గొంతెండుతోంది సారూ..

ABN , First Publish Date - 2022-05-19T06:36:28+05:30 IST

గొంతెండుతోంది సారూ..

గొంతెండుతోంది సారూ..

తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే నిలదీత 8 డివిజన్‌ సమస్యలపై మహిళల ఏకరువు

టీడీపీ వాళ్లతో మాట్లాడలేం : వెలంపల్లి

భవానీపురం, మే 18 : మీ ప్రభుత్వంలో ఏం పథకాలండీ.. ఏ ఒక్కటి అందలేదు.. ఇంటి స్థలం రాలేదు.. అంటూ భవానీపురంనకు చెందిన ఎస్‌.వాణి అనే గృహిణి మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఈమెను ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకున్నారంటూ కార్యకర్త సమాధానంతో... మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఏమ్మా పథకాలు బాగోలేదా? అంటూ ప్రశ్నించడంతో ఏమీ చెబుతాంలెండీ అంటూ ఆ మహిళ నిరసన స్వరం వినిపించింది. అయితే మేమూ టీడీపీ వాళ్లతో మాట్లాడలేం.. అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు.. 41వ డివిజన్‌లో కార్పొరేటర్‌ ఇర్ఫాన్‌తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం హరిజన వాడ, అవుట్‌ ఏజెన్సీ, అంబేద్కర్‌ రోడ్డు, క్రిస్టియన్‌ పేటల్లో బుధవారం జరిగింది. రెండుసార్లు స్వంత ఇంటికి దరఖాస్తు చేసుకున్నాం.. ఇప్పటికీ మంజూరు కాలేదు.. అన్ని అర్హతా పత్రాలున్నా ఫలితంలేదు. హరిజనవాడలోని గుడిపూడి సౌందర్య వెలంపల్లి ఎదుట కన్నీటి పర్యంతమైంది. భర్త లారీ డ్రైవర్‌ అని, తనకు ముగ్గురు పిల్లలు అని, తన ఇంటి గోడు వివరించింది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది తమకు ఇళ్ల స్థలాలు రాలేదని ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. అయితే స్థలాలు వివాదాల్లో ఉన్నాయని, క్లియర్‌ కాగానే ఇస్తామని ఎమ్మెల్యే సర్థిపుచ్చారు. 

తాగునీటికి ఇక్కట్లు..

అంబేడ్కర్‌ రోడ్డులో నేలబారు పంపుల్లోంచి నీరు సక్రమంగా రావటం లేదని, పది రోజుల్నుంచి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్మాని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. చాలా ప్రాంతాల్లో నేలబారు పంపు నుంచి నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. నీటి సమస్య పరిష్కారానికి కొత్త ట్యాంకుకు రూ.40 లక్షలతో శంకుస్థాపన చేశామని అక్కడి అధికారులు తెలిపారు. పోలీసుల పహారా నడుమ సాగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, పశ్చిమ తాహసిల్ధార్‌ ఎం.మాఽఽఽధురి, ఈఈ నారాయణమూర్తి, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, చైతన్యరెడ్డి, కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:36:28+05:30 IST