దర్శిలో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా

ABN , First Publish Date - 2021-04-18T06:24:02+05:30 IST

పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నారు.

దర్శిలో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా
సాగర్‌ కాలువ వద్ద ప్రభుత్వ భూమిలో వేసిన షెడ్‌

దర్శి, ఏప్రిల్‌ 17 :పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడింది. దర్శి-కురిచేడు రోడ్డులో ఎర్రచెరువు స్థలాన్ని ఆక్రమించి షెడ్లు వేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆక్రమణల తొలగింపులో పేదల గుడిసెలు తొలగించిన అధికారులు అక్రమ కట్టడాల గూర్చి పట్టించుకోలేదు. పరపతి ఉన్న వారి జోలికి అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో తాజాగా పట్టణంలో పలు స్ధలాలు కబ్జా చేశారు. దర్శి-కురిచేడు రోడ్డులో సాగర్‌ కాలువ ప్రక్కన ప్రభుత్వ స్ధలంలో కొందరు షెడ్లు నిర్మిస్తున్నారు. అదేమని అడిగితే వృద్దాశ్రమం నిర్మిస్తున్నామని చెబుతున్నారు. అక్కడ ఇప్పటికే రెండు వృద్ధాశ్రమాలు ప్రభుత్వ స్ధలాల్లో నిర్మించారు. సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారనే ఉద్దేశంతో వారి గూర్చి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం రోడ్డు మార్జిన్‌ స్ధలం ఆక్రమించి ఆశ్రమం పేరుతో షెడ్లు వేస్తున్నారు.  దర్శి పట్టణంలోని టీచర్స్‌ కాలనీ వద్ద రోడ్డు పోరంబోకు స్ధలంలో కొంతమంది షెడ్లు వేశారు. రికార్డుల్లో ఎంతోకాలంగా రోడ్డు పోరంబోకుగా ఉన్నప్పటికీ తాజా ఆ స్ధలం కొంతమంది అనుభవంలో ఉన్నట్లు అధికారులు రికార్డుల్లో పేర్లు చేర్చారు. ఆ రికార్డులు ఆధారంగా వారు షెడ్లు వేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దారి పోరంబోకు స్ధలం ఎవరికీ కేటాయించే వీలు లేదు. అయినప్పటికీ అధికారులు రికార్డుల్లో పేర్లు చేర్చడం విమర్శలకు తావిస్తోంది. దర్శి పట్టణంలో ఈ విదంగా యథేచ్ఛగా ప్రభుత్వ స్ధలాలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-04-18T06:24:02+05:30 IST