దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఆర్డీవో రవీంద్రరావు
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు
నందిగామ, జూన్ 25: సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద శనివారం 22ఏ కింద తప్పుగా నమోదైన భూములను రైతుల పేరుతో మార్చేందుకు మేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, నందిగామ ప్రాంతంలో పలువురు భూ యజమానులు రెవెన్యూ తప్పుల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. హైవే భూసేకరణ సమయంలో తీసుకున్న భూమి కంటే అదనంగా భూమిని రికార్డుల్లో చేర్చారని ఇటువంటి పొరపాట్లకు ఈ మేళా ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ, కార్యాలయంతో పాటు తహసీల్దార్, వార్డు సచివాయల్లో సైతం భూ యజమానులు తమ దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. నెలాఖరు వరకూ ధరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఆయన తెలిపారు.