కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం : ఉగ్ర

ABN , First Publish Date - 2021-05-09T07:29:04+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం : ఉగ్ర

కనిగిరి, మే 8 : కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. వ్యాక్సిన్‌ సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని కోరుతూ ఉగ్ర తన నివాసంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తామన్న ప్రభుత్వం 45 ఏళ్ల వయస్సు వారికి కూడా   పూర్తి స్థాయిలో వేయలేక పోయిందని విమర్శించారు. అంతేకాకుండా మొదటి డోస్‌ వేయించుకున్న వారికి రెండో డోస్‌ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేయడం బాధాకరమన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా యుద్ధప్రాతిపదికన చేపడితేనే థర్డ్‌ వేవ్‌ నుంచి ప్రజలు రక్షణ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందేలా చొరవ చూపాలని హితవు పలికారు.  డాక్టర్‌ ఉగ్ర ఆదేశాలతో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్లా, సానికొమ్ము తిరుపతిరెడ్డి, నగర అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసుల రెడ్డి, బ్రహ్మం గౌడ్‌, చిలకపాటి లక్ష్మయ్య తదితరులు వారి వారి నివాసాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. 

పీసీపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మండలంలో పలువురు టీడీపీ  నాయకులు శనివారం వారి నివాసాల నుంచే నిరసన తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నినాదాలు చేయడంతోపాటు, ప్లకార్డులు ప్రదర్శించారు. 

తాళ్లూరు : ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు శాగం కొండారెడ్డి అన్నారు. కరోనాను నివారించడంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆపార్టీ నేతలు శనివారం నిరసనలు తెలిపారు. 

Updated Date - 2021-05-09T07:29:04+05:30 IST