ప్రభుత్వ ఉత్తర్వులపై త్వరలో కోర్టుకు

ABN , First Publish Date - 2022-05-21T13:03:31+05:30 IST

చిదంబరం నటరాజస్వామివారి ఆలయంలో మునుపటిలా కనకసభ (సిట్రంబళ మేడై) వేదికపై నుంచి భక్తులు స్వామివారిని దర్శించడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ

ప్రభుత్వ ఉత్తర్వులపై త్వరలో కోర్టుకు

                        - చిదంబరం ఆలయ దీక్షితార్ల నిర్ణయం


చెన్నై: చిదంబరం నటరాజస్వామివారి ఆలయంలో మునుపటిలా కనకసభ (సిట్రంబళ మేడై) వేదికపై నుంచి భక్తులు స్వామివారిని దర్శించడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ ఆలయ దీక్షితారులు న్యాయస్థానంలో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.. గత రెండేళ్లుగా కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ఆ ఆలయంలో కనకసభ పైనుంచి భక్తులను దర్శించుకునే విధానాన్ని రద్ధు చేశారు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగించిన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లో గతంలా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే దీక్షితార్ల ఆధీనంలో ఉన్న చిదంబరంలో కనససభ వేదికపై నుండి భక్తులను దర్శించేందుకు అనుమతించలేదు. దీక్షితార్లంతా కలిసి సమావేశమై ఆ విధానానికి స్వస్తిపలుకుతూ తీర్మానం కూడా చేశారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ రంగంలోకి దిగి అధికారులతో ఆ ఆలయం వద్ద విచారణ జరిపించింది. భక్తుల కోరిక మేరకు మళ్ళీ కనకసభ వేదికపై నుండి దర్శనానికి అనుమతించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో దేవాదాయ శాఖ అధికారుల విచారణ మేరకు ఆ ఆలయంలో పాతపద్ధతిలో స్వామివారిని, చిదంబర రహస్యాన్ని దర్శించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న భక్తులు గురువారం సాయంత్రంమే ఆ ఆలయానికి చేరుకుని కనకసభ వేదికపై నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. శుక్రవారం ఉదయం కూడా వందల సంఖ్యలో భక్తులు కనకసభ ప్రాంతానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం నుంచి భక్తులకు కనకసభ వేదికపై నుండి దర్శనానికి అనుమతించడం పట్ల దీక్షితార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి వీరంతా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులకు, దీక్షితార్లకు మధ్య గొడవలు కూడా జరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వును పాటించాల్సిందేనని ఆలయ నిర్వహణాధికారులు దీక్షితార్లకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం దీక్షితార్ల తరఫు న్యాయవాది ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వం హఠాత్తుగా ఉత్తర్వులిచ్చిందని, దీక్షితార్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేందన్నారు. ప్రస్తుతం దీక్షితార్లు ప్రభుత్వ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2022-05-21T13:03:31+05:30 IST