కొండల్ని కొల్లగొట్టేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-08-09T10:10:13+05:30 IST

ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తామంది...ఇందుకోసం కొండవాలు ప్రాంతాలను కూడా ఎంపిక చేసింది.

కొండల్ని కొల్లగొట్టేస్తున్నారు!

అధికార పార్టీ దందా

గ్రావెల్‌, రాళ్లు అమ్ముకుంటున్నవైసీపీ నేతలు

పేరుకు పేదల స్థలాల చదును

ధ్రుతరాష్ట్ర పాత్ర పోషిస్తున్న రెవెన్యూ అధికారులు

కొన్నిచోట్ల పర్సంటేజీలు అందుతున్నట్టు ఆరోపణలు

ప్రభుత్వ కార్యక్రమాలని నోరుమెదపని గనుల శాఖ

భీమిలి నియోజకవర్గంలో అక్రమార్కుల హవా

జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తామంది...ఇందుకోసం కొండవాలు ప్రాంతాలను కూడా ఎంపిక చేసింది. వాటిని చదును చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అలాగే, పల్లపు ప్రాంతాలు వుంటే సమీపంలోని కొండల్ని తవ్వి అక్కడి గోతులు పూడ్చాలని ఆదేశించింది. ఇంకేం అద్భుత అవకాశంగా భావించారు అధికార వైసీపీ నేతలు. దర్జాగా కొండలను తవ్వుకున్నారు. రాళ్లు, గ్రావెల్‌ అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. రెండు నెలలుగా యథేచ్ఛగా దందా సాగుతోంది. ‘వడ్డించే వాడు మనవాడైతే...’ అన్న చందాన వైసీపీ నేతల దందా కళ్లకు కనబడుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం నోరు మెదపకపోవడం విశేషం. 


నిరుపేదలకు స్థలాలు ఇచ్చేందుకు ఆయా గ్రామాల పరిధిలోని పోరంబోకు, డి.ఫారం, కొండవాలు ప్రాంతాల్లోని స్థలాలను అధికారులు ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన అన్ని ప్రాంతాలు లేఅవుట్లకు అనుకూలంగా లేవు. కొన్ని లోతట్టు ప్రాంతాలు. మరికొన్ని కొండవాలులు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు చదును చేయాలంటే తవ్వకాలు తప్పనిసరయ్యింది. అలా తవ్విన కంకర, రాళ్లతో లోతట్టు ప్రాంతాలను పూడ్చాలని ప్రభుత్వం ఆదేశించింది. కొండవాలు ప్రాంతాలను లేఅవుట్‌లుగా అనుగుణంగా మార్పు చేసే బాధ్యతనుధధఽ అధికార పార్టీ నేతలు తీసుకున్నారు. కొండవాలు  ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్థలాల్లో తవ్విన మట్టితో లోతట్టు ప్రాంతాలను పూడుస్తామంటూ ముందుకొచ్చారు. అయితే ఓ లోడు లోతట్టు ప్రాంతాలకు తరలించి, పది లోడులు బయట వారికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల అంశాన్ని నిర్దేశించినప్పటి నుంచి ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని ధ్రుతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు.


భీమిలి నియోజకవర్గంలో...

భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గిడిజాల, దిబ్బడపాలెం, తర్లువాడ, మెట్టమీదపాలెం, శొంఠ్యాం, ఎల్‌.వి.పాలెం, బాకురపాలెం, రామవరం, కణమాం, వెల్లంకి...ఇలా చాలాచోట్ల కొండలను తవ్వేశారు. కొన్నాళ్లుగా రోజూ పదుల సంఖ్యలో లారీల్లో గ్రావెల్‌ తరలిపోతోంది. గ్రామాల్లో ఎవరైనా అడిగితే మండలంలోని ఫలానా గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్‌కు అని చెప్పడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా సాగుతుండడం అక్రమార్కులకు కలిసి వచ్చింది. రాత్రిపూట ఆ పనులకు భారీఎత్తున గ్రావెల్‌ తరలిస్తున్నారు. అలాగే మండలంలో పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు అభివృద్ధి చేసిన లేవుట్‌లకు కూడా గ్రావెల్‌, మట్టి తరలించారు. కణమాం వద్ద ఒక సంస్థ 100 ఎకరాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్‌కు భారీగా గ్రావెల్‌ అవసరం కాగా సమీప గ్రామాల్లో కొండల నుంచి తరలించారు. ప్రస్తుతం వేములవలసలో సర్వే నంబరు 155లో 60 మందికి పట్టాల కోసం కొండను తవ్వుతున్నారు. సుమారు 80 శాతం కొండ తవ్వేసి కొంతభాగం సమీపంలో లేవుట్‌లకు తరలించి, మిగిలింది ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు.  


ఇతర మండలాల్లోనూ...

సబ్బవరం మండలం గొర్లెవానిపాలెం, అసకపల్లి, గొటివాడ, అమృతపురంలో పేదలకు స్థలాల కోసం కొండవాలు ప్రాంతాల చదును పేరిట గ్రావెల్‌ విక్రయాలు భారీఎత్తున జరుగుతున్నాయి. సబ్బవరంలో అభివృద్ధి చేసిన లేఅవుట్‌ నుంచి ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్‌ విక్రయాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. పరవాడ, పాయకరావుపేట, అనకాపల్లి రూరల్‌, రాంబిల్లి మండలాల్లోనూ గ్రావెల్‌ అమ్ముకుని అధికార పార్టీ నేతలు బాగానే వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా కొండను తవ్వి ప్రైవేటు అవసరాలకు గ్రావెల్‌, రాళ్లు తరలించాలంటే గనుల శాఖ అనుమతి తీసుకోవాలి. అదే ప్రభుత్వ కార్యక్రమాలకుగానీ, కొండవాలు చదును చేస్తే ఎటువంటి అనుమతి అవసరం లేదు. ఇది అధికార పార్టీ నేతలకు కలిసి వచ్చింది. గనుల శాఖ అడగకపోవడం, రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకోవడంతో వీరి దందాకు అడ్డులేకుండా పోతోంది. కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది నుంచి అధికారుల వరకు పర్సంటేజీలు అందాయని, అందుకే వారు మౌనం వహిస్తున్నారని అధికార పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల వీఆర్‌ఓలే చక్రం తిప్పుతున్నారని, ఫిర్యాదు చేసినా తహసీల్దార్లు పట్టించుకోలేదని ఆనందపురం మండలానికి చెందిన కొందరు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-08-09T10:10:13+05:30 IST