పాలనా సంస్కరణలు

ABN , First Publish Date - 2022-04-15T09:06:50+05:30 IST

గత కొద్ది నెలలుగా బెంగాల్‌ను ఊపివేస్తున్న స్వదేశీ ఉద్యమం పట్ల యావద్భారత ప్రజలు అత్యంత శ్రద్ధాసక్తులు చూపుతున్నారు. బెంగాల్‌లోనే ప్రారంభమైన మరో ఉద్యమం బ్రిటిష్ సరుకుల బహిష్కరణకు...

పాలనా సంస్కరణలు

పాలనా సంస్కరణలు

ఉదార సంస్కరణవాది గోపాలకృష్ణ గోఖలే (1866–1915). బ్రిటిష్ మేధావులు బర్క్, జాన్ స్టువార్ట్ మిల్‌ల నుంచి స్ఫూర్తి పొందిన గోఖలే భారత రాజకీయాలలో మితవాద రాజకీయాలకు అగ్రశ్రేణి ప్రతినిధి. ప్రజాస్వామిక పాలనకు భారతీయులను అన్ని విధాల సంసిద్ధపరిచిన గొప్ప ప్రజాస్వామిక వాది. ‘సర్వెంట్స్ ఆఫ్‌ ఇండియా సొసైటీ’ స్థాపకుడుగా భారతీయుల స్మృతిపథంలో నిలిచిన ఉదాత్తుడు. ‘భారత్‌లో బ్రిటిష్ పాలనకు మహాప్రమాదకరమైన విరోధి’గా గోఖలేను వలసపాలకులు భావించేవారు. 1905లో బెనారస్‌లో కాంగ్రెస్ మహాసభలో గోఖలే అధ్యక్షోపన్యాసం నుంచి కొన్ని భాగాలు:


గత కొద్ది నెలలుగా బెంగాల్‌ను ఊపివేస్తున్న స్వదేశీ ఉద్యమం పట్ల యావద్భారత ప్రజలు అత్యంత శ్రద్ధాసక్తులు చూపుతున్నారు. బెంగాల్‌లోనే ప్రారంభమైన మరో ఉద్యమం బ్రిటిష్ సరుకుల బహిష్కరణకు ఇది భిన్నమైనది. స్వదేశీ ఉద్యమం దేశభక్తి ప్రపూరితమైనదే కాకుండా ఆర్థిక ఉద్యమం కూడా. స్వదేశీ లేదా ‘నా స్వంత దేశం’ అన్న భావన సమున్నతమైనది. మానవాళి హృదయాలను ఉత్తేజపరిచే భావన అది. 


భారత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా భారతదేశ పరిపాలన సాగేలా చూడడమే భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం. కాలక్రమంలో, బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఇతర స్వపరిపాలనా వలస రాజ్యాలలో వలే భారత్‌లో సైతం స్వపరిపాలన నెలకొనేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. రాజకీయంగా మనం సాధించే పురోగతి అంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండాలనే వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తిస్తోంది. ఆ పురోగతి క్రమానుగతంగా ఉంటుంది. ప్రతి దశలోనూ పరిపూర్ణత సాధించిన తరువాతే తదుపరి దశకు పురోగమించవలసి ఉంది. ప్రతి దశలోనూ, మనం ఆదర్శంగా తీసుకుంటున్న పాశ్చాత్య రాజకీయ సంస్థలు పనిచేసే పద్ధతులలో మనం శిక్షణ పొందవలసి ఉంది. 


మనం కోరుతున్న సంస్కరణలను నాలుగు ప్రధాన తరగతులుగా వర్గీకరించవచ్చు. అవి: (1) పరిపాలనలోనూ, దేశీయ వ్యవహారాలపై నియంత్రణలోనూ దేశ ప్రజలకు మరింత భాగస్వామ్యం కల్పించాలి. (2) పాలనా పద్ధతుల మెరుగుదలలో భాగంగా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను విభజించాలి. (3) పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించేందుకు ఆర్థిక నిర్ణయాలలో మార్పులు చేయాలి. వనరులను మరింత సహేతుకంగా ఉపయోగించుకోవాలి. సైనిక వ్యయాలను తగ్గించాలి. భూమి శిస్తును మరింత సహేతుకంగా మదింపు చేయాలి. (4) ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రాథమిక విద్యా సదుపాయాలను విస్తృతపరచాలి. పారిశ్రామిక, సాంకేతిక శిక్షణను మరింత మందికి సమకూర్చాలి. పారిశుధ్యం వసతులను గణనీయంగా మెరుగుపరచాలి. నా సూచన ఏమిటంటే ఈ నాలుగు తరగతులలోని డిమాండ్లలో ప్రత్యేకించి కొన్నిటిపై మన దృష్టిని కేంద్రీకరించి పనిచేయవలసి ఉన్నది. ముఖ్యంగా చట్ట సభలలో సంస్కరణలను అమలుపరిచితీరాలి. ప్రభుత్వం తెచ్చే బిల్లులకు సవరణలు ప్రతిపాదించే అధికారం సభ్యులకు ఉండాలి. బడ్జెట్లకు అత్యధిక సభ్యుల ఆమోదం ఉండితీరాలి. స్టేట్ కౌన్సిల్‌లో కనీసం ముగ్గురు భారతీయులను నియమించాలి. అలాగే మూడు ప్రధాన ప్రెసిడెన్సీలలోని కౌన్సిల్స్‌లో కూడా ముగ్గురు భారతీయులను నియమించాలి. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సలహాదారుల సంఘాలను నియమించితీరాలి న్యాయవ్యవస్థలో నియామకాలను దేశీయంగా న్యాయవాద వృత్తిలో ఉన్న వారినే ఎంపిక చేసి తీరాలి. పరిపాలన మెరుగుపడేందుకు ఈ చర్యలు చేపట్టడం తప్పనిసరి. కరువుకాటకాలు మొదలైనవి గతించిన కాలపు విషయాలు కావాలంటే ప్రభుత్వం కాంగ్రెస్ డిమాండ్లు అన్నిటినీ అంగీకరించాలి.

Updated Date - 2022-04-15T09:06:50+05:30 IST