ఏళ్లుగా ప్రభుత్వం చేయలేని పని.. 19ఏళ్ల యువతి చేసి చూపించింది!

ABN , First Publish Date - 2022-09-18T18:25:33+05:30 IST

పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే ప్రభుత్వం విధి కాదు. ఆ డబ్బులను తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేయాలి. కనీస వసతులను ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగించాలి. ఇలా కష్టాలను దూరం చేసే ప్రభుత్వాలనే ప్రజలు

ఏళ్లుగా ప్రభుత్వం చేయలేని పని.. 19ఏళ్ల యువతి చేసి చూపించింది!

ఇంటర్నెట్ డెస్క్: పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే ప్రభుత్వం విధి కాదు. ఆ డబ్బులను తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేయాలి. కనీస వసతులను ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగించాలి. ఇలా కష్టాలను దూరం చేసే ప్రభుత్వాలనే ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. అయితే.. ఓ గ్రామానికి చెందిన ప్రజలు ప్రభుత్వానికి ఎప్పటి నుంచో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వాళ్ల సమస్యను తీర్చలేదు. కానీ 19ఏళ్ల యువతి మాత్రం.. ప్రభుత్వాలు చేయలేని పని చేసి చూపించింది. తనకు తోచిన పద్ధతిలో సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం కనుక్కొని.. అక్కడి వాళ్లకు బాధలు తీర్చుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆ గ్రామం పేరు పాలట్ పడా(Palat Pada). దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)కి సమీపంగా థానే జిల్లాలో ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికీ పాఠశాల లేదు. చదువుకోవాలనుకునే పిల్లలు సరైన దారి లేనప్పటికీ కిలోమీటర్ మేర నడిచి పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి. ఊరిలో పాఠశాల నిర్మించాలని, రోడ్డు వేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులను ఇక్కడి ప్రజలు కోరారు. కానీ ఆ ఊరికి మాత్రం పాఠశాల, రోడ్డు రాలేదు. నిత్యం సమస్యలతో పోరాటం చేస్తూనే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన కంటా చింతామన్(Kanta Chintaman) అనే యువతి ఆ తర్వాత చదువుకు దూరమైంది. అయితే.. చదువు విలువ తెలిసిన ఆమె.. ఇతర విద్యార్థులు కూడా తనలానే పాఠశాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు మానేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత.. తన తోచిన విధంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది. చిన్నపాటి మర పడవను ఏర్పాటు చేసింది. చెరువు చుట్టూతా తిరిగి.. రాళ్ల మార్గంలో బడికి వెళ్తున్న విద్యార్థులను తాను తయారు చేసిన పడవలో ఎక్కించుకుని పాఠశాలకు పంపిస్తుంది. ఇలా చేరవేసినందుకు తను ఒక్క రూపాయి కూడా విద్యార్థుల నుంచి తీసుకోవడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని పక్కనే ఆ గ్రామం ఉంది. సుమారు 25 మంది గిరిజన కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తాయి. అయినా ఇప్పటికీ ఈ గ్రామానికి విద్యుత్తు చేరలేదు. 


Updated Date - 2022-09-18T18:25:33+05:30 IST