జీతాలిస్తానికి తప్ప అన్నింటికీ పైసలుంటయ్!

ABN , First Publish Date - 2022-07-23T06:35:23+05:30 IST

ఒకటో తారీఖు నుంచి మొదలుపెడితే వరుసగా పది, పదిహేను రోజులు గడికోసారి ఫోన్‌లో ‘ఈ–కుబేర్‌’ ఓపెన్‌ చేసుడు, జీతం పడిందా లేదా?

జీతాలిస్తానికి తప్ప అన్నింటికీ పైసలుంటయ్!

ఒకటో తారీఖు నుంచి మొదలుపెడితే వరుసగా పది, పదిహేను రోజులు గడికోసారి ఫోన్‌లో ‘ఈ–కుబేర్‌’ ఓపెన్‌ చేసుడు, జీతం పడిందా లేదా? అని బ్యాంక్‌ ఎకౌంట్‌ చెక్‌ చేసుడు! తెలంగాణ ఉద్యోగులకు ఇప్పుడు ఇదొక అలవాటైపోయింది. ఈ కొత్త అలవాటు ఆళ్ల తండ్లాటకు, మానసిక వేదనకు అద్దం పడుతున్నది. జీతం క్రెడిట్‌ అయినట్టు మెసేజ్‌ వస్తలేదుగానీ, కట్టాల్సిన ఈఎమ్‌ఐలు, లోన్‌ రిమైండర్లు మాత్రం ఠంచనుగా వస్తూ వాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నయ్‌. ఇదేదో ఈ ఒక్క నెలలోనే జరిగిందంటే సరిపెట్టుకోవచ్చు. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి టైమ్‌కు జీతాలు పడక, ఉద్యోగులు పరేషాన్‌ అయితున్రు. 2014లో 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల, ఇప్పుడు ఉద్యోగులకు సరిగ్గా జీతాలు కూడా ఇయ్యలేని పరిస్థితికి దిగజారింది.


గవర్నమెంట్‌ ఉద్యోగమంటే, ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు పడ్తాయనే నమ్మకం, భరోసా ఉంటుండే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు దానికి తిలోదకాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెల్వని పరిస్థితులు దాపురించినయ్‌. రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు ఒక్కో తారీఖున జీతాలు పడ్తున్నయ్‌. అది కూడా ఏ పదో తారిఖో, పదిహేనో తారీఖో తెల్వదు. చానామంది ఉద్యోగులు ఇంటికో, పిల్లల సదువులకో, ఇంకెమన్నా అవసరాలకో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటరు. ప్రతి నెలా కనీసం ఐదు తారీఖు లోపు జీతాలు పడ్తయనే నమ్మకంతోటి ఆ గడువు లోపల ఈఎమ్‍ఐలు కడ్తమని బ్యాంకు అగ్రిమెంటుపై సంతకాలు పెడ్తరు. కానీ, ఇప్పుడు ఐదు, పది, పదిహేను... ఇట్లా ఎప్పుడు జీతాలు పడ్తయో తెలుస్తలే. టైముకి ఈఎమ్‌ఐలు కట్టలేకపోతుండటంతో బ్యాంకులు వాళ్లకు పెనాల్టీలు వేస్తున్నయ్‌. వాళ్ల సిబిల్‌ స్కోర్‌ కూడా డౌన్‌ అయిపోతున్నది. సంసారం నడపటానికి అప్పులు తెచ్చుకునే పరిస్థితి తలెత్తింది.


2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,45,257 కోట్లు. రాష్ట్ర సొంత రెవిన్యూ రూ.1,33,634 కోట్లు. కాగా, వీటిలో పన్నుల రాబడి రూ.1,08,212 కోట్లు. ఇక నాన్‌ టాక్స్‌ రెవిన్యూ రూ.25,422 కోట్లు. తెలంగాణల ఉన్న మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల కోసం ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు రూ.25వేల కోట్లు. రాష్ట్రంల మొత్తం 2.63 లక్షలమంది పెన్షనర్లు ఉన్నరు. ఆళ్లకు ఏడాదికి దాదాపు రూ.11 వేలకోట్లు ఖర్చయితది. అంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.3వేలకోట్లు కేటాయించాలే. రాష్ట్రానికి సొంత ఆదాయం మస్తుగున్నా, నెలకు జీతాలు, పెన్షన్ల కోసం రూ.3వేల కోట్లు కేటాయించడం ఎందుకు కష్టమైతున్నది? పైగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తున్నదన్నట్టుగా ప్రతి నెలా జరుగుతున్న ప్రచారం ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నది. ఈ ప్రచారంతో గులాబీ సోషల్‌ మీడియా మూక ప్రజలకు, ఉద్యోగులకు పంచాయితీ పెడ్తానికి ప్రయత్నిస్తున్న తీరును యావత్‌ ఉద్యోగ లోకం గమనిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతాలుంటయ్‌ కాబట్టి, పెద్దగా ఇబ్బందులేముంటయ్‌ అనుకునే చానామంది అభిప్రాయం కరెక్టు కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఆళ్లకు ఉండే కష్టాలు ఆళ్లకుంటయ్‌.


ఇగ, రిటైర్డు ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్‌ కూడా పూర్తి స్థాయిలో అందుతలేవు. అందినకాడికి కూడా టైమ్‌‍కి అందుతలేవు. ‘రిటైర్‌ అయ్యేనాటికే లెక్కా ఆచారం కంప్లీట్‌గా ఉండాలే. రిటైర్‌ అయ్యేలోపే ఆయనకు ఇయ్యాల్సిన ప్యాక్‌ తయారు చేసి, రెడీగా పెట్టి, రిటైరైన రోజున ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి, పూల దండ ఏసి, శాలువ కప్పి, ప్యాక్‌ చేతిల పెట్టి ప్రభుత్వ వాహనంలోనే ఆయన్ను ఇంటి దగ్గర దించి రావాలే అధ్యక్షా. దీన్ని వందకు వందశాతం తొందర్లోనే తీసుకొస్త’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఒక ఎమోషనల్‌ కథ చెప్పి సంవత్సరాలు గడుస్తున్నయ్‌ గానీ, ఎప్పటిలెక్కనే అది గూడా ఉత్త కతే అయింది. ఇంకా వేలాదిమంది రిటైర్డ్‌ ఉద్యోగులు తమ బెనిఫిట్స్‌ కోసం ఎదురు చూస్తున్నరు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకైతే రెండు మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నరు. కాంట్రాక్టు వ్యవస్థే లేకుండా చేస్తనని చిలుక పలుకులు పలికిన ఈ ముఖ్యమంత్రి కనీసం వాళ్లకు టైముకి జీతాలు కూడా ఇస్తలేరు. ఇట్లయితే, వాళ్ల ఇల్లూ సంసారం ఎట్లా గడవాలే? ఇంతటి దుర్భర పరిస్థితికి కారణం ఏంటిది? అని అడిగితే ‘ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యం పెద్ద విషయమే కాదు, పరిస్థితులను బట్టి అలా జరుగుతుంటయ్‌’ అని ముఖ్యమంత్రి సుపుత్రుడు, మాన్య మంత్రివర్యులు కేటీఆర్‌ బాధ్యతారహితమైన స్టేట్‌మెంట్‌ ఒకటి పాస్‌ చేసిన్రు. అంతేగానీ, జీతాలు ఎందుకు లేట్‌ అయితున్నయో, ఆ పరిస్థితులేందో మాత్రం చెప్పలే. రాష్ట్ర ఖజానాలో పైసల్లేవా? రాష్ట్రం అప్పుల కుప్పయిందా? ఈ ప్రశ్నలకి వారు జవాబే చెప్పరు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 360 ప్రకారం ఫైనాన్షియల్‌ ఎమర్జన్సీ ప్రకటిస్తే తప్ప, ఉద్యోగుల జీతాల చెల్లింపు లేట్‌ చేయొద్దనే విషయం వాళ్లు తెలుసుకోవాలే.


ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు తమకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంపై పోయిన సంవత్సరం సమ్మెకు దిగిన్రు. ఆ టైములో ఢిల్లీ హైకోర్టు వాళ్ల జీతభత్యాలు, పింఛన్లు చెల్లించకపోవడంపై మున్సిపల్‌ కార్పొరేషన్లను మందలించింది. నిధుల కొరత సాకును స్వీకరించలేమని, వేతనం, పెన్షన్‌ పొందే హక్కు భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21 కింద పొందుపరిచిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. సమయానికి జీతం చెల్లించకపోవడం వల్ల అది వారి క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది, కాబట్టి, అది వారి జీవించే హక్కును కాలరాసినట్టేనని జస్టిస్‌ విపిన్‌ సంఘి, రేఖాపల్లిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. కార్పొరేషన్లు చేస్తున్న ఇతర అనవసర ఖర్చుల కంటే జీతాలు, పెన్షన్ల చెల్లింపుకు ప్రాధాన్యత ఇయ్యాలని కూడా చెప్పింది. ప్రతి నెలా ఒకటో తారీఖున, గడిచిన నెల జీతం పొందడం ఉద్యోగుల హక్కు. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల జీవించే హక్కును కాల రాస్తున్నది. మెట్రో పిల్లర్ల మీద, బస్టాండ్ల మీద, సోషల్‌ మీడియాలో రంగు రంగుల ప్రకటనలు ఇస్తానికి, అనవసర ఖర్చు పెట్టడానికి మీ దగ్గర పైసలు ఉంటయ్‌ గానీ, ఉద్యోగులకు జీతాలు ఇస్తానికి మాత్రం పైసలుండవు.


రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడు అది రూ.4లక్షల కోట్లు దాటింది. ఈ అప్పుల కుప్పని ప్రజల నెత్తిలవెట్టి... ‘దేశంలో అత్యధిక వృద్ధిరేటు, తలసరి ఆదాయం సాధిస్తున్నది తెలంగాణే’ అని కేసీఆర్‌ మైకుల పట్టుకొని ఒకవైపు స్పీచులు దంచుతుంటరు. మరోవైపు సందర్భం వచ్చినప్పుడల్లా ‘రాష్ట్రం పరిస్థితి బ్రహ్మాండంగా ఉంద’ని ఊదరగొడ్తుంటరు. ఇన్ని చెప్పే మీరు ఉద్యోగులకు జీతాలు ఇచ్చుడులో ఎందుకు చేతులెత్తేసిన్రు? మీరూ, మీ కుటుంబసభ్యులూ తీస్కునే నెలకు నాలుగు లక్షల రూపాయలు రెండు మూడు నెలలకొక్కసారి తీసుకున్న ఫరఖ్‌ పడదు. కానీ ఉద్యోగుల జీవితాలు మీలెక్క ఉండవు. ఏలేవారు తెలుసుకోవాలే.


నాడు దొరలు శ్రమ దోపిడి చేసినట్టు, నేడు ఉద్యోగుల శ్రమను కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడి చేస్తున్నది. ఇక్కడ ఇంకోటి గూడా గుర్తు చెయ్యాలనుకుంటున్నా– మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డులో పని చేస్తున్న ఓ ఉద్యోగికి జీతం చెల్లింపు ఆలస్యం చేసిన కేసులో దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని 2008లో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సైతం రిటైర్డ్‌ డిస్ట్రిక్‌ జడ్జ్‌ శ్రీమతి డి. లక్ష్మి కామేశ్వరి దాఖలు చేసిన ఒక పిటీషన్‌లో కూడా న్యాయస్థానం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా పిటీషనర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.


ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతభత్యాలు మంజూరు చేయడంలో జాప్యం చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 300(ఎ) అధికరణలను ఉల్లంఘించడమే. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమయానికి ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు సకాలంలో చెల్లించి వారి జీవించే హక్కును కాలరాయద్దొని బీజేపీ తెలంగాణ శాఖ కోరుతోంది. ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లించిన జీతాల్ని వడ్డీతో సహా తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా బీజేపీ రాష్ట్ర శాఖ ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి న్యాయపరమైన సలహాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగస్థులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకుండా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల జీవించే హక్కును దెబ్బ తీస్తున్న తీరును కూడా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీస్కపోతాం.



బండి సంజయ్‌ కుమార్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2022-07-23T06:35:23+05:30 IST