని ఈడీ కార్యాలయం ముందు హాజరైన సంజయ్ రౌత్‌ను ఈడీ సుమారు 10 గంటల సేపు ప్రశ్నించింది.

Updated Date - 2022-07-03T01:00:49+05:30 IST