సేవ చేస్తున్నందుకు ఎన్నో సవాళ్లు!

ABN , First Publish Date - 2022-06-03T08:14:46+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నందుకు తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు.

సేవ చేస్తున్నందుకు ఎన్నో సవాళ్లు!

వాటికి నేను బాధ పడడం లేదు

రాష్ట్ర ప్రజలకు సేవలు కొనసాగిస్తా

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై స్పష్టీకరణ

రాజ్‌భవన్‌లో రాష్ట్రావతరణ, 

గవర్నర్‌ పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నందుకు తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, తమిళిసై పుట్టినరోజు సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌ అధికారులు రెండు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గవర్నర్‌ తమిళిసైతో కేక్‌ కట్‌ చేయించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో ఆమెకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నేతలు స్వయంగా ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమిళిసై సభికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నందుకు తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని గవర్నర్‌ తన ప్రసంగంలో మూడుసార్లు చెప్పడం విశేషం. అయితే, ఆ సవాళ్లకు తాను బాధపడడం లేదని ఆమె స్పష్టం చేశారు.  ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తానని, కలుస్తూనే ఉంటానని వివరించారు. తాను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదని, ప్రజల సహోదరిని అని తమిళిసై చెప్పారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారని, దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. రాజ్‌భవన్‌ స్కూల్‌లో విద్యార్థుల కోసం భోజన ఏర్పాట్లు చేశానని వివరించారు. కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షించానన్నారు. భద్రాచలం, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశానని చెప్పారు. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు అందించానన్నారు. ఈ కార్యక్రమంలో రైస్‌బకెట్‌ చాలెంజ్‌ విసిరిన మంజులతా కళానిధి, తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్న షేక్‌ బడే సాహెబ్‌, వికలాంగుల హక్కుల కార్యకర్త సీహెచ్‌ హిమజ తదితరులను గవర్నర్‌ ప్రత్యేకంగా సత్కరించారు. 

అమరుల త్యాగంతోనే తెలంగాణ ఆవిర్భావం

ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తమిళిసై అన్నారు. ఇక గవర్నర్‌ తన ప్రసంగంలో కూడా పలుమార్లు తెలంగాణ ప్రజలు అన్న పదాలే ఉపయోగించారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం, సర్కారు చేస్తున్న కార్యక్రమాలు, సీఎం పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖను రాజ్‌భవన్‌కు పంపించారు. ప్రజలకు మరింత కాలం సేవ చేసేందుకు భగవంతుడు ఆమెకు ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-03T08:14:46+05:30 IST