గాడి తప్పిన సర్కారు విద్య! గుణపాఠాలు నేర్చేదెన్నడు?

ABN , First Publish Date - 2022-07-02T16:45:53+05:30 IST

రాజధాని నగరంలో ప్రభుత్వ విద్య గాడితప్పుతోంది. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. టైం టేబుల్‌ ప్రకారం

గాడి తప్పిన సర్కారు విద్య! గుణపాఠాలు నేర్చేదెన్నడు?

అధికారుల పర్యవేక్షణ లోపం

ఏటా తగ్గుతున్న ‘పది’ ఫలితాలు


హైదరాబాద్‌ సిటీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలో ప్రభుత్వ విద్య గాడితప్పుతోంది. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. టైం టేబుల్‌ ప్రకారం సిలబస్‌ పూర్తి చేయకపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా అట్టడుగు స్థానానికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. విద్యాశాఖ గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. 


జిల్లాలోని 16 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 1,06,053 మంది విద్యార్థులు చదువుతున్నా రు. 6,200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పర్వాలేదు. కొన్ని చోట్ల కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా సదుపాయాలు ఉన్నాయి. తగినంత మంది ఉపాధ్యాయులూ ఉన్నారు. అయినప్పటికీ వార్షిక ఫలితాల్లో వెనకబడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


కొందరు టీచర్లు..

కొంత మంది సబ్జెక్టు టీచర్లు స్కూళ్లకు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో సకాలంలో సిలబస్‌ పూర్తి కావడం లేదు. కరోనా తర్వాత పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నా, కొందరు టీచర్లు అలసత్వం వహిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట నుంచి తక్కువ ఉన్న చోటకు డిప్యూటేషన్‌పై వెళ్తూ విధులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు సంఘాల పేర్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో నిర్ణీత పనిదినాల్లో పూర్తి కావాల్సిన పాఠ్యాంశాలు వార్షిక పరీక్షలు దగ్గర పడే వరకూ పూర్తి కావడం లేదు. ఉపాధ్యాయుల పని తీరును పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడంతో పాటు వారు కూడా కార్యాలయాలకు తీరుబాటుగా వస్తున్నారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచక పోవడం వల్లే  ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని    తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 73,957 మంది హాజరుకాగా, 58,889 మంది ఉత్తీర్ణత సాధించారు. 


తగ్గిన టెట్‌ ఉత్తీర్ణత

పేపర్‌-1లో 32.54 మంది..

పేపర్‌-2లో 48.59 శాతం మంది పాస్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లోనూ ఉత్తీర్ణత శాతం తగ్గింది. పేపర్‌-1లో 32.54 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. పేపర్‌-2లో 48.59 శాతం అర్హత సాధించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడంతో గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, బీఈడీ అభ్యర్థులు పేపర్‌-1, 2 రెండింటిలోనూ సరైన ప్రతిభ కనిపించలేకపోయారు. దీంతో అర్హత శాతం తగ్గినట్లు అధికారులు తెలిపారు. పేపర్‌-2 రాసిన బీఈడీ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ.. పేపర్‌-1 లో ఎక్కువ శాతం మంది అర్హత సాధించలేదు. కొందరు కేవలం పేపర్‌-2ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడంతో పేపర్‌-1లో ఉత్తీర్ణత శాతం తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన టెట్‌ పరీక్షతో పోల్చితే మహా నగరంలో ఈసారి ఉత్తీర్ణత శాతం పడిపోవడం చర్చనీయాశంగా మారింది.





Updated Date - 2022-07-02T16:45:53+05:30 IST