‘సర్కారు’ బేజారు!

ABN , First Publish Date - 2022-06-26T06:07:01+05:30 IST

‘సర్కారు’ బేజారు!

‘సర్కారు’ బేజారు!

ఫలితమివ్వని ‘బడిబాట’ ప్రచారం

చాలా ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు

లోపించించిన ముందస్తు ప్రణాళిక

ప్రభుత్వ కళాశాలదీ ఇదే తీరు..

ప్రైవేటు పాఠశాలల్లో జోరుగా ప్రవేశాలు

ఖమ్మం ఖానాపురం హవేలీ, జూన 25: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు జిల్లాలో ‘బడిబాట’ అంటూ విద్యాశాఖ అధికారులు హడావుడి చేస్తున్నా క్షేత్రస్థాయిలో దానికి స్పందన నామమాత్రంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు ప్రైవేటు పాఠశాలల్లో అధిక సంఖ్యలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు పలు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రైవేటు స్కూళ్లలో నోఅడ్మిషన బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలతో పోలిస్తే ప్రభుత్వ బడుల పరిస్థితి అడ్మిషన్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప పిల్లలను బడులకు తీసుకెళ్లాలనే తపన చాలామంది ఉపాధ్యాయుల్లో కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.   ఒకరిద్దరు టీచర్లు, నలుగురైదుగురు విద్యార్థులను వెంట బెట్టుకొని నామమాత్రంగా ఫొటోలకు ఫోజులిచ్చి ‘బడిబాట’ కార్యక్రమం చేపట్టామంటూ నివేదికలు పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఇక పల్లెల్లో ర్యాలీలు, ప్రచారాలు ఏమాత్రం కనిపించలేదు. మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఈ సంవత్సరం ‘బడిబాట’ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,210పైగా ఉండగా ప్రైవేటు పాఠశాలలో  250పైగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వతరగతి చదివే విద్యార్థులు 1,30,000 మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు 2లక్షలకు పైగానే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లు అధికంగా ఉన్నా విద్యార్థుల సంఖ్యమాత్రం ప్రైవేటు సగానికి తక్కువగానే హాజరుశాతం ఉండడం, విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ప్రతిఏటా నిర్వహించే బడిబాటలో విద్యార్థులను గుర్తించడం తప్ప వారిని బడుల్లో చేర్చేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీ్‌షమీడియం అందుబాటులో తెచ్చినా విద్యార్థుల హాజరుశాతం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశలాల్లో చదివితే వచ్చే ప్రయోజనాలు గురించి వివరించలేకపోతున్నారు.ఇకనైనా ప్రభుత్వ పాఠశలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేదుకు అధికారులు కృషిచేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


కళాశాలదీ అదేదారి..

ప్రభుత్వ కళాశాల పరిస్థితి ఇలానే ఉంది. జిల్లాలో గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలలు 19, ఎయిడెడ్‌ కాలేజీ 1, బీసీ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీలు 8, టీఎ్‌సడబ్ల్యూఆర్‌ కాలేజీలు 9, టీటీడబ్ల్యుఆర్‌ జూనియర్‌ కాలేజీలు 4, మోడల్‌ జూనియర్‌ కాలేజీలు 2, టీఎ్‌సఆర్‌ జూనియర్‌ కాలేజీలు 2, మైనారిటీ జూనియర్‌ కాలేజీలు 7, కస్తూర్భా జూనియర్‌ కాలేజీలు 14, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 58మొత్తం 124 జూనియర్‌ కాలేజీలున్నాయి. వీటిలో ఒక్క ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లోనే మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 22,880మంది ఉండగా, ప్రభుత్వ ఆధీనంలో నడిచే కళాశాలల్లో కేవలం 12,820మంది విద్యార్థులే ఉన్నారు. 


గతేడాదితో పోలిస్తే..

గతేడాది ‘బడిబాట’ను మూడు విడతలుగా చేపట్టారు. జూన్‌ 2 నుంచి 11వ తేదీ వరకు మొదటి విడత, 12నుంచి 20 వతేదీ వరకు రెండో విడత, 21నుంచి 30వ తేదీ వరకు మూడో విడత... ఇలా పక్కా ప్రణాళికతో ‘బడిబాట’ను చేపట్టారు. ఈ మూడు విడతల్లోనూ ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించారు. జూన్‌ నెలంతా బడి బయటి పిల్లలను బడిలో చేర్చుకునేందుకు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సంసిద్థతా కార్యక్రమాలు నిర్వహించిన ఉపాధ్యాయులు జులై నుంచి బోధన మొదలు పెట్టారు. కానీ ఈ విద్యా సంవత్సరం ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వేసవి ఎండల పేరుతో చాలా మంది ఉపాధ్యాయులు నామ మాత్రంగానే బడిబాట నిర్వహింనినట్లు సమాచారం. ఇక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని, బడిలో పాఠాలు చెప్పాలని కదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


విద్యాశాఖ నిర్లక్ష్యం..

గతేడాది మే నెలలోనే బడిబాటకు షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ ఆ మేరకు కావాల్సిన కరపత్రాలు, బ్యానర్లను ముద్రించి ఇతర ఖర్చుల కోసం నిధులు కూడా సమకూర్చి జూన్‌ మొదటి నాటికి క్షేత్రస్థాయికి చేర్చింది. బడిబాటపై తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేసింది. అయితే ఈ సంవత్సరం కరపత్రాలు, బ్యానర్ల మాట అటుంచితే బడిబాట కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు సరికదా రాష్ట్రస్థాయి ప్రణాళికను కూడా విడుదల చేయలేదు. దీనికితోడు అధికారులు ప్రకటనలకే పరిమితం కావడంతో అధికారులు స్పందించలేదు. వెరసి బడిబాట కార్యక్రమం విఫలమైందని చెప్పవచ్చు.


ప్రైవేటులో నో అడ్మిషన బోర్డులు.. 

ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రైవేటు స్కూళ్లలో నోఅడ్మిషన బోర్డులు పెడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. వేసవి సెలవులకంటే ముందుగానే అడ్మిషన్లు పూర్తయ్యాయని పేరుగాంచిన విద్యాసంస్థలు గొప్పలకు పోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అడ్మిషన కావాలంటే అధికంగా ఫీజులు చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. పలు సంవత్సరాలలో తమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులు, వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలను చూపుతూ అధికంగా పీజులు వసూలు చేస్తున్నారు.

Updated Date - 2022-06-26T06:07:01+05:30 IST