చదువుతో సర్కారు చెడుగుడు

ABN , First Publish Date - 2022-07-07T09:02:46+05:30 IST

చదువుతో సర్కారు చెడుగుడు

చదువుతో సర్కారు చెడుగుడు

ఇంటర్‌ విద్యార్థినుల భవిష్యత్తుతో ఆటలు

మండలానికో బాలికల కాలేజీపై హడావుడి

సౌకర్యాలు లేకపోయినా ఏర్పాటుకు యత్నం 

ల్యాబ్‌ల కోసం కో-ఎడ్యుకేషన్‌ కాలేజీలకు 

పాఠశాల ఉపాధ్యాయులతోనే ఇంటర్‌ బోధన

ఈ నెల 1న ప్రారంభించాలని 5న ఆదేశాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాఠశాల విద్యార్థులకు ఆప్షన్‌ లేకుండా బలవంతంగా ఇంగ్లిష్‌ మీడియం రుద్దారు. 3, 4, 5 తరగతులను కిలో మీటరు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాల్లో విలీనానికి ఆదేశాలిచ్చి.. పిల్లలకు దూరాభారం పెంచారు. ఇప్పుడు మండలానికో బాలికల జూనియర్‌ కళాశాల అంటూ ఇంటర్‌ విద్యార్థినుల భవిషత్తుతో సర్కారు ఆటాడుకుంటోంది. సౌకర్యాలు లేకపోయినా హడావుడిగా కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధ్యాపకుల కొరత ఉన్నా, ల్యాబ్‌లు లేకపోయినా అవే బాలికల కళాశాలలు అంటూ ఇంటర్‌ విద్యకు కొత్త భాష్యం చెబుతోంది. తాజాగా పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ దీనిపై జారీ చేసిన ఆదేశాలు ఈ గందరగోళానికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక బాలికల కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ఇటీవల ప్రకటించారు. 328 కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. మరో 292 ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసి బాలికల కోసం ఇంటర్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇంటర్‌ కాలేజీలు ఈ నెల 1న ప్రారంభం కాగా, బాలికల కళాశాలలపై పాఠశాల విద్యా శాఖ తీరికగా ఈ నెల 5న ఆదేశాలు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించాలని, వాటికి అడ్మిషన్లు స్వీకరించాలని ఆదేశించింది. అవి కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొనసాగుతాయని తెలిపింది. ఈ నెల 1న సాధారణ ఇంటర్‌ కాలేజీలు ప్రారంభం కాగా, వాటితో పాటు వీటినీ ప్రారంభించాలంటూ వింత ఆదేశాలు ఇచ్చింది. ఇదెలా సాధ్యమంటూ ఉపాధ్యాయులు అయోమయంలో పడిపోయారు. పైగా తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు సిద్ధం చేయాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే వరకూ ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న బోధనా సిబ్బందినే ఇంటర్‌ బోధనకూ వినియోగించుకోవాలని సూచించారు. అంటే.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం గానీ, అధ్యాపకులను నియమించడం గానీ చేయకుండా బాలికల జూనియర్‌ కాలేజీలను  ప్రారంభించాలని ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలల్లో ల్యాబ్‌లు లేకపోతే సమీపంలోని మోడల్‌ స్కూళ్లను గానీ, జూనియర్‌ కాలేజీల (కో ఎడ్యుకేషన్‌)ను గానీ ఉపయోగించుకోవాలని ఆదేశించింది. మొత్తంగా చూస్తే ఉన్న సౌకర్యాలతోనే ఏదోవిధంగా బాలికల జూనియర్‌ కాలేజీలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇష్టానుసారం కాలేజీల ఏర్పాటు 

పెద్దగా డిమాండ్లు లేకపోయినా ప్రభుత్వం హడావుడిగా మండలానికో బాలికల కళాశాల అంటూ ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమైంది. కాలేజీలు ప్రారంభమయ్యే వరకూ చోద్యం చూసిన పాఠశాల విద్యా శాఖ ఇప్పుడు ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసే చర్యలు చేపట్టింది. గత నెలలో 25 బాలికల కళాశాలలు ఏర్పాటు చేసే విషయంలో అస్తవ్యస్తం చేసింది. బాలురుకు సమీపంలో జూనియర్‌ కాలేజీలు లేకపోయినా ఇష్టానుసారం కో ఎడ్యుకేషన్‌ కాలేజీలను బాలికల కళాశాలలుగా మార్చేసింది. ఈ క్రమంలోనే ఉర్దూ కళాశాలలను కూడా బాలికల కళాశాలలుగా మార్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోయినా ఇంటర్‌ తరగతులు నిర్వహించాలని మొండిగా ముందుకెళ్తోంది. ల్యాబ్‌ల కొరతతో, కేవలం రెండు గ్రూపులతో బాలికల జూనియర్‌ కాలేజీలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పేరుకు బాలికల కళాశాల అంటూ ల్యాబ్‌ల కోసం కో ఎడ్యుకేషన్‌ కాలేజీలకు పంపడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. 


టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు

మండలానికో బాలికల జూనియర్‌ కాలేజీలు ఉంటాయో, ఉండవోనని విద్యార్థినులు గందరగోళంలో ఉన్నారు. తమకు టీసీలు ఇస్తే వేరే కాలేజీల్లో చేరుతామని కోరుతున్నారు. కానీ వారిని అక్కడే కొనసాగించాలనే లక్ష్యంతో టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

Updated Date - 2022-07-07T09:02:46+05:30 IST